‘హస్తం’ పార్టీలో బడుగు, బలహీన వర్గాలకుగౌరవమేది ?

by Javid Pasha |
‘హస్తం’ పార్టీలో బడుగు, బలహీన వర్గాలకుగౌరవమేది ?
X

దిశ, నల్లగొండ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో బడుగు, బలహీన వర్గాల నేతలకు సరైన గౌరవం దక్కడం లేదనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతలపై దాడులు, బెదిరింపులు, అవమానాలు జరుగుతున్నా అధిష్టానం పట్టించుకోవడం లేదు. ఫలితంగా అనేక మంది పార్టీకి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన నేతలకే ప్రాధాన్యం దక్కుతుందని, పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతానికి కృషి చేస్తుంటే తమకు కనీస గౌరవం దక్కడం లేదని కొందరు బడుగు, బలహీన వర్గాలకు చెందిన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లెవల్‌లో మంచి పట్టున్నది. అనేక మంది నేతలు పార్టీ మారినా ఉన్న కొద్ది మంది నేతలు, ప్రధానంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన నేతలు..కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే పార్టీకి ఊపిరిగా ఉన్న తమకు సరైన గౌరవం దక్కడం లేదని, తమను దూషిస్తున్నా, అవమానిస్తున్నా, దాడులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని బడుగు, బలహీన వర్గాలు, దళిత వర్గాలకు చెందిన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు.

అవమానాలు భరించలేకే..

గతంలో మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి మరణించిన తర్వాత భువనగిరి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన లింగమయ్య యాదవ్, గత ఎన్నికల్లో ఆలేరు నుంచి పోటీ చేసిన బూడిద బిక్షమయ్య గౌడ్, భువనగిరిలో గతంలో పోటీ చేసి పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కోదాడ నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఉన్న ఎర్నేని బాబు, రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ పుల్లెంల వెంకట నారాయణ గౌడ్ లాంటి నేతలందరో ఇప్పుడు కనిపించకుండా పోయారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది..ఎవరి వల్ల వచ్చిందనేది జనమెరిగిన సత్యం. అంతే కాదు గతంలో డీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన వంగాల స్వామిగౌడ్, సుంకరి మల్లేశ్ గౌడ్ లాంటి నేతలు ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో కూడా అందరికీ తెలిసిందే. కాంగ్రెస్‌లో బడుగు, బలహీన వర్గాల నేతలకు సరైన గౌరవం దక్కక పోవడం వల్లే అనేక మంది నేతలు బయటకు వెళ్లిపోయారని, ఉన్న వారికి కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని నేతలు పేర్కొంటున్నారు.

ఆ నలుగురు చేతిలోనే ..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలలో రిజర్వేషన్ కోటాలో ఎస్సీలకు నకిరేకల్, తుంగతుర్తి, ఎస్టీ కోటలో దేవరకొండ నియోజకవర్గం ఉన్నది. మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో ఒక్కరికి కూడా బీసీలకు టికెట్ వస్తుందన్న పరిస్థితి లేదు. ఈ నియోజక వర్గాలన్నీ ఆ నలుగురు సీనియర్ నేతల ఆధీనంలోనే ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతిలో ఆలేరు, భువనగిరి, నకిరేకల్, మునుగోడు, నల్లగొండ ఉంటే సూర్యాపేట, తుంగతుర్తి నియోజక వర్గాలు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి చేతిలో ఉన్నాయి. ఇక కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలు మాజీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఉండగా, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి పరిధిలో మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజక వర్గాలున్నాయి.

రెండు నియోజక వర్గాల్లోనే కనిపిస్తున్న నేతలు

ఆలేరు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న యాదవ సామాజిక వర్గానికి చెందిన బీర్ల ఐలయ్య, మునుగోడు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన పున్న కైలాష్ నేతలు ఉన్న వారికి సరైన ప్రాధాన్యత గౌరవం లేదనే భావన ఉంది .అంతేకాకుండా వారికి పార్టీ టికెట్ వస్తుందన్న ఆశ కూడా అంతంతే. మిగతా ఎక్కడా కూడా బీసీ నేతలు కనిపించడం లేదు.

ఇలాగైతే కష్టమేనా..

బడుగు, బలహీన వర్గాల నేతలకు ప్రాధాన్యత దక్కక పోతే రానున్న రోజుల్లో పార్టీ మనుగడ కష్టమేనన్న భావన అందరి నేతల్లోనూ కలుగుతున్నది. అందరినీ కలుపుకొని ముందుకెళ్తే అధికారంలోకి రావడం పెద్ద సమస్యేమీ కాదని, ఆ దిశగా అధిష్టానం చర్యలు తీసుకోవాలని నేతలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed