ఖరీఫ్ పంటకు ఇబ్బంది రానివ్వం

by Sridhar Babu |
ఖరీఫ్ పంటకు ఇబ్బంది రానివ్వం
X

దిశ, చిలుకూరు : ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఖరీఫ్ పంటకు నీరందిస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతులకు భరోసా కల్పించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని ఆర్లెగూడెం, రామ్ నగర్ సమీపంలోని ఎన్ఎస్పీ రెడ్లకుంట మేజర్ కాలువకు గండి పడింది. దీంతో కాలువకు నీటి విడుదల నిలిపి వేయడంతో రైతుల పొలాలకు నీరందక అవి ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ ఆదివారం అధికారులతో కలిసి గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం, చిలుకూరు మండలం ఆర్లెగూడెం, హుజూర్ నగర్ మండలం కరక్కాయలగూడెం సమీపంలోని సాగర్ కాలువలకు పడిన గండ్లను కేంద్ర సాయం కోసం ఎదురు చూడకుండా వారం రోజుల్లోగా పూడ్చి వేసి రైతుల పొలాలకు నీరందిస్తామని హామీ ఇచ్చారు.

అధికారులు ఈ వారం పాటు 24 గంటలు విధులు నిర్వహిస్తూ గండ్లను పూడ్చి పంటలను కాపాడాలని అన్నారు. నియోజకవర్గాల్లోని నారాయణపురం, బూరుగడ్డ, చౌటపల్లి చెరువులు తెగి దిగువ ప్రాంత రైతులు నష్టపోయారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చెరువుల మరమ్మతులకు ఈ రోజే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. రైతులు అధైర్య పడొద్దని, ఈ ప్రజా ప్రభుత్వం వారికి ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. పర్యటనలో మంత్రి వెంట కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు, చిలుకూరు తహసీల్దార్ ధృవ్ కుమార్, ఆర్ఐ సీతారామచంద్రరావు, మాజీ ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, కాంగ్రెస్ నాయకులు చింతకుంట లక్ష్మీనారాయణరెడ్డి, కీత వెంకటేశ్వర్లు, యడవెల్లి పుల్లారావు, బండ్ల కోటయ్య, సాగర్ల నాగేశ్వరరావు, అల్లి వీరబాబు, గొర్లె హుస్సేన్, గంటం వెంకయ్య, వీరనారాయణ, కొండా నర్సింహారావు, దొంతగాని నర్సింహారావు, షేక్ హస్నా, మీసాల లింగయ్య, రాయబారపు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed