KTR : గులాబీ సైనికుల పోరాట స్ఫూర్తికి నా సలాం : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |
KTR : గులాబీ సైనికుల పోరాట స్ఫూర్తికి నా సలాం : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రాణ సమానులు.. బీఆర్ఎస్(BRS)తోబుట్టువులైన గులాబీ సైనికులందరూ(Pink Soldiers)..గత ఏడాది కాలంగా కాంగ్రెస్ నిరంకుశ పాలన(Congress Dictatorship)పై కనబరిచిన పోరాట స్ఫూర్తి(Fighting Spirit)కి పేరుపేరునా ప్రతి ఒక్కరికి శిరస్సువంచి సలాం(Salute) చేస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా..క్షేత్రస్థాయిలో కనబరిచిన కదనోత్సాహం..రాష్ట్ర స్థాయిలో పని చేసే నాయకత్వంలో కూడా మాటలకందని స్థాయిలో కొండంత స్ఫూర్తి నింపిందని కేడర్ (BRS Cadre)ను కేటీఆర్ అభినందించారు. తెలంగాణ గ్రామ గ్రామాన ఉన్న గులాబీ సైనికులు రాష్ట్ర ప్రజలపక్షాన విరామం ఎరుగని పోరాటం చేస్తున్నారని, అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన ఈ తుగ్లక్ పాలన వల్ల కష్టకాలంలో ఉన్న రైతుల పక్షాన మీరు పోరాడారని గుర్తు చేశారు. నేతన్నల గొంతుకై మీరు నిలిచారని, మహిళా సమస్యలపై మీరు గర్జించారని

బడుగు బలహీనవర్గాల ప్రజల గళమయ్యారని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పక్షాన సమరభేరి మోగించారని ప్రశంసించారు. నిరుద్యోగుల హక్కుల కోసం కాంగ్రెస్ సర్కారును నిలదీశారని, ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీల గారడీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టారని, మూసీలో “మూటలవేట” నుంచి “లగచర్ల లడాయి” వరకూ..అన్యాయం జరిగిన ప్రతిచోటా బాధితుల పక్షాన మీరు కొట్లాడారని అభినందించారు. తెలంగాణ ప్రజల గుండెచప్పుడును అడుగుడుగునా మీరు ప్రతిధ్వనించారని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు మీరు చేసిన పోరాటాలు.. చరిత్రపై చెరగని సంతకాలని కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను అత్యంత సమర్థంగా తిప్పికొట్టిన సందర్భాలు..ఈ పోరాటపథంలో నిలిచి ఉండే మైలురాళ్లుగా అభివర్ణించారు. తెలంగాణ ప్రజల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా అసమర్థ, అనాలోచిత కాంగ్రెస్ విధానాలపై..బీఆర్ఎస్ శ్రేణులు మోగించిన “జంగ్ సైరన్” ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించిందన్నారు. మీ అలుపెరగని పోరాటాల వల్లే.. అదానీ ఆశజూపిన రూ.100 కోట్లను ప్రభుత్వం వెనక్కి ఇవ్వాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. లగచర్ల లడాయి.. యావత్ దేశం ముందు నియంతృత్వ కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టిందన్నారు. ఎన్నో అక్రమ కేసులు పెట్టినా..ప్రభుత్వం ఎంత వేధించాలని చూసినా..మొక్కవోని ధైర్యంతో మీరు నిలబడ్డ తీరు అపూర్వం... అసాధారణం... చారిత్రాత్మకమని కొనియాడారు. దశాబ్దాలపాటు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను.. కుక్కలు చింపిన విస్తరిలా మార్చే కాంగ్రెస్ కుట్రలను.. అడుగడుగునా ప్రశ్నిద్దాం ! నిలదీద్దామని, అడ్డుకుందామని పిలుపునిచ్చారు. మన పార్టీకి పునాది రాళ్లు మీరేనని, మన బీఆర్ఎస్ కు మూలస్తంభాలు మీరేనని, మన గులాబీ జెండాకు.. వెన్నుముక మీరేనన్నారు. పార్టీ తరఫున నిలబడి.. కలబడే..నేటి అలుపెరగని పోరాట యోధులే..రేపటి తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై బీఆర్ఎస్ పక్షాన మెరిసే.. వజ్రాయుధాలని కేటీఆర్ పేర్కొన్నారు. గులాబీ సైనికులందరికీ... గుండెల నిండా..మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed