- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో దావుద్‌లా లారెన్స్ బిష్ణోయ్.. హీరో సల్మాన్ ఖాన్‌ను హత్యకు ఎందుకు కుట్ర చేశాడంటే?
లారెన్స్ బిష్ణోయ్.. ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నది. మహారాష్ట్రలో అధికార ఎన్సీపీ (అజిత్ పవార్) వర్గానికి చెందిన మాజీ మంత్రి, బాంద్రా మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీని రాత్రివేళ కొందరు దుండగులు నడిరోడ్డుపై ఆరు రౌండ్ల కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు అరెస్టు అవ్వగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. అయితే, సిద్ధిఖీని హత్య చేసింది తామేనని.. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఎవరు సాయం చేసినా వారికి ఇదే దుస్థితి ఎదురవుతుందని ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా బిష్ణోయ్ ముఠా సభ్యులు ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇదే కాకుండా కెనడా ప్రభుత్వం కూడా ఖలిస్థానీ మద్దతుదారుడు నిజ్జర్ హత్యకు భారత్ బిష్ణోయ్ గ్యాంగ్ సపోర్ట్ తీసుకున్నదని ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ గ్యాంగ్ ఎక్కడ పుట్టింది? దీని లక్ష్యం ఏమిటి? తదితర అంశాలపై ప్రత్యేక కథనం..
-కట్ట సాయికుమార్
మరో దావుద్ అవుతాడా..?
గతంలో పంజాబ్ పాప్ సింగర్ ‘సిద్ధూ మూసేవాలా’.. కర్ణిసేన అధినేత ‘సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి’.. ఇప్పుడు ‘బాబా సిద్దిఖీ’ హత్యలతో బిష్ణోయ్ మరోసారి అండర్ వరల్డ్‌ను సృష్టించనున్నడా? 1990లో దావుద్ గ్యాంగ్ ఎలాగైతే ‘డీ’ కంపెనీ పేరుతో ఎక్స్‌టార్షన్, స్మగ్లింగ్, కిరాయి హత్యలు, దోపీడీలకు పాల్పడిందో అలాంటి నేరసామ్రాజ్యాన్ని బిష్ణోయ్ గ్యాంగ్ మళ్లీ ఏర్పాటు చేయనుందా? అని ఊహగానాలు వినిపిస్తున్నాయి. అప్పట్లో దావుద్ ముంబై వేదికగా నేరసామ్రాజ్యానికి మకుటం లేని మహారాజుగా ఉండేవాడు. ప్రస్తుతం ముంబైలో అండర్ వరల్డ్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. దావుద్ పాక్‌లో తలదాచుకోగా.. అతడి గ్యాంగ్ అంతా చెల్లచెదురైంది. మరికొందరు కీలక ముఠా సభ్యులు మరణించారు. ఈ క్రమంలోనే దేశంలో నేరసామ్రాజ్యాన్ని మళ్లీ విస్తరించడానికి బిష్ణోయ్ గ్యాంగ్ ప్రయత్నిస్తోందా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అసలెవరీ బిష్ణోయ్..
పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ జిల్లా ధత్తరన్‌వాలీ గ్రామంలోని సంపన్న కుటుంబానికి చెందిన బిష్ణోయ్.. ఇంటర్ పూర్తయ్యాక పంజాబ్ విశ్వవిద్యాలయ పరిధిలోని డీఏవీ కాలేజీలో చేరాడు. అతనొక జాతీయ స్థాయి అథ్లెట్, పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడిగా కూడా పనిచేశాడు. న్యాయవిద్యను సైతం పూర్తి చేశాడు. కాలేజీ రోజుల్లోనే బిష్ణోయ్‌కు సత్వీందర్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ పరిచయం అయ్యాడు. వీరిద్దరు మంచి స్నేహితులు. కొన్నాళ్లకు వీరిద్దరు కలిసి అసాంఘిక కార్యకలాపాలు చేయడం మొదలుపెట్టారు. స్టూడెంట్ పాలిటిక్స్‌ను అదునుగా చేసుకున్నారు. ఈ క్రమంలోనే డీఏవీ కాలేజీ గ్యాంగ్‌వార్‌లో బిష్ణోయ్ ప్రియురాలిని ప్రత్యర్థి వర్గం సజీవ దహనం చేసింది. ఈ ఘటన అతన్ని మరింత కాఠిన్యుడిగా చేసి నేరాలవైపు ప్రోత్సహించిందని చెప్తుంటారు.
గ్యాంగ్‌వార్స్, స్మగ్లింగ్..
కాలేజీ స్టూడెంట్ లీడర్‌గా ఉన్నప్పుడే గ్యాంగ్ వార్‌లను బిష్ణోయ్ ఆపరేట్ చేసేవాడు. ఆ టైంలో పలు గ్యాంగ్ ఉండేవి. ఇలా ఆధిపత్యం కోసం సాగిన పోరులో లారెన్స్ సన్నిహితుడు జస్విందర్‌ను మరో గ్యాంగ్‌స్టర్ జైపాల్ భుల్లర్ హత్య చేశాడు. వాస్తవానికి బిష్ణోయ్ గ్యాంగ్ రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో విస్తరించడానికి జస్విందర్ కీలకంగా మారాడు. కాలక్రమేణా అతని గ్యాంగ్ సీమాంతర ఆయుధాల స్మగ్లింగ్, మాదక ద్రవ్యాల రవాణాకు కూడా పాల్పడుతోందని గుజరాత్ ఏటీఎస్ ఆరోపించింది. కెనడా నుంచి బిష్ణోయ్ సోదరుడు అన్మోల్, తన మిత్రుడు గోల్డీబ్రార్‌లు ఈ వ్యవహారాలను చక్కదిద్దుతుంటారు. అయితే, 4 రాష్ట్రాల్లో కలిపి బిష్ణోయ్ మీద హత్యాయత్నం, కార్‌జాకింగ్, దోపిడీ, స్నాచింగ్, ఆయుధాల చట్టం కింద మొత్తం 20కి పైగా కేసులున్నాయి. ఈ క్రమంలోనే విదేశీ ఆయుధాలతో కలిగియున్న బిష్ణోయ్‌ను 5 మార్చి 2015న ఫరీద్‌కోట్ పోలీసులు అరెస్టు చేశారు.
సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు..
బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ 1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగులో భాగంగా రాజస్థాన్‌లో కృష్ణ జింకలను వేటాడిన విషయం తెలిసిందే. ఈ కేసులో అతనికి ఐదేళ్ల జైలు శిక్ష పడగా.. రెండ్రోజులు మాత్రమే జైల్లో ఉన్నాడు. అనంతరం బెయిల్ మీద బయటకు రాగా.. నేటికీ ఆ కేసు ఆయన్ను వెంటాడుతోంది. అసలు సల్మాన్ మీద బిష్ణోయ్ ఎందుకు కక్ష కట్టాడంటే.. ‘కృష్ణజింక’లను బిష్ణోయ్ వర్గానికి చెందిన వారు చాలా పవిత్రంగా చూస్తారు. ‘బిష్ణోయ్’ అనేది ఒక మతం కాదు. ఒక సంఘం. 15వ శతాబ్దంలో గురు జంభేశ్వర్ (జంబాజీ) బిష్ణోయ్ సంఘాన్ని స్థాపించగా.. వన్యప్రాణులు, వృక్షసంపద సంరక్షణకు ఈ వర్గం ప్రాధాన్యం ఇచ్చేది. జంబాజీ మరణానికి ముందు.. కృష్ణజింకల్ని తన పునర్జన్మగా భావించాలని చెప్పారట. అప్పటి నుంచి బిష్ణోయిలు కృష్ణజింకలను ప్రేమగా చూసుకుంటారు. సల్మాన్ ఖాన్ వీటిని చంపినప్పుడు బిష్ణోయ్ వయస్సు ఐదేళ్లు. తను పెద్దయ్యాక సల్మాన్ ఖాన్ మీద కోపం పెంచుకోవడంతో పాటు చంపేస్తానని లారెన్స్ బహిరంగంగా ప్రకటించాడు.
2018 నుంచి చంపేందుకు కుట్ర..
2018 నుంచి సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని బిష్ణోయ్ గ్యాంగ్ పనిచేస్తోంది. 2024 ఏప్రిల్14న రెక్కీ నిర్వహించి మరీ బాంద్రాలోని అతని ఇంటిపై కాల్పులు జరిపింది. సల్లూభాయ్ హత్య కోసం సుమారు 25 మందిని బిష్ణోయ్ సిద్ధం చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆ తర్వాత ముంబై శివార్లలోని పన్వెల్‌లో గల విశాలమైన ఫామ్‌హౌస్ వద్ద సల్మాన్ ఖాన్ కారును దారిలో అడ్డగించి గన్‌తో కాల్చి చంపాలని బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ చేయగా.. ముంబై పోలీసులు దాన్ని తిప్పికొట్టారు. ఈ ముఠాకు చెందిన నలుగురు షూటర్లను అరెస్టు చేసి వారి నుంచి AK-47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల సల్మాన్‌కు కట్టుదిట్టమైన భద్రత.. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారానికి మాజీ మంత్రి సిద్ధిఖీ హస్తముందని గ్రహించిన బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ ప్రకారమే అతనిపై కాల్పులు జరిపించి హత్య చేయించింది.
16 మందిపై యూఏపీఏ చట్టం కింద చార్జిషీట్..
లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లతో సహా 16 మంది గ్యాంగ్‌స్టర్లపై యూఏపీఏ చట్టం కింద ఛార్జిషీట్ దాఖలైంది. ఎన్‌ఐఏ తన ఛార్జిషీట్‌లో బిష్ణోయ్ గ్యాంగ్‌ను దావూద్ ఇబ్రహీం యొక్క ‘డీ-కంపెనీ’తో పోల్చింది. అచ్చం దావుద్ లాగానే బిష్ణోయ్ ఉగ్రవాదులతో డీల్స్ చేస్తున్నట్లు ఎన్ఐఏ తేల్చింది. బిష్ణోయ్.. ఈ ఏడాది జూన్‌లో పాకిస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ షాజాద్ భట్టితో సంభాషించినట్లు 19 సెకన్ల వీడియో క్లిప్ ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. 2022లో బిష్ణోయ్ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉండి.. పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యను ఆపరేట్ చేసినట్లు ఆరోపణలొచ్చాయి. అనంతరం ఈ హత్యకు కెనడా నుంచి ఆపరేట్ చేస్తున్న గోల్డీ బ్రార్ బాధ్యత ప్రకటించాడు. ఆ తర్వాత లారెన్స్‌ను పంజాబ్, రాజస్థాన్‌లోని జైళ్లకు మార్చారు. అక్కడ కూడా అతనికి జైలు అధికారులు సాయం చేస్తున్నారని, మొబైల్ ద్వారా బయట గ్యాంగులను ఆపరేట్ చేస్తున్నట్లు ఆరోపణలు రాగా, అహ్మదాబాద్లోని సబర్మతి జైలుకు మార్చారు. తాజాగా ఈ జైలు నుంచి సిద్ధిఖీ హత్యకు కుట్రపన్నినట్లు తెలుస్తోంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఎవరి హత్యకైనా స్కెచ్ వేస్తే బిష్ణోయ్ మౌన నిరాహార దీక్ష పాటిస్తాడని అధికారవర్గాలు పేర్కొన్నాయి.
700 మందికి పైగా ప్రొఫెషనల్ షూటర్లు..
లారెన్స్ బిష్ణోయ్ అరెస్టై జైలులో ఉన్నప్పటికీ.. అతని గ్యాంగులను కెనడా పోలీసులు, భారతీయ ఏజెన్సీల దృష్టిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సత్వీందర్ సింగ్ అలియాస్ ‘గోల్డీ బ్రార్’ వెనుకనుంచి నడుపుతున్నాడు. ప్రస్తుతం బిష్ణోయ్ గ్యాంగ్‌లో 700 మందికి పైగా ప్రొఫెషనల్ షూటర్లు ఉన్నారని, వారిలో 300 మందికి పంజాబ్‌తో సంబంధం ఉందని ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్ తెలిపింది. బిష్ణోయ్, గోల్డీ బ్రార్ చిత్రాలు సోషల్ మీడియాలో రివీల్ అవ్వగా.. నిరుద్యోగ యువత వీరి ముఠాలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 2020-21లో బిష్ణోయ్ గ్యాంగ్ దోపిడీ ద్వారా సంపాదించిన కోట్లాది రూపాయలను హవాలా ద్వారా విదేశాలకు పంపించినట్లు ఏజెన్సీ వర్గాలు గుర్తించాయి.
ఏయే రాష్ట్రాల్లో గ్యాంగులు ఉన్నాయంటే?
ఎన్‌ఐఏ నివేదిక ప్రకారం.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఒకప్పుడు పంజాబ్‌కు మాత్రమే పరిమితం కాగా, తన ఫ్రెండ్ గోల్డీ బ్రార్ సాయంతో వివిధ రాష్ట్రాల్లోని ముఠాలతో జట్టుగా ఏర్పడి భారీ నెట్‌వర్క్‌ను సృష్టించాడు. ఇప్పుడు బిష్ణోయ్ గ్యాంగ్ పంజాబ్, యూపీ, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, జార్ఖండ్ సహా ఉత్తర భారతదేశంలో విస్తరించింది. అంతేకాకుండా కెనడా, యూఎస్‌లో కూడా బిష్ణోయ్ గ్యాంగులు పనిచేస్తున్నాయని సమాచారం. ఇక యువతను తమ ముఠాలోకి ఆహ్వానించేందుకు వారికి విదేశీ టూర్లను ఆఫర్ చేస్తున్నట్లు తెలిసింది. ఎన్‌ఐఏ ప్రకారం.. పాక్ లో ఆశ్రయం పొందుతున్న ఖలిస్తానీ మద్దతుదారు హర్విందర్ సింగ్ కూడా పంజాబ్‌లో హత్యలు, నేర కార్యకలాపాల కోసం బిష్ణోయ్ గ్యాంగులోని షూటర్‌లను ఉపయోగిస్తాడని తెలుస్తున్నది. ఇదంతా పలుకుబడి, తనకంటూ ఓ డాన్ ఇమేజ్ కోసం బిష్ణోయ్ ఇదంతా చేస్తున్నట్లు సమాచారం. అతని హిట్ లిస్టులో సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్, వ్యాపారవేత్తలు సైతం ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి.
కెనడా వాదన ఎంతవరకు నిజం?
ఖలిస్థానీ మద్దతుదారులు బిష్ణోయ్ ముఠా సహకారంతో పనులు చేయించుకుంటారన్నది.. వారికి ఆయుధాలు, మత్తుమందులు పంజాబ్ సరిహద్దుల్లో పాకిస్తాన్ చేరవేస్తుంటుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే, తమ దేశంలో జరిగిన ఖలిస్థానీ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత నిఘా సంస్థలు బిష్ణోయ్ గ్యాంగ్ సహకారంతో వారికి సుపారీ ఇచ్చి చేయించారని ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఖలిస్థానీ మద్దతుదారులపై బిష్ణోయ్ గ్యాంగ్ దాడికి పాల్పడితే వారికి విదేశీ ఆయుధాలు, నకిలీ కరెన్సీ, మత్తుపదార్థాలు ఎలా అందుతాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తన మిత్రుడు గోల్డ్ బ్రార్ కూడా కెనడా కేంద్రంగా బిష్ణయ్ గ్యాంగ్ ను ఆపరేట్ చేస్తున్నాడు. అక్కడే ఉంటూ ఆ దేశానికి వ్యతిరేకంగా గోల్డీ బ్రార్ నిజ్జర్ హత్యను ఆపరేట్ చేశాడా? అన్నది నమ్మశక్యం కాని విషయమే మరి.