చిలకమ్మ చెప్పింది..మల్లయ్య యాదవ్ గెలుపు అనుకూలమని

by Naresh |   ( Updated:2023-11-17 14:37:07.0  )
చిలకమ్మ చెప్పింది..మల్లయ్య యాదవ్ గెలుపు అనుకూలమని
X

దిశ, కోదాడ టౌన్: బొల్లం మల్లయ్య యాదవ్ ఈ విషయం విని సంబరపడతాడేమో.. ఏంటా విషయమంటే ప్రస్తుతం ఆయన జాతకం బాగుందట.. అనుకున్నది సాధిస్తాడట.. పది మందికి మంచి చేశాడు. ఆ మంచే ఆయన్ని కాపాడుతుందట.. ఇవన్నీ మేం చెప్పేవి కాదు. ఓ చిలకమ్మ చెప్పింది. ఓ టీవీ విలేకరి శుక్రవారం కోదాడ సమీపంలోని ఎర్రవరం లక్ష్మీనరసింహ స్వామి గుట్టకు వెళ్లారు. పోయినోడు పోయినట్టు ఉండక ఓ చిలక జ్యోతిష్యం పంతులు దగ్గరకు వెళ్లి బొల్లం మల్లయ్య యాదవ్, నలమాద పద్మావతి జాతకం చెప్పమన్నాడు. ఇంకేముంది సదరు పంతులు అనర్గళంగా తన వాక్చాతుర్యం చూపిస్తూ జాతకాల కార్డుల దిక్కుకు చిలకమ్మను పురమాయించాడు. అది వెంటనే వయ్యారాలు పోతూ టపీమని కార్డు తీసి తుర్రుమంటూ పంజరంలోకి వెళ్లింది. మల్లయ్య యాదవ్ కార్డు చూసిన పంతులు యాదవ్ జాతకం దివ్యంగా ఉందని, అనుకున్నది అనుకున్నట్లుగానే జరుగుతుందని తేల్చి చెప్పాడు.

అదృష్ట సంఖ్య 9.. వెంకటేశ్వర స్వామి ఆస్థానానికొచ్చిండు.. అదృష్ట జాతకుడు.. కోదాడలో గెలుపు సాధిస్తాడు.. అంతా బాగుంది అంటూ దీవెనార్తులు ఇచ్చాడు. అంతటితో ఆ విలేకరి ఆగకుండా మరి పద్మావతి విషయమో అంటూ ఆరా తీశాడు. మళ్లీ చిలక.. కార్డు.. పంతులు వాక్చాతుర్యం.. పద్మావతి జాతకం కూడా బాగుంది. అందరూ సాయం చేస్తారు. అదృష్టం మాత్రం మూడొంతులు మల్లయ్యకుంది, ఒక వంతు పద్మావతికి ఉందని, పద్మావతి అనుకున్నది సాధించడం కాస్త ఆలస్యం అని సెలవిచ్చాడు పంతులు. మరి వీరిద్దరూ అనుకునేది కోదాడ ఎమ్మెల్యే సీటే కదా. చిలకమ్మ జ్యోస్యం ప్రకారం మల్లయ్య ఎమ్మెల్యే అవుతాడా? కాస్త ఆలస్యం కాబట్టి మరో ఎన్నికల్లో పద్మావతి ఎమ్మెల్యే అవుతారా అని నియోజకవర్గ వాసులు చర్చోపచర్చలు చేస్తున్నారు. ఏదేమైనా ఈ వీడియో మాత్రం గింగిరాలు తిరుగుతూ వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. నమ్మినోళ్లకు నమ్మినంత.. నమ్మనోళ్లకు నమ్మనంత.

Read More..

High Court: కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్.. విచారణ మళ్లీ వాయిదా

Advertisement

Next Story

Most Viewed