9 నెలల పాలనలో రెండు వేలకు పైగా అత్యాచారాలు! హరీష్ రావు సంచలన ఆరోపణలు

by Ramesh N |   ( Updated:2024-10-04 08:55:29.0  )
9 నెలల పాలనలో రెండు వేలకు పైగా అత్యాచారాలు! హరీష్ రావు సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో బాలికలకు, మహిళలకు భద్రత కరువైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని శుక్రవారం ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త తనును తీవ్రంగా కలచివేసిందన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినా నిర్లక్ష్యం వీడలేదని, ఫలితంగా ప్రతిరోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయని ఆరోపించారు.

9 నెలల కాంగ్రెస్ పాలనలో రెండు వేలకుపైగా అత్యాచారాలు జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని సంచలన ఆరోపణలు చేశారు. హోం మంత్రిత్వ శాఖను కూడా తానే నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో సీఎం రేవంత్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. గత ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. షీ టీమ్స్, సఖి భరోసా కేంద్రాలు ఏర్పాటుచేసి భద్రత కల్పించిందన్నారు. కానీ ఇందిరమ్మ రాజ్యం అని ఊదరగొట్టడమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యతలో మహిళా భద్రత లేదని తేటతెల్లమైందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి శాంతి భద్రతల పర్యవేక్షణకు చర్యలు చేపట్టాలని, మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీకి ఎక్స్ వేదికగా ట్యాగ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed