ధాన్యం అమ్ముకోవాలంటే టోకెన్ తప్పనిసరి..

by Sumithra |
ధాన్యం అమ్ముకోవాలంటే టోకెన్ తప్పనిసరి..
X

దిశ, నేరేడుచర్ల : రైతు తాము పండించిన ధాన్యాన్ని మిర్యాలగూడ ప్రాంతంలోని రైస్ మిల్లులో అమ్మకాలు జరపాలంటే తప్పనిసరిగా రైతులు వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చే టోకెన్ తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు. మిర్యాలగూడ ప్రాంతంలోని రైస్ మిల్లులకు తీసుకువెళ్లే రైతులకు అక్కడ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసే సమయంలో కొన్ని కొర్రీలు పెట్టి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని, ధాన్యం కొనకుండా రైతులను మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ధర్నా చేసిన విషయం తెలిసిందే. దీనిని గుర్తించిన రెండు జిల్లాల అధికారులు రైతులు పండించిన ధాన్యాన్ని టోకెన్ల ద్వారా రైస్ మిల్లులకు పంపించి కొనుగోలు చేసే విధంగా నిర్ణయించారు. అందుకోసం ఇరు జిల్లాల అధికారులు టోకెన్ విధానాన్ని అమలు చేయాలని నల్గొండ సూర్యాపేట కలెక్టర్లు వివిధ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు.

చిల్లేపల్లి చెక్ పోస్ట్ వద్ద టోకెన్ల పంపిణీ..

సూర్యాపేట జిల్లాకు సంబంధించిన రైతులు మిర్యాలగూడ ప్రాంతంలో రైస్ మిల్లులకు వెళ్లి ధాన్యం అమ్ముకునే రైతులకు 14వ తేదీ గురువారం నుండి టోకెన్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఈ టోకెన్లను ఉదయం 9:30 నుండి రాత్రి 10 గంటల వరకు అందించనున్నారు. అలాగే 15 శుక్రవారం నుండి ఉదయం 6 గంటలకు రాత్రి 10 గంటల వరకు అందించేందుకు అధికారులు నిర్ణయించారు. అయితే రైతులు నేరుగా తమ ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా బోరంలో తీసుకొని చిల్లేపల్లి చెక్ పోస్ట్ వద్దకు వస్తేనే ఆ ధాన్యాన్ని పరిశీలించిన తర్వాతనే టోకెన్లను అందించనున్నారు.

రైతులు తప్పనిసరిగా ఇవి తీసుకురావాల్సిందే..

ధాన్యం అమ్మే రైతులు పండించిన భూమి పాస్ పుస్తకం జిరాక్స్ అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ ను చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహించే అధికారులకు చూపిస్తేనే వారు అక్కడ పరిశీలించి టు కెన్ ను అందించనున్నారు. ఆ టోకెన్ మీదనే రైతులు తమ ధాన్యాన్ని ఏ మిల్లుకు తీసుకువెళ్లి ఆ ధాన్యాన్ని అమ్మాలో దాని మీదనే రాసి ఉంటుంది. దాని ప్రకారం రైతులు ఆ మిల్లుకు తీసుకువెళ్లి ధాన్యాన్ని అమ్ముకోవాలి.

ఇలాంటి ధాన్యం తీసుకు వస్తే టోకెన్ లేవు..

రైతులు తీసుకొచ్చే ధాన్యంలో అధికంగా పచ్చ గింజలు ఉన్న వాటికి టోకెన్ ఇవ్వడం జరగదని తెలిపారు. అందుకోసం రైతులు పూర్తిగా గింజ ఏర్పడి పచ్చగింజ లేకుండా వచ్చే వాటికే టోకెన్ అందిస్తామని తెలిపారు. ముందస్తుగా వస్తే టోకెన్లు ఇవ్వరని, ధాన్యం బోరంలో తీసుకుని వచ్చిన ట్రాక్టర్లకే టోకెన్లు అందించనున్నారు.

టోకెన్ విధానాన్ని ప్రారంభం చేసిన తహశీల్దార్ సైదులు...

నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి చెక్ పోస్ట్ వద్ద రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి నేరేడుచర్ల తాహశీల్దార్ సైదులు మండల వ్యవసాయ అధికారి జావీద్ ఎస్సై రవీందర్ తో కలిసి టోకెన్ విధానాన్ని ప్రారంభించారు. రేపటి నుండి ఉదయం 6:00 నుంచి రాత్రి 10 గంటల వరకు రైతులకు బోరేల ద్వారా ట్రాక్టర్లను తీసుకువచ్చే వారికి ఈ టోకెన్లను అందిస్తామన్నారు. రైతులు మిల్లుల వద్దకు వెళ్లి ఇబ్బందులు పడకుండా ఉన్నందుకే ఈ టోకెన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ టోకెన్ మీదనే రైతు ఏ మిల్లుకు వెళ్లాలో రాసి ఉంటుందని తెలిపారు. రైతుల ఎవరూ ఆందోళన పడవలసిన అవసరం లేదని రైతు పండించే ప్రతి గింజలు ఐకేపీ సెంటర్లతో పాటు మిల్లులకు తీసుకువెళ్లి వెళ్లి అమ్ముకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story