ధరణి దరఖాస్తులు ఇంకా పెండింగ్..! అన్నదాతలకు తప్పని ఎదురుచూపులు

by Shiva |
ధరణి దరఖాస్తులు ఇంకా పెండింగ్..! అన్నదాతలకు తప్పని ఎదురుచూపులు
X

దిశ, నల్లగొండ బ్యూరో: గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టం రైతులను అతలాకుతలం చేసింది. భూ యజమానికి తెలియకుండానే మరొకరి పేరుతో రెవెన్యూ రికార్డుల్లో నమోదైన భూములు అనేకం. బాధితులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగలేక.. ఎవరికీ చెప్పుకునే దిక్కులేక గుండెలు పగిలేలా ఏడ్చిన అన్నదాతలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ల సమస్యలు పరిష్కరించడానికి ప్రస్తుత ప్రభుత్వం ధరణి సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు చేపట్టింది. జిల్లా స్థాయిలో కనుగొని అన్నదాతలను సమస్యల నుంచి విముక్తి చేయాలని సర్కార్ జిల్లా యంత్రంగానికి సూచించింది. ఈ క్రమంలో అధికారులు ధరణి బాధితులకు మోక్షం కలిగించే పనిలో ఉన్నప్పటికీ ఇంకా మందకోడిగా విచారణ సాగుతోందనే విమర్శలు ఉన్నాయి.

జిల్లాలో ధరణి దరఖాస్తులు ఇలా..

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం1,47,008 మంది రైతులు ధరణి సమస్యలను పరిష్కారించాలని దరఖాస్తు చేసుకున్నారు. అందులో చండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 18,821, దేవరకొండ డివిజన్ పరిధిలో 43,886, మిర్యాలగూడ డివిజన్ పరిధిలో 43,175, నల్గొండ డివిజన్ పరిధిలో 41,146 మంది ధరణి బాధితులు సమస్య పరిష్కరించాలని మొర పెట్టుకున్నాను. అయితే, ధరణి బాధితుల నుంచి స్వీకరించిన 1,47,008 దరఖాస్తుల్లో 83,257 మంది దరఖాస్తు‌లను అధికారులు అప్రూవల్ చేశారు. ఇంకా 63,751 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. ఇదిలా ఉంటే 44,657 దరఖాస్తులను రిజెక్ట్ చేశారు. కేవలం ఇక 19,094 దరఖాస్తులను పరిశీలించి సమస్యకు పరిష్కారం వెతకాల్సి ఉంది.

తహశీల్దార్ స్థాయిలోనే అధికం.

జిల్లాలో ధరణి దరఖాస్తుల విచారణ వేగంగానే జరుగుతోంది. అయినప్పటికీ నాలుగు స్థాయిల్లో ఇంకా 3,854 దరఖాస్తులు పరిష్కారానికి అధికారుల టేబుళ్ల మీద ఎదురుచూస్తున్నాయి. అందులో మండల తహశీల్దార్ కార్యాలయంలోనే అధికంగా 1,972 దరఖాస్తులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇవే కాకుండా రెవెన్యూ డివిజన్ అధికారి స్థాయిలో 658, జేసీ స్థాయిలో 880, కలెక్టర్ స్థాయిలో 334 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఇక్కడే ఎక్కువ పెండింగ్..

జిల్లా వ్యాప్తంగా 3,854 పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి. అందులో ప్రధానంగా దేవరకొండ నియోజకవర్గం సంబంధించిన మండలాల్లోనే ఎక్కువ పెండింగ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. గుండ్లపల్లి మండలంలో 225, చింతపల్లి 105, నాంపల్లి మండలంలో 53 దరఖాస్తు‌లు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి సాగర్‌లో 461 దరఖాస్తు‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ధరణి సమస్యకు పరిష్కారం కనుగొనందుకే తిరుమలగిరి సాగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసుకుని అక్కడ భూముల సర్వే చేపట్టారు. అంతే కాకుండా రిజెక్ట్ అయిన దరఖాస్తులు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నాయి. వాటిలో ధరణి సమస్యల పరిష్కారం కోసం రైతులు 1,47,008 భారీ స్థాయిలోనే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా అందులో 44,657 దరఖాస్తు రిజెక్ట్ అయ్యాయి. రిజెక్ట్ అయిన మండలాల్లో మొదటి స్థానం మిర్యాలగూడ 3,377, గుర్రంపోడు 3,124, మర్రిగూడ 1,032 మండలాలు ఉన్నాయి.

ఇంకెంత కాలం..

ధరణి చట్టం వల్ల వచ్చిన సమస్యను పరిష్కరించాలని రైతులు ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ ఇంకా కొలిక్కి రాలేదు. ఇంకా 19 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి ఎప్పుడు మోక్షం కలగనుందుదోనని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మండల పరిధిలోని పూర్తి స్థాయి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులకు చెప్పినప్పటికీ వారి కొంత నిర్లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంకా పరిష్కారానికి నోచుకోకుండా 19,094 ఉంటే ఎమ్మార్వో స్థాయిలో 1,972 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మండల స్థాయి రెవెన్యూ అధికారులు సీరియస్‌గా తీసుకుంటే ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు అన్ని వారం, పది రోజుల్లో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా రైతన్నల గోసను అర్థం చేసుకుని ధరణి బాధ నుంచి విముక్తి కల్పించాలని పలువురు రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed