వినియోగదారుల ఫోరంలో వసూళ్లు..అంతా తానై నడిపిస్తున్న అధికారి

by Aamani |
వినియోగదారుల ఫోరంలో వసూళ్లు..అంతా తానై నడిపిస్తున్న అధికారి
X

దిశ, నల్లగొండ బ్యూరో : వస్తువులు కొనుగోలు చేసిన వినియోగదారుడు కొనుగోలు చేసిన వస్తువుల్లో నాణ్యత లేకపోవడంతో నష్టపోతే తనకు జరిగిన నష్టాన్ని చూపిస్తూ వినియోగదారుల ఫోరంలో కేసులు వేస్తుంటారు. అయితే ఈ కేసుల్లో నిర్ణీత సమయంలో తీర్పు ప్రకటించాలి. కానీ ఇక్కడ అందుకు పూర్తి విరుద్ధం గా కొనసాగుతుంది. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఫోరంలో కేసులు వాదించడం, ఇక్కడ పనిచేస్తున్న అధికారి అంతా తానై చక్రం తిప్పడం గమనార్హం. ఈ క్రమంలోనే వస్తువులు కొనుగోలు చేసి నష్టపోయిన వినియోగదారుడికి న్యాయం చేయాల్సిన వినియోగదారుల ఫోరంలో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

నత్తనడకన కేసులు..

ఉమ్మడి జిల్లాస్థాయిలో వినియోగదారుల ఫోరం పనిచేస్తుంది. ఫోరంలో యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు చెందిన వినియోగదారులు తమకు వస్తువుల కొనుగోలు విషయంలో నష్టం జరిగితే కేసు వేసి న్యాయం పొందవచ్చు. ఈ క్రమంలోనే ఫోరంలో పలు కేసులు ఉన్నాయి. ఎల్ఐసీ పై ఓ వినియోగదారుడు జరిగిన నష్టాన్ని వివరిస్తూ ఫోరంలో కేసు వేశారు. ఆ కేసు నంబర్ 40/2021. అయితే ఈ కేసు దాదాపు రెండేళ్లకు పైగానే సాగింది. ఆర్టీసీ పై మరో వినియోగదారుడు కేసు నంబర్ 50/2019 కేసు వేశారు. ఇది కూడా రెండేళ్లకు పైగానే సాగదీశారు. అంతేకాకుండా సూర్యాపేటకు చెందిన ఓ వినియోగదారుడు 2021లో కేసు వేస్తే అది కూడా చాలా ఆలస్యంగానే ప్రకటించారు. ఇదిలా ఉంటే నల్లగొండ పట్టణానికి చెందిన ఓ ప్రముఖ హోటల్ లో వాటర్ బాటిల్ ఖరీదు ఎక్కువ తీసుకున్నారని వినియోగదారుడు కేసు నమోదు చేశారు. ఆ కేసులు కూడా దాదాపు సంవత్సరం పాటు సాగదీశారు. అయితే వాస్తవంగా 90 రోజుల్లో ఏ కేసులోనైనా తీర్పు ప్రకటించాల్సి ఉంది. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు కొనసాగుతున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా ఫోరం మాజీ మెంబర్ ప్రాక్టీస్..

నిబంధనలకు విరుద్ధంగా వినియోగదారుల ఫోరం సభ్యుడిగా పని చేసిన ఓ వ్యక్తి తిరిగి అదే ఫోరంలో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది పూర్తిగా వినియోగదారుల ఫోరం నిబంధనలకు విరుద్ధం. 2001 నుంచి దాదాపు పదేళ్ల పాటుగా ఫోరం సభ్యుడిగా పనిచేసిన ఓ వ్యక్తి తన కాలపరిమితి దాటిన తర్వాత అదే ఫోరంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ న్యాయవాది భర్త ప్రస్తుతం మన పక్కనున్న మహబూబ్‌నగర్ జిల్లాలో వినియోగదారుల ఫోరమ్ మెంబర్‌గా పని చేస్తున్నారు. ఇలా కేసులు వాదించడం ఫోరం నియమ నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ అందులో పనిచేస్తున్న ఓ అధికారి అండదండలతోనే ఇదంతా సాగుతుందని తెలుస్తోంది.

అంతా తానై నడిపిస్తున్న అధికారి..

ఫోరం కోర్టులో సీనియర్ అసిస్టెంట్ అంతా తానై నడిపిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానికత పేరుతో కొద్దిరోజుల కిందట నిజామాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. బదిలీ అయిన తర్వాత ఒక్కరోజులోనే అక్కడ విధుల్లో చేరి, మరుసటి రోజునే తిరిగి డిప్యూటేషన్ పేరుతో నల్లగొండ జిల్లాలో విధుల్లో చేరారు. మాజీ మెంబర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి ఈ ఫోరంలో ఎలాంటి కేసులు వాదించే ప్రయత్నం చేసినా, వాటిని ఫైల్ చేయకుండా కేసు నంబర్ ఇవ్వకూడదు. కానీ సీనియర్ అసిస్టెంట్ అంతా తానై ఆ వకీల్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నారనే విమర్శలున్నాయి. అయితే ఒకవేళ మాజీ మెంబర్లు ప్రాక్టీస్‌కు ఎలా అనుమతి ఇచ్చారని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి బాధ్యులు అయ్యేది మాత్రం ఫోరం సూపరింటెండెంట్ అవుతారు. ఆ సీనియర్ అసిస్టెంట్ మాత్రం అధికారికంగా ఎక్కడ ఇరుక్కుపోయే పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే ప్రతి కేసు తీర్పు వెలువడిన రోజున అక్రమంగా పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడతారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. అయితే ఈ సీనియర్ అసిస్టెంట్‌కు రాష్ట్ర కమిషన్‌లో ఉన్న ఓ అధికారి అండదండలు ఉండడంతోనే తాను పెత్తనం చేస్తున్నట్లు సమాచారం.

అధికార దుర్వినియోగం..?

వినియోగదారుల ఫోరం లో ఒక ప్రెసిడెంట్, ఇద్దరు సభ్యులు ఉంటారు. ఒక పురుషుడు, ఒక మహిళను రాష్ట్ర కమిషన్ నియమిస్తుంది. అయితే ప్రస్తుతం నల్లగొండ జిల్లా వినియోగదారుల ఫోరం ప్రెసిడెంట్ తన వాహనంపై ‘వినియోగదారుల ఫోరం జడ్జి’ అంటూ నేమ్ ప్లేట్ రాసుకున్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. రాసుకోవడం అధికార దుర్వినియోగానికి పాల్పడమే అవుతుంది. ఇతరులకు న్యాయం అందించాల్సిన వ్యక్తి తానే నిబంధనలను తుంగలో తొక్కడం సరైంది కాదనే విమర్శలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇదంతా తెలియక చేశారంటే ఆలోచన చేయవచ్చు. కానీ అన్ని విషయాలు తెలిసి, స్పష్టమైన అవగాహన ఉండి కూడా ఇలాంటి తప్పులు చేయడం వారికే చెల్లిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా వినియోగదారుల ఫోరం సరైన దారిలో పయనించకపోతే బాధితులకు తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర కమిషన్ జోక్యం చేసుకుని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed