రోడ్డు ప్రమాదాల నివారణకు నిధులు మంజూరు

by Naveena |
రోడ్డు ప్రమాదాల నివారణకు నిధులు మంజూరు
X

దిశ,భూదాన్ పోచంపల్లి: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జలాల్పురం చెరువు కట్టను ఆర్ అండ్ బి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న మూలమలుపును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే కొత్తగూడెం నుంచి పోచంపల్లి వరకు డబల్ రోడ్డు నిర్మాణం జరిగిందన్నారు. ఈ రహదారిలో మూలమలుపులు ఎక్కువగా ఉండడంతో..తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.నెల రోజుల కిందట హైదరాబాదుకు చెందిన ఐదుగురు యువకులు చెరువులో పడి మృతి చెందడం బాధాకరమైన సంఘటన అని పేర్కొన్నారు. గత పది ఏండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే 20 లక్షల రూపాయలు మంజూరు చేసిందన్నారు. ప్రమాదాలను నివారించేందుకు చెరువు కట్ట మూలమలుపుపై మార్కింగ్ సైన్ బోర్డులు, మెటల్ రక్షణ కవచం, రంబుల్ స్ట్రిప్స్, ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేసేందుకు నిధులను మంజూరు చేశామని, జనవరి మొదటి వారంలో టెండర్లను పూర్తి చేసి, రెండో వారంలో పనులు ప్రారంభించనున్నామన్నారు. అనంతరం మండలంలోని దంతూరు, జిబ్లక్పల్లి గ్రామాల్లో ఇటీవల మరణించిన కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్, పట్టణ అధ్యక్షులు భారత లవ కుమార్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మర్రి నరసింహారెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు సామ మధుసూదన్ రెడ్డి, కళ్లెం రాఘవరెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, ఆర్ అండ్ బి డిఈ సుగంధర్, ఏఈ లింగయ్య, నాయకులు తడక రమేష్,గోరంటి శ్రీనివాస్ రెడ్డి, పకీరు నర్సిరెడ్డి ,ఉప్పునూతల వెంకటేష్ యాదవ్, కొట్టం కరుణాకర్ రెడ్డి, ఎరుపుల శ్రీనివాస్, గునిగంటి వెంకటేష్ గౌడ్, కుక్క కుమార్, జింకల కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed