నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి..

by Sumithra |
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి..
X

దిశ, నాగార్జున సాగర్ : కృష్ణా నది ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో మరోసారి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఎగువన ఉన్న కర్ణాటకలోని పలు జిల్లాలో మూడు రోజుల నుంచి విస్తారంగా వానలు పడడంతో కృష్ణా, తుంగభద్ర నదులకు వరద పోటెత్తింది. దీంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. పై నుంచి వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు 18 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 1,45,800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఇన్ ఫ్లో :1,90,198 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 1,90,198 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలతో కలిపి ప్రస్తుత నీటిమట్టం : 590.00 అడుగులు. పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు.. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ : 312.450 టీఎంసీలు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450. ఉంది

గేట్లు తెరుచుకోవడంతో...

జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. దీంతో నాగార్జున సాగర్ లో పోలీసులు అప్రమత్తమయ్యారు. బందోబస్తును నిర్వహిస్తున్నారు. గేట్లు తెరుచుకోవడంతో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. ఈ రోజు ఆదివారం కావడంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. డ్యాం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. డ్యాం వద్దకు వాహనాలు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. జెన్ కో కార్యాలయం వరకే వాహనాలకు పోలీసులు అనుమతి ఇస్తున్నారు

నాగార్జునసాగర్‌కి పెరిగిన పర్యాటకుల రద్దీ

ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. నాగార్జున సాగర్‌ డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సెలవు కావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు నాగార్జున సాగర్‌ డ్యాంకు తరలివచ్చారు. సాగర్‌ గేట్ల ద్వారా జాలువారే నీటిని వీక్షిస్తున్నారు.

Advertisement

Next Story