India Economy: ఆరేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్: ఎస్అండ్‌పీ

by S Gopi |
India Economy: ఆరేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్: ఎస్అండ్‌పీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: 2030 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారనుందని ఎస్అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. ప్రస్తుతం భారత జీడీపీ 3.6 ట్రిలియన్ డాలర్ల నుంచి 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లకు చేరాలనే లక్ష్యంతో ఉంది. మరో మూడేళ్లలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థగా ఉండనుంది. అలాగే, 2030 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుందని ఎస్అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ నివేదిక పేర్కొంది. భారత్‌తో పాటు అభివృద్ధి చెందుతున్న ఇతర ఆర్థికవ్యవస్థలు సైతం అనేక ఆశయాలను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచ ఆర్థికవ్యవస్థను అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎక్కువ ప్రభావితం చేయనున్నాయి. ఈ దేశాలు 2035 నాటికి సగటున 4.06 శాతం జీడీపీ వృద్ధిని సాధించనున్నాయని నివేదిక తెలిపింది. ఆ సమయానికి ప్రపంచ ఆర్థిక వృద్ధికి 65 శాతం మేర ఆయా దేశాలు సహకారం అందిస్తాయి. ఈ వృద్ధి ప్రధానంగా భారత్, చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్ సహా ఆసియా-పసిఫిక్ దేశాల నుంచి రానున్నాయి. అయితే, భారత్‌లో పెరుగుతున్న జనాభా అధిక జనాభాకు అవసరమైన స్థాయిలో సేవలు, ఉత్పాదకత కోసం పెట్టుబడులు కీలక సవాళ్లుగా ఉండనున్నాయని నివేదిక వెల్లడించింది.

Advertisement

Next Story