ఇటుక దందా.. ఇష్టారాజ్యం..

by Sumithra |
ఇటుక దందా.. ఇష్టారాజ్యం..
X

దిశ, నల్గొండ బ్యూరో / చింతపల్లి : ఆ గ్రామంలో పెద్ద ఎత్తున ఇటుక బట్టీల తయారీ పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతుంది. ఆ బట్టీలు ఊరికి అత్యంత సమీపంలో ఏర్పాటు చేయడం వల్ల కాలుష్యం ఏర్పడి గ్రామంలోని వృద్ధులకు పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. గ్రామస్తులు భయాందోళనకు గురై గ్రామపంచాయతీ నుంచి కలెక్టర్ వరకు అందరికీ ఫిర్యాదు చేశారు. అయినా ఇటుక బట్టీల తయారీ కొనసాగుతూనే ఉంది. మండల స్థాయి అధికారులు వచ్చి చెప్పిన సంబంధిత యజమాన్యం అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ తమ ఫలితాలు చేసుకుంటూ పోతున్నారు.

100 ఎకరాల్లో ఇటుక బట్టీలు..

చింతపల్లి మండలంలోని నసర్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సర్వే నెంబర్లు 14 ,15, 16 , 19, 277, 278 లతో పాటు మరికొన్ని సర్వే నెంబర్లలో ఉండగా వాటిల్లో కొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని నిర్వాహకులు ఇటుకలు తయారు చేస్తున్నారు. మొత్తంగా సుమారు 100 ఎకరాల్లో ఇటుక బట్టీల తయారీ జరుగుతుంది. ఇటుక బట్టీలు తయారు చేసే క్రమంలో నిర్వాహకులు బ్లాస్టింగ్ కూడా చేస్తున్నారు. గ్రామం పక్కనే సాగర్ తాగునీటి వాటర్ ప్లాంట్ ఉంది. ఇటుక తయారు చేస్తున్న క్రమంలో ధూళి, దుమ్ము, పొగ, వచ్చి చిన్న పిల్లలకు, వృద్ధులకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.

ఇటుక బట్టీల నియమ నిబంధనలు.

గ్రామ పంచాయతీ అనుమతి ఉండాలి.

పబ్లిక్ ఇబ్బందులు కలిగే చోటు ఉండకూడదు.

ఊరికి దూరంగా ఉండాలి.

లేబర్ ఆఫీసర్ నుండి సర్టిఫికెట్ పొందాలి.

విద్యుత్ శాఖ నుండి ట్రాన్స్ఫార్మర్ అనుమతి పొంది కమర్షియల్ మీటర్లు వాడాలి.

చెరువు మట్టి తీయాల్సి వస్తే రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల నుండి అనుమతి పొంది మట్టిని తీయవలసి ఉంటుంది.

ఇటుక బట్టీ తయారు చేసే భూమిని నాలా అనుమతి తీసుకోవాలి.

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు..!

ఇటుక బట్టీలు తయారు చేయడానికి ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే. కాని నసర్లపల్లి గ్రామంలో నిర్వాహకులు ఏ ఒక్క నిబంధన కూడా పాటించడం లేదని గ్రామస్తులు ఆరోపణలు చేస్తూ జూలై 4న అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే 6న ఇటుక బట్టీలు తయారు చేసే ప్రాంతానికి వెళ్లిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఇటుకల తయారీని వెంటనే నిలిపివేయాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ మరుసటి రోజు నుంచి వాళ్ళ పనిని కొనసాగిస్తున్నారు. గ్రామపంచాయతీ అనుమతి లేకుండా పెట్టిన ఇటుక బట్టీల తయారీదారుల పై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ రెండు నెలల క్రితం అధికారులు స్వయంగా పర్యవేక్షించినప్పటికీ బట్టీల యజమానుల పై చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంటే అంతర్గతంగా అధికారులకు ఇటుక బట్టీ నిర్వాహకులకు ఒప్పందం కుదిరినట్లు విమర్శలు గ్రామస్తులు నుంచి వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ కార్యాలయాన్ని ముట్టడిస్తాం... కొడిదల శ్రీనివాస్, నసర్లపల్లి

గ్రామానికి ప్రజలకు నష్టం కలిగించే రీతిలో ఉన్న ఇటుకల తయారీని వెంటనే నిలిపివేయాలి. నిర్వాకులు ఇటుకలు తయారీని ఆపలేకపోతే అధికారులు చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తాం.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం.. రమాకాంత్ శర్మ, ఎమ్మార్వో చింతపల్లి

ఇటుక బట్టీలు తయారు చేసే ప్రాంతాన్ని పరిశీలిస్తాం. ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకుంటాం. ఎవరి ఒత్తిడికి తలొగ్గేది లేదు.

Advertisement

Next Story