అవినీతికి కేరాఫ్.. మోత్కూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్

by Shiva |   ( Updated:2024-07-15 02:20:42.0  )
అవినీతికి కేరాఫ్.. మోత్కూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్
X

దిశ, మోత్కూరు: అవినీతి అక్రమాలకు మోత్కూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేరాఫ్‌గా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయానికి నేరుగా వెళ్తే పని పూర్తి కాకపోవడంతోపాటు రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిందేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మధ్యవర్తుల ద్వారా వెళ్తే అనుకున్న పనలు పూర్తవుతాయని పలువురు వాపోతున్నారు. ఇక్కడ ప్రతి పనికి ఒక రేటు ఉంటుందని, ఈసీలు కావాలన్నా, సర్టిఫైడ్ కాఫీలు కావాలన్నా వారడిగిన మొత్తం చెల్లిస్తే సరి లేదంటే వారికి నమ్మకమైన ఏజెంట్ల ద్వారా వెళ్తేనే పని పూర్తవుతుందని తెలుస్తోంది. లేదంటే రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. రిజిస్ట్రేషన్ చేసుకునే ఆస్తుల విలువను బట్టి ప్రభుత్వ చాలాను పోను వారికి సమర్పించుకుంటేనే రిజిస్ట్రేషన్ తతంగం పూర్తవుతుంది. లేదంటే కొర్రీలతో తిప్పుకోవడం జరుగుతుందనేది ఇక్కడ బహిరంగ రహస్యం. ఏదైనా సమస్య ఉందని తెలిస్తే వారు అడిగింది ఇవ్వాల్సిందేనని పలువురు వినియోగదారులు వాపోతున్నారు.

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన సమయంలోనూ అలాగే మోత్కూరు రిజిస్ట్రార్ పరిధిలో ఉండి ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనే నిబంధన అమలులో ఉన్నకాలంలో జరిగిన డాక్యుమెంట్లను ఆధారం చేసుకుని చేసే రిజిస్ట్రేషన్ల విషయంలో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని బహిరంగంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తిస్థాయిలో రిజిస్టార్లు అందుబాటులో లేని సమయంలో ఇంచార్జీ రిజిస్ట్రార్లుగా వ్యవహరించిన వారు ధనార్ఙనే ధ్యేయంగా అడ్డగోలుగా నిబంధనలు పాటించకుండా పెద్దఎత్తున ముడుపులు తీసుకుని రిజిస్ట్రేషన్ తతంగాలు పూర్తి చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కార్యాలయంలో ఒక ఉద్యోగి తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి మరొక చోటుకు బదిలీ కాకుండా తిష్ట వేసి రిజిస్టర్ కార్యాలయంలో జటిలమైన సమస్య ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లకు పరిష్కారం చూపిస్తూ రిజిస్ట్రేషన్ చేయించి అటు రియాల్టర్ల ద్వారా ఇటు డాక్యుమెంట్ల రైటర్లలో కొంతమందిని ఏజెంట్లుగా పెట్టుకొని రెండు చేతులా అక్రమార్జనకు తెర లేపాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల విషయంలోనూ ఉన్నతాధికారులు విచారణను తూతూ మంత్రంగా నిర్వహించి సమస్యలను దాట వేశారనే ఆరోపణలు కూడా లేకపోలేదు.

ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరే కారణమా?

మోత్కూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగే అవకతవకలు, అక్రమాలకు ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరి కారణమని కొంతమంది వినియోగదారులు బహిరంగంగా ఉన్నతాధికారుల తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వారు ఉదాసీనంగా ఉన్న కారణంగానే కార్యాలయ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వ ఆదాయానికి గండి?

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆడిట్ విభాగం తనిఖీలు చేస్తుంది. అయితే ఆడిట్‌కు వచ్చే అధికారులను మంచిగా చేసుకుని కార్యాలయంలో అన్ని పనులు సవ్యంగా జరిగినట్లు నివేదికలు పొందుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నత అధికారులు తమ ఉదాసీన వైఖరికి స్వస్తి పలికి మోత్కూరు సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో గత పదేళ్లుగా జరిగిన కార్యకలాపాలపై ప్రత్యేక విచారణ చేస్తే అధికారుల నిర్వాహకం అవకతవకలు వెల్లడయ్యే అవకాశముందని పలువురు బావిస్తున్నారు.

Advertisement

Next Story