ఏయూ తెలుగు విభాగం-నవ సాహితీ ఇంటర్నేషనల్ చెన్నై ఇన్‌స్టిట్యూట్ మధ్య అవగాహన ఒప్పందం..

by Vinod kumar |
ఏయూ తెలుగు విభాగం-నవ సాహితీ ఇంటర్నేషనల్ చెన్నై ఇన్‌స్టిట్యూట్ మధ్య అవగాహన ఒప్పందం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్ర విశ్వకళా పరిషత్, తెలుగు విభాగం-నవ సాహితీ ఇంటర్నేషనల్ చెన్నై సంస్థ వారి మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదిరింది. తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు, నవ సాహితీ ఇంటర్నేషనల్ చెన్నై సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ వి సూర్యప్రకాశరావు అవగాహన పత్రాలను అందించుకున్నారు. నవ సాహితీ ఇంటర్నేషనల్ చెనై సంస్ధ దేశవిదేశాలలో వివిధ సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. నూతన రచయితల రచనలు ప్రోత్సహిస్తోంది. గొప్ప గొప్ప కవులను సమాజానికి అందించింది.

తెలుగు భాష పట్ల, సాహిత్యం పట్ల మక్కువ, అభిరుచి కలగజేసే లక్ష్యంతో నవ యువ కవులను, రచయితలను ప్రోత్సహించే ఆశయంతో ఏర్పడ్డ నవ సాహితీ ఇంటర్నేషనల్ చెన్నై సంస్థ అనేక సాహితీ సదస్సులు ఏర్పాటు చేస్తూ.. వివిధ ప్రాంతాల నుండి ప్రముఖ వ్యక్తులను రప్పించి వారిచేత మంచి సాహితీ ఉపన్యాసాలు ఇప్పించింది. యువకవులకు దిశానిర్ధేశం చేస్తూ.. తెలుగు సాహితీలోకానికి ఎనలేని సేవ చేస్తుంది.

అటువంటి నవ సాహితీ ఇంటర్నేషనల్ చెన్నై సంస్థతో ఆంధ్ర విశ్వకళా పరిషత్ తెలుగు విభాగం ఒప్పందం కుదుర్చుకోవటం ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది. ఈ ఒప్పందం ద్వారా ప్రతి సంవత్సరం ఒక జాతీయ సదస్సు, కథలు ఏలా రాయాలి..? అనే దానిపై ఒక కార్యశాల, కవిత్వం పై చర్చావేదికలు వంటివి ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా స్నాతకోత్తర, పరిశోధక విద్యార్ధులకే గాక నూతన రచనలు చేయాలనుకునే యవ కవులకు, రచయితలకు తెలుగు విభాగం వారధిగా ఉంటుందని తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు తెలియజేశారు.

Advertisement

Next Story