కోతులతో భయం..భయం

by Naveena |
కోతులతో భయం..భయం
X

దిశ,తుంగతుర్తి: కోతుల స్వైర విహారం రోజురోజుకు పెరిగిపోతోంది.కోతులు చేసే దాడులతో అనేకమంది గాయపడుతున్నారు.ఒకప్పుడు కోతిని దైవంగా భావిస్తూ పూజించేవారు.. నేడు వాటిని చూస్తేనే భయకంపితులవుతు చీదరించుకుంటున్నారు.కొంతమంది అయితే ఇళ్లలో నుంచి బయటికి రావాలంటేనే వణికి పోతున్నారు. చివరికి అవస్థలు ఎన్నాళ్ళు రా దేవుడా...? అంటూ మదన పడిపోతున్నారు. తుంగతుర్తి మండలంలో కోతులతో ఓ వైపు పంట పొలాలు నాశనమవుతుండగా.. మరోవైపు ప్రజలు గాయపడుతున్నారు. తాజాగా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన ఒక దినపత్రిక విలేఖరి వంగాల వెంకన్న తన ద్విచక్ర వాహనంపై తుంగతుర్తికి వస్తుండగా.. కోతుల సమూహం ఎదురొచ్చి దాడి చేసే ప్రయత్నం చేస్తుండగా వెంటనే బ్రేకులు వేసిన వెంకన్న కింద పడడంతో రెండు చేతులు విరిగిపోయాయి.దీంతో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగి చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా కొత్తగూడెం,గొట్టిపర్తి,రావులపల్లి,వెంపటి, అన్నారం,కేశవాపురం,గానుగుబండ,తదితర ప్రాంతాల నుంచి కోతుల దాడుల్లో బాధితులైన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరంతా తుంగతుర్తిలోని ఏరియా ఆసుపత్రితో ప్రైవేటు,సూర్యాపేట,తొర్రూరు,తదితర ప్రాంతాలలో చికిత్సలు పొందారు. ఇది ఇలా ఉంటే పలు గ్రామాలలో రైతులు వేసిన వేరుశనగ,పత్తి,నువ్వులు,పంటలపై స్వైర విహారం చేస్తూ.. ధ్వంసం చేస్తున్నాయి. చేతికి అందొచ్చిన పత్తి కాయలను సైతం కొరికి పడేస్తున్నాయి. రైతాంగం నిత్యం పంటల కాపలా ఉన్నప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed