కమ్యూనిస్టుల ప్రజా పోరాటాల్లో మహిళల పాత్ర కీలకం: కూనంనేని

by Julakanti Pallavi |
కమ్యూనిస్టుల ప్రజా పోరాటాల్లో మహిళల పాత్ర కీలకం: కూనంనేని
X

దిశ, చిలుకూరు: పేదల సంక్షేమం కోసం అనునిత్యం పోరాడే కమ్యూనిస్టు నాయకుల పోరాటాల వెనుక మహిళల పరోక్ష పాత్ర వెలకట్టలేనిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం చిలుకూరులో ఉమ్మడి నల్లగొండ జిల్లా సీపీఐ మాజీ కార్యదర్శి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డా నారాయణరావు సతీమణి సక్కుబాయమ్మ దశదిన కర్మ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి హాజరైన కూనంనేని మాట్లాడుతూ ప్రజా క్షేమమే పరమావధిగా భావించి రోజులకు రోజులు కుటుంబాలకు దూరంగా ఉండే కమ్యూనిస్టు నాయకులకు వారి భార్యలు అందించే సహకారం, కుటుంబ సభ్యుల బాగోగులను చూసుకునే బాధ్యతల నిర్వహణ కారణంగానే కమ్యూనిస్టు నాయకులు ముందడుగు వేస్తున్నారని కొనియాడారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలం నుంచి దొడ్డా నారాయణరావు రాజకీయ ప్రస్థానంలో కూడా సక్కుబాయమ్మ పరోక్ష పాత్ర, పార్టీ నాయకులను ఆప్యాయంగా ఆదరించే ఆమె తీరు సదా స్మరణీయమని కూనంనేని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో ఆటుపోట్లు ఉంటాయని, కాలానుగుణంగా కమ్యూనిస్టులు వ్యూహాలు మార్చుకుంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. సక్కుబాయమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యుడు డా.జాస్తి సుబ్బారావు అధ్యక్షత వహించగా రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, సీపీఐ జాతీయ సమితి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, బాగం హేమంతరావు, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం జిల్లాల సీపీఐ కార్యదర్శులు బెజవాడ వెంకటేశ్వర్లు, నెల్లికంటి సత్యం, పోటు ప్రసాద్, మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, గ్రామ కార్యదర్శులు చిలువేరు ఆంజనేయులు, షేక్ సాహెబ్ అలీ, నాయకులు కొండా కోటయ్య, ఉస్తెల సృజన, రెమిడాల రాజు, నంద్యాల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story