బీజేపీ అధిష్టానానికి ఆ ముగ్గురి పేర్ల జాబితా..

by Naresh |   ( Updated:2023-09-01 11:18:52.0  )
బీజేపీ అధిష్టానానికి ఆ ముగ్గురి పేర్ల జాబితా..
X

దిశ, తుంగతుర్తి: బీజేపీ తరఫున తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి ముందుకొస్తున్న ఆశావాదుల పేర్ల జాబితా ఆ పార్టీ అధిష్టానం సేకరించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించి ఆశావాదుల నుండి పేర్లను స్వీకరించారు. తొలుత ఎస్సీ రిజర్వుడైన తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ పటిష్టతపై ఆయన ఆరా తీశారు. అంతేకాకుండా ఏ రూపాన వెళితే ప్రజలకు పార్టీతోపాటు నాయకులు దగ్గరవుతారు..? అనే అంశాలపై సూచనలు చేస్తూ రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తారు..? అంటూ ప్రశ్నించారు. చివరికి ప్రస్తుత పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కడియం రామచంద్రయ్యతో పాటు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబు, జిల్లా ఉపాధ్యక్షురాలు పేరాల పూలమ్మలు పోటీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చి అందుకు తగిన వివరాల సమాచారం అందజేశారు.

కాగా 2009లో ఎస్సీ రిజర్వుడ్ అయిన తర్వాత తుంగతుర్తి అసెంబ్లీ నుండి మల్లెపాక సాయిబాబు పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఆనాడు మారిన పరిస్థితులతో సాధ్యపడలేదు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావుకు నమ్మిన వ్యక్తులలో సాయిబాబు ఒకరు. అయితే ఈసారి కచ్చితంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక కడియం రామచంద్రయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 3 వేల పైచిలుకు ఓట్లను మాత్రమే పొందగలిగారు. ఇక పేరాల పూలమ్మ తిరుమలగిరి మండలం ఈటూరు (ప్రస్తుతం నాగారం మండలం) గ్రామ సర్పంచిగా, తిరుమలగిరి మండల జడ్సీటీసీగా పని చేశారు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో టిక్కెట్ ఆశిస్తున్న వారిపై పార్టీ అధిష్టాన వర్గం పలు రకాలుగా సర్వేలు చేపట్టింది. ఆ సర్వేలో ఎవరి పేరు ఉందో మరికొన్ని రోజుల్లో తేలనుంది.

Advertisement

Next Story