Huzurabad: మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై ఉత్కంఠ.. రేసులో ఆ ముగ్గురు?

by Shiva |
Huzurabad: మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై ఉత్కంఠ.. రేసులో ఆ ముగ్గురు?
X

దిశ, హుజురాబాద్ రూరల్: హుజూరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఆసక్తికర పోటీ నెలకొంది. చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడంతో పోటీ పరిమితంగానే ఉన్నా ముగ్గురు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఓడితల ప్రణవ్ బాబు మద్దతు సంపాదించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అలాగే జిల్లా బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. జిల్లాలోనే చెప్పుకోదగిన మార్కెట్ హుజూరాబాద్. మొత్తం మార్కెట్ పరిధిలో ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, హుజూరాబాద్ మండలాలు, 55 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

మార్కెట్‌లో వరి, మొక్కజొన్న క్రయవిక్రయాలు కొనసాగుతాయి. 1985లో ఏర్పడిన ఈ మార్కెట్ కమిటీకి మొదటగా బీసీ వర్గానికి చెందిన తోట రాజేంద్రప్రసాద్ చైర్మన్ అయ్యారు. అనంతరం మేకల మధుసూదన్ రెడ్డి, పోల్సాని రామారావు, కేతిరి సుదర్శన్ రెడ్డి, ఎడవెల్లి కొండల్ రెడ్డి చైర్మన్లుగా పని చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లను ఏర్పాటు చేసింది. రిజర్వేషన్ల దామాషా ప్రకారం మొదటగా హుజూరాబాద్ మార్కెట్ కమిటీ ఎస్టీ వర్గానికి రిజర్వ్ చేశారు. దీంతో సైదాపూర్ మండలంలోని రాయికల్ తండా గ్రామానికి చెందిన బర్మావత్ రమ యాదగిరి నాయక్ చైర్మన్ అయ్యారు. మళ్లీ రెండోసారి జనరల్‌కు కేటాయించడంతో ఎడవల్లి కొండాల్‌రెడ్డి రెండోసారి చైర్మన్‌గా పని చేశారు.

తాజాగా హుజూరాబాద్ మార్కెట్ కమిటీని జనరల్ మహిళకు కేటాయించారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇంతకాలం పదవులకు దూరంగా ఉన్న ముగ్గురు కాంగ్రెస్ నాయకులు పోటీదారులుగా తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. విధాన నిర్ణయం ప్రకారం జిల్లా ఇన్చార్జి మంత్రులు పాలకవర్గాల పేర్లను సూచిస్తూ వ్యవసాయ శాఖకు లేఖలు పంపుతారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొనసాగుతున్న ప్రణవ్ బాబు అభిప్రాయంతో పాటు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయం మేరకు లేఖల ఆధారంగా వ్యవసాయ శాఖ మంత్రి ఆమోదం‌తో పాలక వర్గాలు ఏర్పాటు కానున్నాయి.

ఆశావహుల ప్రయత్నాలు..

మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం హుజూరాబాద్ మండలం ఇప్పల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గూడూరు సోమిరెడ్డి సతీమణి రాజేశ్వరితో పాటు మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మేకల తిరుపతి సతీమణి స్వరూప, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు వేముల పుష్పలత పోటీ పడుతున్నారు. కాగా, స్థానిక నాయకుల అభిప్రాయం మేరకు అభ్యర్థి ఎంపిక జరపనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణవ్‌బాబు ఆశావాహులకు సంకేతాలు ఇస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed