వివరాలు గోప్యంగా ఉంచుతాం

by Sridhar Babu |
వివరాలు గోప్యంగా ఉంచుతాం
X

దిశ, మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను గోప్యంగా ఉంచనున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గురువారం మిర్యాలగూడ పట్టణం హౌసింగ్ బోర్డ్ లో సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటింటి సర్వే సందర్భంగా సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఎవరికీ సమాచారాన్ని వెల్లడించేది కాదని, అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సర్వే కోసం వచ్చిన ఎన్యుమరేటర్లకు సరైన సమాచారాన్ని ఇచ్చి సహకరించాల్సిందిగా కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల పరమైన సమగ్ర ఇంటింటి సర్వేకు చాలా ప్రాధాన్యత కల్పిస్తున్నందున తప్పుడు సమాచారం ఇవ్వకుండా సరైన సమాచారాన్ని అందించాలని సూచించారు. ఈ సమాచారం భవిష్యత్తులో కార్యాచరణకు ఉపయోగపడేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఇంటింటి సర్వే కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ నెల 6 నుంచి 8 వరకు ఇండ్లను సందర్శించి జాబితాను ఏర్పాటు చేసి సర్వేకు ప్రభుత్వం రూపొందించిన సుమారు 75 కాలాలలో వివరాలు సేకరించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రజలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ధరణి పట్టాదారు పాస్ బుక్ వంటివి సిద్ధంగా ఉంచుకుని ఎన్యుమరేటర్లకు సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. సర్వే ఫారంలో ఎన్యుమరేటర్లు ఎట్టి పరిస్థితులలో తప్పులు నింపవద్దని, ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, తహసీల్దార్ హరిబాబు, మున్సిపల్ కమిషనర్ యూసుఫ్, కౌన్సిలర్ నర్సిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story