యాదాద్రి బ్రహ్మోత్సవాలకు చకచకా ఏర్పాట్లు

by Shiva |
యాదాద్రి బ్రహ్మోత్సవాలకు చకచకా ఏర్పాట్లు
X

దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్ర ఆలయ ఉద్ఘాటన అనంతరం తొలిసారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది.ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ విదియ నుంచి ఫాల్గుణ శుద్ధ త్రయోదశి వరకు 11 రోజుల పాటు యాదగిరీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు పాంచరాత్రాగమన శాస్త్రరీతిలో అత్యంత వైభవంగా నిర్వహించేందుక సంప్రదాయానుసారంగా ఏర్పాట్లు చేశారు. 21న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు స్వస్తి పుణ్యాహవాచనంతో శాస్త్రోక్తంగా ఆరంభమై మార్చి 3న అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల కోసం దేవస్థాన అధికారులు ఏర్పాట్లు ముమ్మురం చేశారు.

బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో ఏర్పాట్లపై ఈవో గీతారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. 27న ఎదుర్కోళ్లు, 28న కల్యాణోత్సవం, మార్చి 1న రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. శ్రీస్వామి వారి కైంకర్యాల్లో పాల్గొనేందుకు పారాయణీకులకు,అలంకార స్వాములకు ఆహ్వానాలు పంపించామని పేర్కొన్నారు. స్థానిక పోలీస్, రెవెన్యూ అధికారులతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆలయ అధికారులు తెలిపారు.

వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఈ సంవత్సరం రూ.1కోటి.50 లక్షలు బడ్జెట్ కేటాయించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. మహోత్సవాల్లో పూల అలంకరణ కోసం రూ.20 లక్షలు, విద్యుద్దీపాలంకరణ కోసం.రూ.50 లక్షలు, బ్రహ్మోత్సవ పూజా కైంకర్యాల నిర్వహణ తదితరాల కోసం రూ.80లక్షల బడ్జెట్ కేటాయించినట్లు అధికారులు పేర్కొన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం ఎటుచూసినా ఆధ్యాత్మిక ఉట్టిపడేలా రంగుల రంగుల విద్యుద్దీపాలతో స్వాగత తోరణాలను ప్రధాన రోడ్డుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే యాదగిరిగుట్ట పట్టణంలో స్వాగత తోరణాన్ని అమర్చగా, రాయగిరి, వంగపల్లిలోని యాదగిరి గుట్టకు వచ్చే రోడ్డు వద్ద గల చౌరస్తాకు మరో రెండు స్వాగత తోర ణాలు అమర్చనున్నట్లు.

21న బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొండపైన ప్రధానాలయం, కొండ చుట్టూ గార్డెన్, ఘాట్ రోడ్లకు ఏర్పాటు చేసిన లైటింగులు అందుబాటు లోకి వస్తాయని తెలిపిన ఆలయాధికారులు. యాదగిరీశుడి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను సీఎం కేసీఆర్ కు ఈవో గీతారెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, దేవాదాయశాఖ కమిషనర్ తో కలిసి అందజేయనున్నారు. సీఎం కేసీఆర్ దంపతులు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో తిరు కల్యాణోత్సవంలో ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ ఈవో గీతారెడ్డి కోరారు.

ఆర్జిత సేవలు రద్దు

శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 21 నుంచి మార్చి 3వరకు నిత్య, శాశ్వత కల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం వంటి ఆర్జిత సేవలను రద్దు చేయనున్నామని అధికారులు తెలిపారు. రాత్రి నివేదన, అర్చన అనంతరం 8.15 నుంచి 9 గంటల వరకు బలిహరణ, ఆరగింపు రద్దు చేయనున్నారు. 21 నుంచి మార్చి 3 సాయంత్రం వరకు భక్తులచే నిర్వహించే అర్చనలు, బాలభోగాలు నిలిపివేయనున్నారు. 27 నుంచి మార్చి 1 వరకు అభిషేకం, అర్చనలు రద్దు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story