అన్నంపెట్టే చేతులకు సంకెళ్లు..

by Vinod kumar |   ( Updated:2023-06-13 10:11:40.0  )
అన్నంపెట్టే చేతులకు సంకెళ్లు..
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భూములను కాపాడలంటూ పోరాటం చేస్తున్న రైతుల చేతులకు సంకెళ్లు పడ్డాయి. అన్నం‌ పెట్టే రైతుకు చివరికి బేడీలు వేశారు. తమ భూములను లాక్కుంటే తమ కుటుంబాలు రోడ్డు మీద పడాల్సి వస్తుందని నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై ప్రభుత్వం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనలో..

ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్‌ను మార్చాలని రైతులు మే 29,30 తేదిలలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిరాహార దీక్షలు చేపట్టారు. మే 30వ తేదిన తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించి కలెక్టరేట్ కార్యాలయం నుంచి బయటికి వస్తుండగా, తమ సమస్యలను పరిష్కరించాలని నిర్వాసితులు రైతులు కలెక్టరేట్ గేటు ఎదుట ఆందోళన చేపట్టారు.


ఈ ఆందోళనలో మంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆరుగురు రైతులపై 147,148,341, 436, 427, 353, 120బీ రెడ్ విత్ 149 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఇందులో గూడురు నారాయణ రెడ్డి, తంగెళ్లపల్లి రవి కుమార్ లకు ముందస్తు బెయిల్ మంజూరవగా.. మిగతా నలుగురు రైతులను రిమాండ్‌కు తరలించారు.

మొదట భువనగిరి జైలుకు..

అరెస్టు చేసిన రైతులను మొదట భువనగిరి సబ్ జైలుకు తరలించారు. ఈ భువనగిరి సబ్ జైల్లో ఉండగానే డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీహెచ్ హనుమంతరావు, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తదితరులు జైలుకు వెళ్లి రైతులను కలిశారు.

నల్గొండ జైలుకు తరలింపు..

తిరిగి భువనగిరి సబ్ జైల్ నుంచి రైతులను నల్గొండ జిల్లా జైలుకు తరలించారు. రైతులకు ఆ బెయిల్ కోసం ఆయా పార్టీల నాయకులు, రైతులు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం భువనగిరి స్టేషన్స్ కోర్టు రైతులకు బెయిల్ మంజూరు చేసింది.

బేడిలతో భువనగిరి కోర్టుకు..

రైతులను14 రోజుల రిమాండ్ అనంతరం భువనగిరి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ముందు హాజరు పరిచేందుకు చేతులకు బేడీలు వేసి తీసుకురావడంతో తోటి రైతులు, ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు‌. అన్నం పెట్టె రైతుకు సంకెళ్లు వేయడం ఏమిటని స్థానిక పోలీసులను రైతులు, వారి కుటుంబ సభ్యులు ప్రశ్నించారు‌. అరెస్ట్ అయిన రైతులు సైతం తమ‌ గ్రామస్తులు, కుటుంబ సభ్యులను చూసి తీవ్ర ఆవేదనకు గురై కంట తడి పెట్టారు‌. కోర్టులో ఈ సన్నివేశం అందరిని కంట తడి పెట్టించింది‌.

నల్గొండ జైలుకు తరలింపు..

భువనగిరి కోర్టులో హాజరు పరిచిన అనంతరం తిరిగి రైతులను నల్లగొండ జైలుకు తరలించారు. బెయిల్ ఆర్డర్ కాపీలు నల్గొండ కు చేరిన అనంతరం రైతులు విడుదల కానున్నారు.

Advertisement

Next Story

Most Viewed