'అధికారంలోకి వస్తే ప్రతి శాఖలో షాడో మంత్రులను నియమిస్తాం'

by Vinod kumar |
అధికారంలోకి వస్తే ప్రతి శాఖలో షాడో మంత్రులను నియమిస్తాం
X

దిశ, నల్లగొండ: తెలంగాణా రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే బడ్జెట్‌లో విద్యకు 60 వేల కోట్లు కేటాయించి, తెలంగాణ విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని బీఎస్పీ పార్టీ అధ్యక్షులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో స్వేరోస్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన బహుజన విద్యార్థి గర్జనకు ఆయన హజరయ్యారు. అనంతరం ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో విద్యకు నిధులు కేటాయించమంటే, మద్యానికి అధిక నిధులు కేటాయించి మద్యం అమ్మకాల్లో తెలంగాణను నెంబర్ వన్‌గా నిలిపారని ఆరోపించారు. మద్యం టెండర్లలో స్వయంగా మంత్రులే బినామీ పేర్లతో టెండర్లు వేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమయిందన్నారు.

ముఖ్యమంత్రి మనువడు హిమాన్షు రావుకు 40 లక్షల రూపాయల ప్యాకెట్ మనీ ఇస్తే, పేద బిడ్డలకు కనీసం 25 రూపాయల ప్యాకెట్ మనీ కూడా ఇవ్వలేని దుస్థితిలో పేదలు ఉన్నారన్నారు. కాళేశ్వరం కాంట్రాక్టర్లకు వేలు కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం పేద విద్యార్థులు చదువే పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ ఫెలోషిప్ ద్వారా విదేశీ విద్య అభ్యసన పేద విద్యార్థులకు ప్లీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వడంలేదని విమర్శించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అనుకూలమైన పాలసీ కోసం రూ.100 కోట్ల లంచం చెల్లించడంలో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందన్నారు.

కల్వకుంట్ల కవితకు రూ.25 లక్షల వాచ్ ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. బహుజనుడు ముఖ్యమంత్రి అయితే ప్రతి విద్యార్థి ముఖ్యమంత్రి అయినట్టేనన్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే కేసీఆర్ దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, గృహలక్ష్మి అంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వరుసగా పోటీ పరీక్షల షెడ్యూలు విడుదల చేయడంతో లక్షలాది మంది గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన చెందుతున్నారన్నారు. గ్రూప్-2 అభ్యర్థుల విన్నపం మేరుకు మరో మూడు నెలలు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఏళ్ల తరబడి పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ పరీక్షలు, గురుకుల ఉద్యోగాలకు మధ్య ప్రిపరేషన్‌కు మధ్య కాల వ్యవది తక్కువ ఉండడంతో లక్షలాదిమంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నరన్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే మహాత్మ జ్యోతిరావ్ పూలే విద్యా భరోసా పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి మండలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలలు నిర్మిస్తామన్నారు. ప్రతి జిల్లాలో బాలురు, బాలికలకు వేర్వేరుగా సైనిక పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు నాలుగో భాషగా కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెడతామన్నారు. జాంబవ స్పార్క్ కేంద్రాలను ఏర్పాటు చేసి 12 వేల గ్రామాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచితంగా ఏసీ కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ ఇస్తామన్నారు.

ఉద్యోగ హక్కు చట్టం తీసుకువచ్చి, రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో యువజన సహకార సంఘాలకు 25 శాతం కాంట్రాక్టులు కేటాయించి లక్షల కోట్ల బడ్జెట్‌ను యువతుల చేతిలో పెడతామన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ స్మారకంగా గద్దర్ ఫ్రీడమ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. జానపద కళలు, గ్రామీణ సంస్కృతిని ప్రోత్సహిస్తామన్నారు. శ్రీకాంతాచారి ఉద్యోగహామీ ద్వారా ప్రతి ఏడాది టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, పేపర్ లీకేజీ లేకుండా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. పూర్ణ-ఆనంద్ క్రీడా స్ఫూర్తితో ప్రతి జిల్లాలో అంతర్జాతీయ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తామన్నారు. మాన్యశ్రీ కాన్షిరాం స్ఫూర్తితో యువతను నాయకులుగా తీర్చిదిద్ది.. వారికి స్థానిక సంస్థల్లో యువతకు 30% రాజకీయ రిజర్వేషన్లు కల్పించి, ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో షాడో మంత్రులుగా నియమిస్తామన్నారు.

అందరికీ విద్య రాజకీయంతో ముడిపడి ఉంది: ఎంవీఎఫ్ జాతీయ కన్వీనర్ ఆర్. వెంకట్ రెడ్డి

దేశంలో అందరికీ విద్య అనేది దురదృష్టవశాత్తు రాజకీయాలతో ముడిపడి, ప్రధాన సమస్యగా మారిందని ఎం.వి.ఎఫ్ జాతీయ కన్వీనర్ ఆర్. వెంకట్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. పేదల విద్యపై ఆధిపత్య పాలకులకు చిత్తశుద్ధి లేదన్నారు. విద్యార్థి, యువత కోసం బడ్జెట్‌లో 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని బీఎస్పీ హామీ ఇవ్వడం హర్షించదగ్గదన్నారు. మంత్రిత్వశాఖలను నియంత్రించేలా విద్యార్థులను షాడో మంత్రులుగా నియమిస్తానని బీఎస్పీ ప్రకటించడం గొప్ప విషయం అన్నారు. సభకు స్వేరోస్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుముల సురేష్ అధ్యక్షత వహించగా, సభలో రాష్ట్ర అధ్యక్షులు మొగిలిపాక నవీన్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ ముదిగొండ, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు రాజ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయిబాబా, మహిళా విభాగం రాష్ట్ర ఇంచార్జ్ మాధవి, రాష్ట్ర సహాయ కార్యదర్శి అందే అజయ్ జిల్లా అధ్యక్షులు ఆకులపల్లి నరేష్, మోసెస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed