నల్లగొండ మున్సిపాలిటీలో అక్రమాలు..

by Sumithra |
నల్లగొండ మున్సిపాలిటీలో అక్రమాలు..
X

దిశ, నల్లగొండ బ్యూరో : జిల్లాలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులు ఏదో ఒక రూపంలో కార్మికుల కష్టాన్ని దోచేస్తున్నారు. అధికారులకు తెలిసినప్పటికీ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అమాయకులు, నిరక్ష్యరాస్యులైన కార్మికుల బలహీనతలను ఆసరాగా చేసుకుని సొమ్మును మింగేస్తున్నారు. చనిపోయిన వాళ్ళ పేర్ల మీద కూడా వాళ్ల కష్టాన్ని తమ జేబుల్లో నింపేసుకుంటున్నారు.

నల్గొండ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో 703 మంది కార్మికులు ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నారు. వీళ్లంతా ఉదయం నాలుగు గంటల నుంచి దాదాపు రెండు గంటల వరకు వీధిలోని శుభ్రం చేసి మురికి కాలువలను శుభ్రం చేసి పట్టణాన్ని తీర్చిదిద్దుతారు. ఔట్ సోర్సింగ్ విధానంలో 2021 జూన్ వరకు మున్సిపల్ కార్మికులకు వేతనాలు రూ. 14వేలు చెల్లించారు. ఆ తర్వాత రెగ్యులర్ ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేసే కార్మికులకు కూడా గత ప్రభుత్వం పీఆర్సీ ఇచ్చింది. దాంతో కార్మికుల జీతాలు రూ.16,500లకు పెరిగాయి. అయితే పెరిగిన వేతనాలు 2022 మే నుంచి చెల్లించినట్లు సమాచారం.

ఏరియర్స్ సొమ్ము స్వాహా.. ?

పెరిగిన పీఆర్సీతో కలిపి మున్సిపల్ కార్మికుల వేతనాలను రూ.16,500 జూన్ 2022 నుంచి ప్రతి నెల మున్సిపల్ అధికారులు చెల్లించినట్లు సమాచారం. అయితే 2021 సెప్టెంబర్ నుంచి 2022 మే వరకు సుమారు 9 నెలలకు 703 మంది కార్మికులకు ఏరియర్స్ ఒక్కొక్కరికి దాదాపు రూ. 34 వేల చొప్పున రూ.1.90లక్షలు రావాల్సి ఉంది. అయితే ఈ సొమ్ములో రాజకీయ పలుకుబడి ఉండి పనిచేసే కార్మికులు, అధికారుల అండదండలతో పనిచేసేవాళ్ళు, ఇతరత్రా గట్టిగా నిలదీసే కార్మికులకు చెందిన వారిలో సుమారు 300 మందికి పైగా ఏరియర్స్ సొమ్మును చెల్లించినట్లు సమాచారం. మిగతా 300 మంది సొమ్మును అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులు కాజేసినట్లు సమాచారం.

పని మధ్యలో బంద్ చేసిన కార్మికులు, చనిపోయిన కార్మికులకు సంబంధించిన ఏరియర్స్ సొమ్మును సంబంధిత శాఖలో పనిచేసే ఓ కంప్యూటర్ ఆపరేటర్ స్వాహా చేసినట్లు సమాచారం. చనిపోయిన ఓ మున్సిపల్ కార్మికుడి భార్యకు ఉద్యోగం ఇచ్చారు. చనిపోయిన కార్మికుడికి సంబంధించిన ఏరియర్స్ ఇవ్వకపోవడంతో భార్య కంప్యూటర్ ఆపరేటర్ను నిలదీసి, మున్సిపల్ ఆఫీసులోనే రచ్చ రచ్చ చేసినట్లు సమాచారం. ఈ పంచాయతీని ఓ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చొరవ తీసుకొని కాజేసిన డబ్బులను కంప్యూటర్ ఆపరేటర్ నుంచి ఇప్పించినట్లు సమాచారం. ఏరియర్స్ స్వాహా చేసిన విషయమై మంత్రి దృష్టికి కూడా వెళ్లిందని, ఆయన కూడా సంబంధిత ఔట్ సోర్సింగ్ ఏజెన్సీదారుడు పై, కంప్యూటర్ ఆపరేటర్, మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇప్పటికైనా ఏరియర్స్ సొమ్ము స్వాహా పై పూర్తిస్థాయిలో విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి రావచ్చని చర్చ జరుగుతుంది.

విచారణ చేస్తున్నాం.. సయ్యద్ ముసాబ్ అహ్మద్ మున్సిపల్ కమిషనర్, నల్లగొండ

మున్సిపల్ కార్మికుల ఏరియర్స్ సొమ్ము మెక్కేశారని ఒకరిద్దరు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు కూడా చేశారు.. దాని పై విచారణ చేస్తున్నాం. ఎవరైనా దోషులుగా తేలితే చర్యలు తీసుకుంటాం.

Next Story

Most Viewed