మాకూ రిజర్వేషన్లు పెంచండి: ఓవైసీ

by GSrikanth |   ( Updated:2022-09-23 11:56:30.0  )
మాకూ రిజర్వేషన్లు పెంచండి: ఓవైసీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సామాజికంగా, విద్యాపరంగా ముస్లింలు వెనుకబడ్డారని వారికి రిజర్వేషన్లు 8 శాతం నుండి 12 శాతానికి పెంచాలని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓ మీటింగ్‌లో ఓవైసీ మాట్లాడిన వీడియోను ఎంఐఎం పార్టీ శుక్రవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రిజర్వేషన్ల అంశంపై ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని ముస్లింలకు జనాభా, సామాజిక -ఆర్థిక స్థితితో పోల్చినప్పుడు ప్రస్తుతం అమలు చేస్తున్న 4 శాతం రిజర్వేషన్లు సరిపోవని ఈ కోటాను తెలంగాణ ప్రభుత్వం పెంచాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన సుధీర్ కమిటీ రిపోర్ట్ ముస్లిం వెనుకబడిన వర్గాలకు 9-12 శాతం విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కలిపించాలని సూచించిందన్నారు. ఈ కమిటీ సిఫార్సులను అనుసరించి భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారం వెనుకబడిన ముస్లిం వర్గాలకు రిజర్వేషన్లు పెంపు కోసం కేసీఆర్ సర్కార్ కృషి చేయాలన్నారు.

రాష్ట్ర జనాభాలో 12.68 శాతం ముస్లింలు ఉండగా ప్రభుత్వ ఉద్యోగాల్లో వారు 7.36 శాతమే ఉన్నారని సుధీర్ కమిటీ తేల్చిందన్నారు. రాష్ట్రంలోని ముస్లింలకు వ్యవసాయేతర పనులే జీవనాధారంగా ఉందని, ముస్లిం విద్యార్థుల డ్రాపౌట్ శాతం ఎక్కువగా ఉందని పేదరికం కారణంగా ఇది జరుగుతోందని, 62 శాతం ముస్లింలకు పక్కా ఇళ్లు లేవని ఈ కమిటీ స్పష్టం చేసిందన్నారు. గిరిజనులకు రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని అదే సమయంలో తమ రిజర్వేషన్లను 4 శాతం నుండి సుధీర్ కమిటీ సూచించిన విధంగా 9-12 శాతానికి పెంచాలని కోరారు. దళితుల రిజర్వేషన్లు కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దళితుల జనాభా పెరిగిపోయిందని అందువల్ల వారికి 15 శాతం నుండి 17 శాతానికి రిజర్వేషన్లు పెంచాలన్నారు. రిజర్వేషన్లు 50 శాతం సీలింగ్ చేయడాన్ని క్రాస్ చేయాలన్నారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed