క్యాబినెట్‌లో ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం దక్కేనా..?

by Sumithra |
క్యాబినెట్‌లో ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం దక్కేనా..?
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం నుంచి బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్నప్పటి వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలు క్రియాశీలక పాత్ర పోషించారు. కానీ కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలకు చోటు దక్కకపోవడం పై విమర్శలు ఎదురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో రంగారెడ్డి జిల్లా ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే రంగారెడ్డి జిల్లా ప్రజలు చేదోడువాదోడుగా ఉండాల్సిందే.

అలాంటప్పుడు మంత్రివర్గంలో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే చర్చ బలంగా వస్తున్నది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టొద్దని జిల్లా నాయకులు భావించినప్పటికీ మంత్రివర్గ విస్తీర్ణంలో జిల్లా నేతల పేర్లు లేవనే ప్రచారం బలంగా వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కాంగ్రెస్​ ఎమ్మెల్యేలంతా ఏఐసీసీ పెద్దలను కలిసి వినతి పత్రాల ద్వారా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని విన్నవించారు. అంతేకాకుండా రాజకీయ కురువృద్ధుడు, కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నాయకుడు జానారెడ్డి అధిష్టానానికి రంగారెడ్డి, హైదరాబాద్​ జిల్లాల నేతలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని లేఖ రాశారు. దీంతో రాష్ట్రంలో పెద్ద చర్చ మొదలైనట్లు తెలుస్తున్నది.

ఎమ్మెల్యేల సంఖ్య లేకపోవడమేనా..?

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 13 నియోజకవర్గాలున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏ పార్టీ అధికారంలో ఉన్నా రంగారెడ్డి జిల్లా నుంచి మర్రి చెన్నారెడ్డి, ఇంద్రారెడ్డి, దేవేందర్​ గౌడ్​, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్​ రెడ్డి మంత్రివర్గంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొత్తగా అధికారంలోకి వచ్చిన బీఆర్​ఎస్​ పార్టీ కూడా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కకపోయినా పట్నం మహేందర్​ రెడ్డికి మంత్రిగా అవకాశం ఇచ్చి రంగారెడ్డి జిల్లాకు గౌరవం ఇచ్చింది. అంతేకాకుండా 2018 ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీకి అత్యధిక స్థానాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గెలిపించారు. అయినప్పటికీ మొదటి మంత్రివర్గంలో మల్లారెడ్డికి అవకాశం రాగా.. కాంగ్రెస్​లో గెలిచిన అత్యధిక ఎమ్మెల్యేలు బీఆర్​ఎస్‌​లో చేరడంతో సబితా ఇంద్రారెడ్డికి సైతం మంత్రిగా అవకాశం కల్పించారు.

కానీ కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తికావొస్తున్నా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నాయకులకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. 2014లో బీఆర్​ఎస్​ పార్టీకి ఉమ్మడి జిల్లాలో 4 స్థా నాలు బీఆర్​ఎస్​, 2 స్ధానాలు కాంగ్రెస్, 7 స్థానాలు టీడీపీ గెలుచుకుంది. అయితే ఆ సమయంలో టీఆర్​ఎస్​ అభ్యర్థిగా తాండూర్​ నియోజకవర్గం నుంచి గెలిచిన పట్నం మహేందర్​ రెడ్డికి మంత్రివర్గంలో ఆ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 9 స్థానాలు బీఆర్​ఎస్​, 4 స్థానాలు కాంగ్రెస్​ కైవసం చేసుకుంది. ఈ ప్రాతిపదికన చూసినా గెలిచిన నలుగురి ఎమ్మెల్యేల్లో ఒకరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే గెలిచిన నలుగురిలో వికారాబాద్​ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్​ కుమార్​‌కు స్పీకర్​ పదవి ఇచ్చారు. ఈ పదవిలో బాధ్యతగా ఉండే వ్యక్తి సాధారణంగా పార్టీలకు అతీతంగా మసులుకోవాల్సి వస్తున్నది. క్రియాశీలక రాజకీయం చేసేందుకు నిబంధనలు అడ్డు వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల సంఖ్యతో సంబంధం లేకుండా మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అతనికే ఫస్ట్​ ప్రియార్టీ..

కాంగ్రెస్​ అధిష్టానం రంగారెడ్డి జిల్లాకు అవకాశం కల్పిస్తే మొదటి ప్రయార్టీ సీనియర్లకే ఇచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రకారం ఆలోచించినా, కొత్తగా ఏర్పడిన జిల్లా ప్రకారం చూసినా సీనియర్ అయిన అతనికే అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. షాద్​ నగర్​ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్​‌కు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ వ్యవహారాల కమిటీల్లో ప్రాధాన్యం ఇచ్చారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పార్టీలో జూనియర్​ కావడంతో వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ప్రచారం సాగుతున్నది. ఒకవేళ కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులకే ఇవ్వాలనే ఆలోచన చేస్తే కాంగ్రెస్ నుంచి ఒకరికి, లేకపోతే ఇతర పార్టీలో గెలిచి వచ్చిన అభ్యర్థులను పరిశీలిస్తే ప్రకాశ్​ గౌడ్​, కాలె యాదయ్య రేసులో ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లా నుంచి అవకాశం కల్పిస్తే మల్​రెడ్డి రంగారెడ్డికే ఫస్ట్​ ప్రియారిటీ ఉండనున్నది.

కొత్త జిల్లా ప్రకారం రంగారెడ్డికి మొండి చెయ్యి..

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కొత్త జిల్లాల ప్రకారం రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో అన్యాయం జరిగినట్లే ననే ప్రచారం ఉంది. రంగారెడ్డి, వికారాబాద్​, మేడ్చల్​ జిల్లాలుగా ఆవిర్భవించాయి. ఈ నేపథ్యంలో వికారాబాద్​ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలుంటే వికారాబాద్​ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్​‌కు స్పీకర్‌​గా.. కొడంగల్​ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎనుముల రేవంత్​ రెడ్డి సీఎంగా ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మేడ్చల్​ జిల్లాలోని ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్​ అభ్యర్థి గెలువలేకపోవడంతో ప్రాతినిథ్యం లేదని చెప్పవచ్చు.

కానీ రంగారెడ్డి జిల్లాలో 8 నియోజకవర్గాలున్నాయి. ఇందులో ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి, షాద్​ నగర్​ నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ అభ్యర్థులు గెలుపొందారు. అంతేకాకుండా అనధికారికంగా చేవెళ్ల, రా జేంద్రనగర్​, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో గెలుపొందిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​‌కు మద్దతుగా నిలిచారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్​ బలం ఆరుకు చేరింది. ఎల్బీనగర్​, మహేశ్వరం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌​లోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్​ పార్టీ రంగారెడ్డి జిల్లాలో బలోపేతం కావాలంటే మంత్రివర్గంలో ఒకరికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని జిల్లా ప్రజలు ముక్తకంఠంతో అధిష్టానాన్ని అడుగుతున్నారు.



Next Story

Most Viewed