జడ్పీ, ఎంపీపీ ఆఫీస్ మధ్య గోడ చిచ్చు...

by Sumithra |
జడ్పీ, ఎంపీపీ ఆఫీస్ మధ్య గోడ చిచ్చు...
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ప్రహరీగోడ విభేదాలను సృష్టిస్తోంది. అధికార బీఆర్ఎస్ నాయకులు జడ్పీచైర్మన్ వర్సెస్ ఎమ్మెల్యే వర్గీయులు బస్తీమే సవాల్ అని ఒకరికి ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. ప్రహరీ గోడ నువ్వు కడితే నేను కూల్చేస్తా అనే స్థాయిలో వివాదం చెలరేగింది. గోడ పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు చేరింది. సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాన్ని ఆపేది లేదని జిల్లా పరిషత్ అధికార యంత్రాంగం అంటుంది.

జడ్పీ చైర్మన్ వర్సెస్ ఎమ్మెల్యే..

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నట్లు గతంలో ఆరోపణలు బలంగా వినిపించాయి. వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని వారు కొట్టి పారేస్తున్న కొన్ని కొన్ని సందర్భాలలో బహిర్గతం అవుతూ వచ్చాయి. ఇటీవల మండల పరిషత్ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయాల మధ్య ప్రహరీ గోడ నిర్మాణం మళ్లీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిల మధ్య విభేదాలు ఉన్నట్లు స్పష్టమవుతున్నాయి.

తీర్మానంలో అందరి మద్దతు..

జడ్పీ ఆఫీస్ మండల, పరిషత్ ఆఫీస్ మధ్య ప్రహరీ గోడ నిర్మించాలని ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. జడ్పీ ఆఫీస్ లో రికార్డులు, కంప్యూటర్ల రక్షణ నిమిత్తం ప్రహరీ గోడ నిర్మించాలని నిర్ణయించారు. జడ్పీ ఆఫీస్ గేటు మూసినప్పటికీ మండల పరిషత్ ఆఫీస్ ముందు గేటు నుండి గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి వచ్చి మద్యం సేవించి రాత్రిళ్ళు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జడ్పీసీఈఓ కృష్ణారెడ్డి తెలిపారు.

గోడను నిర్మిస్తే రాజీనామా చేస్తామని ఎంపీపీ వర్గం..

పునాది తీసి నిర్మాణం చేపట్టిన ప్రహరీ గోడను శుక్రవారం ఎంపీపీ నరాల నిర్మల భర్త నరాల వెంకటస్వామి కొంతమంది ఎంపీటీసీలతో కలిసి కూల్చివేశారు. గోడ నిర్మాణం మళ్లీ జరిపితే మండల ప్రజాపరిషత్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తామని హెచ్చరించిన భువనగిరి మండలానికి చెందిన ఎంపీపీ, వైస్ఎంపీపీ, ఎంపీటీసీలు హెచ్చరిస్తున్నారని సమాచారం. ప్రహరీ గోడ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మండల పరిషత్ లో తీర్మానం చేసి 34 గ్రామపంచాయతీల సర్పంచులు, 13 మంది ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీలు కలిసి ఉన్నతాధికారులకు అందజేసారు. గోడ నిర్మించడం వల్ల మీటింగులు జరిగినప్పుడు పార్కింగ్కు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని మండల పరిషత్ వర్గం వాదన. వాహనాల పార్కింగ్ కంటే రానున్న ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సామాగ్రి, ఆఫీస్ సామాగ్రి, రికార్డుల రక్షణ ముఖ్యమని జెడ్పి ఆఫీస్ వర్గం వాదిస్తుంది.

Advertisement

Next Story