చెప్పింది కొండంత.. చేసింది గోరంత..!

by Sumithra |
చెప్పింది కొండంత.. చేసింది గోరంత..!
X

దిశ, చిలుకూరు : కూలిపోతున్న మెట్ల గోడలు.. పగిలి ముక్కలైన కిటికీల అద్దాలు.. పెచ్చులూడుతున్న ఇంటి పైకప్పులు.. ఫ్లోరింగ్.. ఇంకా మరెన్నో అరకొర వసతుల నడుమ.. దశాబ్ది ఉత్సవాలు చేసుకున్న తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ల దుస్థితి ఇది. ఎవరైనా గృహ ప్రవేశాలు చేసేనాటికే కొన్ని చిన్న, చిన్న పనులు మినహా ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. డబుల్ ఇళ్లు మాత్రం అందుకు మినహాయింపు.. లబ్ధిదారులు ఇళ్లలోకి చేరిన తర్వాత అధికారులు, గుత్తేదారులు పనులు ప్రారంభించారు. అదీ అరకొరగానే.. ఎంతైనా పేదలు ఉండే ఇళ్లు కదా.. ప్రభుత్వానికేం పట్టింపు..!

మండలంలోని బేతవోలులో అయిదేళ్ల క్రితం నిర్మించిన 60 డబుల్ ఇళ్లను ఇటీవలే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎన్నో ఆశలతో గృహ ప్రవేశాలు చేసిన వారికి కన్నీరే మిగిలింది.

నాసిరకం నిర్మాణాలు.

నాసిరకంగా నిర్మించిన ఇంటి పైకప్పులు, ఫ్లోరింగ్ పెచ్చులూడుతోంది. వాటికి లబ్ధిదారులు మళ్లీ మరమ్మతులు చేసుకుంటున్నారు. సామాన్లు భద్రపరచుకునే షెల్ఫులూ ఏర్పాటు చేయలేదు. కిటికీలకు అమర్చిన అద్దాలు పగిలిపోయాయి. మెట్ల గోడలు కూలిపోయాయి. వంట గదుల్లోని ప్లాట్ ఫాం బండలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లడంతో మళ్లీ ఏర్పాటు చేసుకుంటున్నారు.

తాగునీరు లేదు..

విద్యుత్తు పరిస్థితీ అంతే.. మురుగునీటి కాల్వల ఊసే లేదు. ఇళ్ల చెంతనే భగీరథ ట్యాంక్ ఉన్నా నేటికీ లబ్ధిదారులకు చుక్క నీరందడం లేదు. పైప్ లైన్లే ఏర్పాటు చేయలేదు. ఇళ్ల ముందు ఇప్పుడు నీటి సంప్ ల నిర్మాణాలు ప్రారంభించారు. విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేశారు కాని తీగలు ఇంకా లాగలేదు. పక్క ప్రాంతంలోని ఇళ్ల నుంచి కొందరు విద్యుత్ తీసుకుంటున్నారు. మరి ప్రభుత్వాధినేతలు, అధికారుల ఇళ్లు కూడా ఇలానే ఉంటాయా అనేది అంతుచిక్కని ప్రశ్న.. ఒక్కో ఇంటి మరమ్మతులకు రూ. లక్ష నుంచి రెండు లక్షల వరకు వెచ్చించాల్సి వస్తుందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇందుకు గానూ వారికి ప్రభుత్వం నుంచి ఒక్క పైసా రాదు.

ఇళ్ల కేటాయింపులో అవినీతి..

గతంలో ఈ ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఏమైందో ఏమో మళ్లీ మరోసారి ఎంపిక చేపట్టారు. అధికార పార్టీ వారికే అధిక శాతం ఇళ్లు దక్కాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు నిర్వహించిన లాటరీ మొత్తం మోసపూరితమని ఇళ్లు రాని పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హుల ఎంపికే అవకతవకలతో కూడుకున్నదని, ఇళ్లు, పొలాలు, ఆస్తిపాస్తులున్న పలువురిని ఎంపిక చేశారని అంటున్నారు. లబ్ధిదారుల ఎంపికలో వారికే ఇళ్లు కేటాయించారని నిరుపేదలు ఆవేదన చెందుతున్నారు. కోడిపిల్లను ఎక్కడ కమ్మాలి, గొర్రె పిల్లను ఎక్కడ కట్టెయ్యాలి, ఇంటి ఆడబిడ్డ వస్తే ఎక్కడ పడుకోవాలో అని సన్నాయి నొక్కులు నొక్కిన ప్రభుత్వం అరకొర వసతులతో అప్పగించిన ఈ ఇళ్లలో మనుషులు ఎలా ఉంటారో చెప్పాల్సిన అవసరం ఉంది.

Advertisement

Next Story

Most Viewed