అయ్యో... ఎంత కష్టం

by Sridhar Babu |
అయ్యో... ఎంత కష్టం
X

దిశ,తుంగతుర్తి : అటు ముగ్గురు...ఇటు ముగ్గురు కలిసి కావడితో పోతున్న ఈ దృశ్యాన్ని చూస్తున్నవారికి ఏమనిపిస్తుంది...? ఆ ఏముంది..! వాగు దాటుతూ తమకు చెందిన ఏ సామాగ్రినో తీసుకుపోతున్నారులే... అని అనుకోవచ్చు... కానీ ఇక్కడ విషయం తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అయ్యయ్యో..! పాపం వారికి ఎంత కష్టం వచ్చే... అంటూ ముక్కున వేలేసుకుంటారు. ఇక విషయానికొస్తే....సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన పడిశాల కుటుంబరావు మంగళవారం తన వ్యవసాయ పనుల్లో నిమగ్నం కాగా తేలు కుట్టింది. అయితే అతన్ని చికిత్స నిమిత్తం అక్కడి నుండి తుంగతుర్తి లేదా సూర్యాపేట ప్రాంతాలకు తీసుకెళ్లాలంటే మధ్యలో ప్రమాదకరంగా ఉప్పొంగుతున్న చిత్తలూరి బంధం వాగును దాటాల్సి ఉంది.

అయితే అక్కడికి గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మిరియాల నాగయ్య ఆధ్వర్యంలో ధైర్యంతో ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చారు. బాధితుడైన కుటుంబరావుని దుప్పటిలో కట్టి దాన్ని కర్ర మధ్యలో కట్టి అటు ముగ్గురు ఇటు ముగ్గురు కలిసి భుజాన వేసుకొని బంధం వాగును భయం...భయంగా దాటుకుంటూ వెలుగు పల్లి గ్రామం వైపు వచ్చారు. అక్కడి నుండి ఒక ఆటో ద్వారా తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొంది ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. ఏ చిన్న వర్షం కురిసినా కేశవాపురం గ్రామ పరిధిలో ఉన్న బోడబండ, కేశవాపురం, రాజన్న తండా ప్రాంతాలలో ఉన్న దాదాపు 600 మందికి పెద్ద కష్టమే వస్తుంది. ఎందుకంటే వీరంతా ఏ చిన్న పనిమీద నైనా పక్కనే ఉన్న వెలుగుపల్లి గ్రామానికి రావాల్సి ఉంటుంది.

అయితే ఈ రెండు గ్రామాల మధ్య చిత్తలూరి బంధం ఉంది. పైనుండి రుద్రమ చెరువు తదితర ప్రాంతాల కుంటలన్నీ నిండి నీరంతా చిత్తలూరి బంధం మీదుగా ప్రవహిస్తే రాకపోకలు పూర్తిస్థాయిలో నిలిచిపోతాయి. అయితే 3 రోజులుగా కురిసిన వర్షాలతో వాగు ప్రవాహం ప్రమాదకరంగా మారింది. ఇదిలా ఉంటే చిత్తలూరు బంధంపై బ్రిడ్జి నిర్మించాలనే డిమాండు గత కొన్నేళ్ల నుండి కేశవాపురం గ్రామస్తుల్లో ఉంది. చివరికి రెండు మాసాల క్రితం ఈ విషయం స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్ దృష్టికి పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మిరియాల నాగయ్య తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే స్పందించడంతో ఇంజనీరింగ్ అధికారులు రూ. ఒక కోటి వ్యయంతో అంచనాలు తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. కానీ దీనిపై ఇంకా ఫలితం మాత్రం వెలువడలేదు.

Advertisement

Next Story

Most Viewed