వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదని రైతుల ఆందోళన

by Mahesh |   ( Updated:2024-10-17 10:35:01.0  )
వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదని రైతుల ఆందోళన
X

దిశ, రామన్నపేట: ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ధర తక్కువైనా సరే మిల్లుల వద్దకు ధాన్యం తీసుకెళ్తే అధిక తేమ శాతం ఉన్నదనే పేరుతో రైతులను దోచుకుంటున్నారు. రామన్నపేట మండలం లో వరి కోతలు మొదలై 20 రోజులు గడుస్తున్న ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించ లేదు. దీంతో కోసిన ధాన్యాన్ని తక్కువ ధరకు మిల్లులకు అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో మిల్లర్లు అందినకాడికి దోచుకుంటున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో చేతికొచ్చిన పంట ఎక్కడ నేలపాలవుతుందోనని రైతులు వడ్లను ఆరబోయలేక కోత నుండి నేరుగా రైస్ మిల్లులకు తరలిస్తున్నారు.

ఇదే అదునుగా భావించిన మిల్లర్ల యజమానులు రైతులు తీసుకెళ్లిన వడ్లకు అధిక తేమ శాతం ఉన్నదని సాకుతో బస్తాకు రెండు నుండి నాలుగు కిలోల వరకు కట్ చేస్తున్నారని, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ గిట్టుబాటు ధర రూ.2320 ఉండగా ప్రైవేట్ మిల్లర్లు క్వింటాలుకు రూ.1600 నుండి 2000 వరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులకు భారీగా నష్టం వాటిల్లుతుంది. ఇంత జరుగుతున్నా సంబంధిత మార్కెటింగ్ అధికారులు తమకేమీ పట్టనట్టు, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. లేని పక్షంలో ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపడుతామని సంబంధిత రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

అన్ని రకాల ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి

ప్రభుత్వం ఎన్నికల్లో రైతులు పండించిన పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిందని, ఎన్నికల హామీలు అమలు చేసి అన్ని రకాల ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని కోరుతున్నాం. ఇటీవల ప్రభుత్వం సన్నవడ్లకి 500 బోనస్ ఇస్తామని ప్రకటించడం రైతులను మోసం చేసినట్లేనని అన్నారు.:-సాల్వేరు అశోక్ (మాజీ ఎంపీటీసీ రామన్నపేట)

మార్కెట్ కు ధాన్యం తెచ్చి 15 రోజులు అవుతుంది. మార్కెట్లో ధాన్యం పోయడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాలేదని, పోసిన ధాన్యం వర్షానికి తడిసిన, ధాన్యం పై కప్పడానికి టార్పాలిన్ లు ఇవ్వలేమని మార్కెట్ అధికారులు తెలిపారు. టార్పాలిన్లు కొనుగోలు చేసుకొని వడ్లపై కప్పుతున్నాం. వాతావరణం అనుకూలించడం లేదు. ఎప్పుడు వర్షం కురుస్తుందోనని భయం భయంగా ఉంది. అధికారులు చొరవ తీసుకొని వెంటనే మార్కెట్ ను ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి.:-రైతు ఉట్కూరి సత్యనారాయణ రామన్నపేట

Advertisement

Next Story