రైస్ మిల్లర్ల ధాన్యం కొనుగోలులో కోట్ల స్కాం

by Javid Pasha |
రైస్ మిల్లర్ల ధాన్యం కొనుగోలులో కోట్ల స్కాం
X

దిశ, భూదాన్ పోచంపల్లి: మండలంలోని రామలింగంపల్లి శివారులో ఇంద్రియాల రోడ్డుపై ఉన్న కన్యకా పరమేశ్వరి రైస్ మిల్లు యాజమాన్యం ధాన్యం కొనుగోలులో రోజుకు లక్ష రూపాయలకు పైగా ప్రభుత్వ సొమ్మును కాజేస్తూ రైతులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని నిట్ట నిలువునా మోసం చేస్తూ రైతులకు ప్రత్యక్షంగా పట్టుబడ్డ ఒక బడా స్కాం శుక్రవారం వెలుగు చూసింది. రోజు మాదిరిగానే ఇంద్రియాల, గౌస్కొండ, రామలింగంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి 14 వీల్స్ లారీలో 900 బస్తాల ధాన్యాన్ని తూకం ప్రకారం కన్యకా పరమేశ్వరి రైస్ మిల్లుకు తరలించారు. ధాన్యాన్ని తరలించేటప్పుడు ధాన్యంతో లారీ లోడ్ కాంట లో సరిగ్గా తూకం వేసి పంపించారు కూడా. అయితే సదరు రైస్ మిల్లు యాజమాన్యం వారు సొంత కాంటాలో ప్రతి లారీ లోడ్ మీద 5 క్వింటాళ్ల ధాన్యం తక్కువ వస్తున్నట్లు లెక్క రాసుకొని ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సరిగ్గా తూకం వేసినప్పుడు ఆయా బస్తాలు లెక్క ప్రకారం వేసినప్పుడు తక్కువ బరువు ఎందుకు వస్తుంది అనే అనుమానంతో బీఆర్ఎస్ నాయకులు నోముల మాధవరెడ్డి, రామలింగంపల్లి ఉప సర్పంచ్ నరసింహ, వందల మంది రైతులు శుక్రవారం తరలించిన లారీ లోడును బీబీనగర్ లో కాంటాలో తూకం వేయగా వారి లెక్క ప్రకారం సరిగ్గా వచ్చింది. తూకం రశీదు కూడా ఇచ్చారు. అయితే అలాంటప్పుడు మరి రైస్ మిల్లు వద్ద ఉన్న కాంటాలో ఐదు క్వింటాళ్ల ధాన్యం ఎందుకు తక్కువగా చూపిస్తుంది అని అనుమానం వచ్చి వెంటనే దీనిపై రైస్ మిల్లు వారిని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున రైతులు ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు రైస్ మిల్లు యాజమాన్యాన్ని ముట్టడించారు.

రైతులు చెప్పిన వివరాల ప్రకారం సదరు రైస్ మిల్లుకు రోజుకు 10 నుంచి 15 లారీల లోడు ధాన్యాన్ని తరలిస్తారని, ప్రతి లోడుకు పదివేల రూపాయలకు పైగా ప్రభుత్వ సొమ్మును దోచేస్తున్నారని, ఈ లెక్క ప్రకారం దాదాపు రెండు నెలలకు పైగా ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలిస్తే ఎంత మొత్తంలో ప్రభుత్వపు సొమ్ము అక్రమంగా నిట్ట నిలువుగా కాజేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ లెక్క ప్రకారం రైస్ మిల్లు యాజమాన్యం తూకం తక్కువ పేరుతో మిగిలిన రైస్ మిల్లు యాజమాన్యాలు కూడా కొన్ని కోట్లల్లో ప్రభుత్వ సొమ్మును కళ్లుగప్పి నిలువున ప్రత్యక్షంగా దోచుకుంటున్నారని రైతులు మండిపడి సదరు కన్యకా పరమేశ్వరి రైస్ మిల్లును మూత వేయించే పనిలో పడ్డారు. దీనిపై కలెక్టర్, స్థానిక ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed