నకిరేకల్‌లో అడ్డగోలుగా వెంచర్ల ఏర్పాటు.. చోద్యం చూస్తున్న అధికారులు

by Mahesh |
నకిరేకల్‌లో అడ్డగోలుగా వెంచర్ల ఏర్పాటు.. చోద్యం చూస్తున్న అధికారులు
X

ఓ వైపు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి.. మరోవైపు నకిరేకల్-తానంచర్ల నేషనల్ హైవే ఇంకేముంది ఆ జంక్షన్ ప్రాంతమంతా రియల్టర్ల కనుసన్నల్లో బందీ అయింది. ఫలితంగా పచ్చని పంట పొలాలన్నీ కనుమరుగవుతున్నాయి. నకిరేకల్ మున్సిపాలిటీని ఈ రహదారులు అనుకుని ఉండడంతో ఆ ప్రాంతంలో భూములకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో ఇక్కడ అడ్డగోలుగా వెంచర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. వాటికి కనీసం ఓ ప్లానింగ్.. ఓ ఫర్ఫెక్షన్ లేకపోవడం గమనార్హం. కేవలం హద్దు రాళ్లు పాతి ప్లాట్లుగా చేసి రూ.కోట్లు దండుకుంటున్నారు. అయినా అధికారులు ఎవ్వరూ అటువైపు కన్నెత్తి చూడక పోవడం లేదు. తాజాగా నకిరేకల్ మండలంలోని చందం పల్లి గ్రామ పరిధిలో వెల్ విజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రియల్ ఎస్టేట్ సంస్థ తాజాగా వెంచర్‌ను ఏర్పాటు చేసింది. సదరు సంస్థ సాగిస్తోన్న ప్లాట్ల విక్రయాల్లో జరుగుతున్న మోసం అంతా ఇంతా కాదు. ఈ వెంచర్‌కు కనీసం డీటీసీపీ అనుమతి లేకపోగా పంచాయతీ పర్మిషన్ లేకపోవడం కొసమెరుపు. నిర్వాహకులు మాత్రం అనుమతులు ఉన్నాయంటూ కస్టమర్లను బురిడీ కొట్టించి ప్లాట్లను అంటగడుతున్నారు. అయితే అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక మర్మమేమిటో వారికే తెలియాలి.

దిశ, నల్లగొండ బ్యూరో : ఓ వైపు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి.. మరోవైపు నకిరేకల్-తానంచర్ల నేషనల్ హైవే. ఇంకేముంది ఆ జంక్షన్ ప్రాంతమంతా రియల్టర్ల కనుసన్నల్లో బందీ అయింది.ఫలితంగా పచ్చని పంట పొలాలన్నీ కనుమరుగవుతున్నాయి. నకిరేకల్ మున్సిపాలిటీ ప్రాంతాన్ని అనుకుని ఉండడం.. రెండు జాతీయ రహదారుల కలయిక ప్రాంతం కావడంతో విపరీతమైన డిమాండ్ పెరిగింది. అయితే ఇక్కడ ఏర్పాటవుతున్న ఏ వెంచర్‌కు కనీసం ఓ ప్లానింగ్.. ఓ పర్ఫెక్షన్ లేకపోవడం గమనార్హం.

కేవలం హద్దు రాళ్లు పాతి ప్లాట్లుగా చేసి రూ.కోట్లు దండుకుంటున్నా స్థానిక అధికారులు ఎవ్వరూ అటువైపు కన్నెత్తి చూడక పోవడం గమనార్హం. తాజాగా నకిరేకల్ మండలంలోని చందం పల్లి గ్రామ పరిధిలో వెల్ విజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రియల్ ఎస్టేట్ సంస్థ తాజాగా వెంచర్‌ను ఏర్పాటు చేసింది. సదరు సంస్థ సాగిస్తోన్న ప్లాట్ల విక్రయాల్లో జరుగుతున్న మోసం అంతా ఇంతా కాదండోయ్. అసలు ఆ ప్లాట్ల సంగతేంటి..? అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

బైబ్యాక్ అగ్రిమెంట్ అంటూ మోసం..

నకిరేకల్ మండలంలోని చందం పల్లి గ్రామ పరిధిలో వెల్ విజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మేఘన ఓపెన్ ప్లాట్స్ పేరుతో వెంచర్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ వెంచర్‌కు కనీసం డీటీసీపీ అనుమతి కాదు కదా.. గ్రామపంచాయతీ పర్మిషన్ లేకపోవడం కొసమెరుపు. కానీ వెంచర్ నిర్వాహకులు మాత్రం తమకు అనుమతులు ఉన్నాయంటూ కస్టమర్లను బురిడీ కొట్టించి ప్లాట్లను అంటగడుతుండడం గమనార్హం. ఇదిలావుంటే.. మేఘన ఓపేన్ ప్లాట్స్ తీసుకుంటే.. బైబ్యాక్ అగ్రిమెంట్ ఇస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇందులో 150 గజాల నుంచి ప్లాట్లు మొదలై 500 గజాల వరకు ఉన్నాయి.

అయితే 150 గజాల ఓపెన్ ఫ్లాట్ కొనుగోలు చేసి కస్టమర్లకు ప్రతి నెలా రూ.4 వేల చొప్పున బ్యాక్ ఇస్తామంటూ వెంచర్ యాజమాన్యం చెబుతుంది. అయితే ఈ వెంచర్ ప్లాట్లు అయిపోయిన తర్వాత ఆ బైబ్యాక్ అమౌంట్ ఇవ్వడం గగనమే. ఎందుకంటే ఈ వెంచర్ నిర్వాహకులకు స్థానికంగా కార్యాలయం లేదు. అందులో స్థానిక వ్యక్తులు ఎవ్వరూ లేరు. హైదరాబాద్ నుంచి వచ్చి కేవలం మార్కెటింగ్ సిబ్బంది ద్వారా అమ్మకాలు చేసుకుని ఉడాయించే పరిస్థితి కనిపిస్తోంది.

అధికారుల మౌనమేంటో..?

చందం పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బైరెడ్డి గూడెం వెళ్లే రోడ్డులో ఏర్పాటు చేసిన మేఘన ఓపెన్ ప్లాట్స్ వెంచర్ వైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం వెనుక కారణాలు ఏంటి అనేది తెలియడం లేదు. వెంచర్‌లో డ్రేనేజీ, విద్యుత్, రహదారి సౌకర్యాలు మచ్చుకు కానరావడం లేదు. కనీసం గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన 10 శాతం ల్యాండ్ ఊసేలేదు. అయినా పంచాయతీ కార్యదర్శి గానీ, ఇతర మండల అధికారులు గానీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవడం లేదు.

మేఘన ఓపెన్ ప్లాట్స్ వ్యవహారంపై చందంపల్లి పంచాయతీ కార్యదర్శి సరస్వతిని వివరణ కోరే ప్రయత్నం చేయగా, ఆ వెంచర్ ఏర్పాటు అంశం తన దృష్టికి రాలేదని సమాచారం ఇవ్వడం గమనార్హం. సదరు కార్యదర్శి పనిచేస్తున్న గ్రామంలో ఏం జరుగుతుందో తెలియకపోవడం.. వెంచర్ ఏర్పాటై.. ప్లాట్ల అమ్మకాలు సాగుతున్నా వెంచర్ ఏర్పాటు గురించి తెలియదని సమాధానం చెప్పడమంటే మాముల విషయం కాదనే చెప్పాలి.

వెంచర్ సర్వే నంబర్ లేవీ..?

చందంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన మేఘన ఓపెన్ ప్లాట్స్‌కు సంబంధించిన వెంచర్ భూమి సర్వే నంబర్లు గానీ నిబంధనలు గానీ ఎక్కడా కనిపించడం లేదు. కేవలం బ్రోచర్లు ప్రింట్ చేసి నకిరేకల్ పట్టణంలో గుట్టు చప్పుడు కాకుండా ప్రచారం చేస్తున్నారు. అసలు అది ప్రభుత్వ భూమా..? ప్రైవేటు భూమా..? లేదా అసైన్డ్ భూమా..? అన్న సమాచారం తెలుసుకునే వీలు లేదు. కనీసం వెంచర్ నిర్వాహకులు పట్టణంలో అందుబాటులో లేరు.

నకిరేకల్ పట్టణంలోని కొంతమంది వ్యాపారులకు మాయమాటలు చెప్పి.. ప్లాట్లను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకట్రెండు రోజుల్లో ప్లాట్‌కు సంబంధించిన అమౌంట్ మొత్తం చెల్లిస్తే.. రూ.50వేల విలువైన ఎల్‌ఈడీ టీవీ బహుమతిగా ఇస్తుండడం కొసమెరుపు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ ప్లాట్లు కొనుగోలు చేస్తే.. ఇంటి స్థలంగా రిజిస్ట్రేషన్ కావాలా? ఫామ్ ల్యాండ్‌గా ధరణి పాసుపుస్తకాలు కావాలా? ఆప్షన్ మీదే అంటూ వెంచర్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటిస్తోంది. ఇప్పటికైనా అధికారులు వెంచర్‌పై చర్యలు తీసుకుంటారా? లేక అక్రమార్కులకు సహకరిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed