బీఆర్ఎస్ ట్రాప్‌లో ఆఫీసర్లు.. సామా స్ట్రాంగ్ వార్నింగ్

by srinivas |   ( Updated:2024-10-18 16:45:27.0  )
బీఆర్ఎస్ ట్రాప్‌లో ఆఫీసర్లు.. సామా స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్‌ఎస్ కోవర్ట్ ఆఫీసర్లపై చర్యలు ఉంటాయని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కొందరు ఉన్నతాధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌కు ఇప్పటికీ లీకులు, సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ట్రాప్‌లో ఉండి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని నొక్కి చెప్పారు. ప్రజాప్రభుత్వంలో అత్యుత్సాహం ప్రదర్శించవద్దని సూచించారు. పేద ప్రజలకు మేలు జరిగేలా తమ సీఎం రేవంత్ రెడ్డి, ఒక ప్రణాళిక బద్ధంగా నిర్ణయాలు, అడుగులు వేస్తున్నారని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించవద్దని వెల్లడించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పద్ధతి మార్చుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వివరించారు.

ఇక బీఆర్ఎస్‌కు పదేళ్ల పాటు అధికారం ఇస్తే, కల్వకుంట్ల కుటుంబం, బంధు వర్గం రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకొని తిన్నారన్నారు. భూములు, నీళ్లు, ఇలా దేన్ని వదల్లేదన్నారు. స్కీమ్‌ల పేరిట స్కామ్‌లకు పాల్పడ్డారన్నారు. బీఆర్ఎస్ తమ మేనిఫెస్టో మీద ఎన్నడు నిలబడింది? అంటూ నిలదీశారు. కానీ తమ ప్రభుత్వం అప్పులను సర్ధుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తుందన్నారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే కొన్ని సంపూర్ణంగా అమలవుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన పట్టా భూములను కూడా కార్పొరేట్లకు దారదాత్తం చేసింది బీఆర్ ఎస్ అని మండిపడ్డారు. అర్ధరాత్రి పూట ఊర్లను ఖాళీ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో బీఆర్ఎస్ తప్పిదాలన్నీ ఎపిసోడ్ రూపంలో బయటపెడతామన్నారు. మూసీ ప్రక్షాళనకు లక్షన్నర కోట్లు అని చెప్పలేదన్నారు. బీఆర్ ఎస్ ఇంకా ఇలాంటి అసత్య ప్రచారాలే చేస్తే, మరో 20 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుందన్నారు. బీఆర్ ఎస్ పాలనలో ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు అవకాశం లేదని, కానీ తాము పవర్ లోకి రాగానే ప్రజాభవన్, గాంధీభవన్, సెక్రటేరియట్ గేట్లను తెరిచి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. రూ.3800 కోట్లతో 31 ఎస్టీపీలు అందుబాటులోకి తీసుకువచ్చామని హరీష్​ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇది నిజమైతే ఈ నీళ్లు బీఆర్ ఎస్ నేతలు తాగి చూపించాలన్నారు. గత ప్రభుత్వ హయంలో నష్టపోయిన బాధితులంతా ఇప్పుడు ఫిర్యాదు చేయాలని, ప్రజాప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో స్పోక్స్ పర్సన్ లింగం యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed