ఆ రిటైర్డ్ పోలీసు వల్లే నిరుద్యోగులకు కష్టాలు.. ఎంపీ రఘునందన్ రావు విమర్శలు

by Prasad Jukanti |
ఆ రిటైర్డ్ పోలీసు వల్లే నిరుద్యోగులకు కష్టాలు.. ఎంపీ రఘునందన్ రావు విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాటుతుంటే చేతలు మాత్రం గడప దాటడం లేదని రాష్ట్రంలోని నిరుద్యోకులకు కాంగ్రెస్ చేసిన మోసాలే నిదర్శనం అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో బీఆర్ఎస్ హయాంలో మోసం జరిగిందని విమర్శించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంఖ్య మర్చిపోయారని ధ్వజమెత్తారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వంతో పోలిస్తే గ్రూప్-1 పోస్టుల్లో 60 పోస్టులు, గ్రూప్-2 లో రెండు వేల పోస్టులు ఇస్తామని ఇస్తామని 1100, గ్రూప్-3 లో దాదాపు 3 వేల పోస్టులు ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నదన్నారు. నిరుద్యోగ యువతకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. చదువుకున్న వారు ఉంటే పరీక్షల విలువ, ఒక పరీక్షకు మరో పరీక్షకు మధ్య ఉండాల్సిన వ్యవధి తెలుస్తుందన్నారు. ఇటీవల టెట్ నిర్వహించారు. పోస్టుల సంఖ్య పెంచి డీఎస్సీ కోసం మరో 45 రోజులు సమయం కేటాయించాలని కోరితే పట్టించుకోవడం లేదు. డీఎస్సీ అభ్యర్థుల న్యాయమైన డిమాండ్ కు బీజేపీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది.

ఆ రిటైర్డ్ పోలీసు వల్లే ఈ ఇబ్బందులు:

ఓ రిటైర్డ్ పోలీసు అధికారిని టీజీపీఎస్సీకి చైర్మన్ గా నియమించారు. ఆయన ఈ ఏడాది డిసెంబర్ లో రిటైర్డ్ కాబోతున్నారు. ఆలోపు తన హయాంలోనే ఉద్యోగులు భర్తీ అయ్యాయని చెప్పుకునేలా సదరు రిటైర్డ్ పోలీసు అధికారికి వచ్చిన తప్పుడు ఆలోచన వల్ల హడావిడిగా పోటీ పరీక్షలు నిర్వహిచాలని చూస్తున్నారని ఆరోపించారు. పరీక్షల మధ్య గ్యాప్ ఇవ్వాలని విద్యార్థులు అడిగితే దాన్ని ఇన్స్టిట్యూట్ మాఫీయా అని, పనిలేక ప్రతిపక్షాల చేస్తున్నాయని అని ఆరోపించడం ఈ రాష్ట్ర ప్రభుత్వ అనుభవ రాహిత్యానికి నిదర్శనం అన్నారు. గతంలో కేసీఆర్ కు అన్ని శిలాఫలకాలపై తన పేరే ఉండాలనే ఇలాంటి ఆలోచనే ఉండేదని విమర్శించారు.

అప్పుడో మాట ఇప్పుడో మాటనా?:

గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రతిపక్షంలో ఉండగా ఇదే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిండు సభలో డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట అధికారంలో ఉండగా మరో మాట మాట్లాడుతూ ఈ రాష్ట్ర నిరుద్యోగ యువత ఆశలను, ఆకాంక్షలను కాలరాస్తున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను, నిరుద్యోగ ఉద్యమాలను కొనసాగించాలని ఈరోజు బీజేపీ రాజకీయ తీర్మానం చేసిందన్నారు. నాలుగు వేల నిరుద్యోగ భృతికి బడ్జెట్ లేదు కానీ ఈ ముఖ్యమంత్రి ఏడు నెలలుగా ప్రతి నెల 4 లక్షల జీతం తీసుకుంటున్నారని విమర్శించారు.

కేసీఆర్ ను అరెస్ట్ కు ఇంకేం ఆధారం కావాలి?:

గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశానని ఎస్ఐబీ మాజీ చీఫ్ స్పష్టంగా చెప్పినా కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఇంకేం ఆధారాలు కావాలని ప్రశ్నించారు. మీకు నచ్చినప్పుడు అస్మదీయులకు ఒక రకంగా, తస్మదీయులకు మరోరకంగా లీకులు ఇచ్చిన ఈ ప్రభుత్వం కేసీఆర్ ను అరెస్ట్ చేసేందుకు ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు. కేసీఆర్ తో పాటు అనేక మంది నాటి మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఆరోపణలు వస్తే వారిని అరెస్టు చేయకుండా వారు పార్టీ మారాలని బేరం మాట్లాడుకుంటున్నారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణను ఎందుకు కోరణం లేదని ప్రశ్నించారు.



Next Story