Farmers' dharna : దివిస్ పరిశ్రమ ఎదుట రైతుల ధర్నా

by Naveena |
Farmers dharna : దివిస్ పరిశ్రమ ఎదుట రైతుల ధర్నా
X

దిశ,చౌటుప్పల్ టౌన్: కాలుష్యం బారి నుంచి ప్రజానీకాన్ని, రైతులు పండించే పంటలను కాపాడాలంటూ గురువారం రైతులు ధర్నాకు దిగిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో చోటు చేసుకుంది. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో..చౌటుప్పల్ మండల పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన రైతులు మూకుమ్మడిగా తరలివచ్చి.. గురువారం దీవిస్ పరిశ్రమ ఎదుట బైఠాయించారు. రసాయన పరిశ్రమల నుంచి వెలబడుతోన్న కాలుష్యం నుంచి చౌటుప్పల్ మండల ప్రజలను, రైతాంగాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ దివిస్ పరిశ్రమ ఎదుట ధర్నా చేశారు. చౌటుప్పల్ మండలాన్ని మరో పటాన్ చెరువు లాగా మార్చవద్దంటూ ప్ల-కార్డులు ప్రదర్శించారు. దివిస్ పరిశ్రమ ఎదుట ధర్నా చేస్తున్నారంటూ సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు హుటాహుటిన దివిస్ పరిశ్రమ వద్దకు తరలివచ్చారు. పోలీసుల దివిస్ సిబ్బంది ఆందోళన చేపట్టిన రైతులకు ఎంత సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వారు ససేమిరా అంటూ భీష్మించుకు కూర్చున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు, జిల్లా కలెక్టర్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిశ్రమల కాలుష్యం పై విచారణ చేపట్టడం లేదంటూ రైతులు ఆరోపించారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చి కాలుష్య కారక పరిశ్రమల పై విచారణ జరిపిస్తామని పోలీసులు ఇచ్చిన హామీ మేరకు రైతులు ఆందోళన విరమించారు.

Advertisement

Next Story