‘మోడీ, కేసీఆర్ దుర్మార్గ పాలనే మన అస్త్రం’

by Sathputhe Rajesh |   ( Updated:2024-03-29 14:52:55.0  )
‘మోడీ, కేసీఆర్ దుర్మార్గ పాలనే మన అస్త్రం’
X

దిశ, తెలంగాణ బ్యూరో : మోడీ, కేసీఆర్ దుర్మార్గ పాలనే మన అస్త్రమని ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో పీసీసీ ప్రచార కమిటీ మీటింగ్ జరిగింది. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పోరాడేది కేవలం బీజేపీతో కాదని, ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన దాని కంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రచారాన్ని హోరెత్తించాలని సూచించారు. ఆయా జిల్లాలో ఉన్న ప్రధానమైన అంశాలను, ప్రభుత్వం చేపట్టే చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నిజామాబాదులో షుగర్ ఫ్యాక్టరీ తిరిగి తెరవటం, పసుపు బోర్డు అంశాలపై ప్రచారంలో భాగంగా ప్రస్తావించి, వాటి పునరుద్ధరణకు ప్రభుత్వం చేపట్టే చర్యలను ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధిని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాలని, ఇందుకు గోడ రాతలతో పాటు హోర్డింగ్‌లను వినియోగించాలని, సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి రోజు 5 నుంచి 10 సోషల్ మీడియా కంటెంట్‌లు వస్తుంటాయని, వాటిని తెలుగులోకి సరైన విధంగా అనువదించి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానాలు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనూ టీపీసీసీ ప్రచార కమిటీ ప్రతినిధులను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ రాక్షస పాలన, పదేళ్ల పాలనలో మోడీ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలన్నారు. లోక్ సభ ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున ప్రతీ రోజూ మనకు ముఖ్యమేనని, సమయం వృథా చేయకుండా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కు మద్ధతు పెరిగేందుకు కృషి చేయాలన్నారు.

ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ... దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా బయటపడుతున్న ఎలక్ట్రోరల్ బాండ్ వ్యవస్థ ద్వారా మోడీ ప్రభుత్వం పాల్పడిన అవినీతిని ప్రజల్లో ఎండగట్టాలని మధుయాష్కీ గౌడ్ సూచించారు. గ్రామ మండల జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల ప్రజా పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రచారంలో జిల్లాల స్థాయిలో ఉన్న ప్రధాన ప్రధాన సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తున్న తీరును ప్రచారంలో ప్రజలకు వివరించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలో చక్కెర ఫ్యాక్టరీని తెరవటం, పసుపు బోర్డు ఏర్పాటు, బీడీ కార్మికుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తున్న తీరును మేనిఫెస్టోలో పెట్టి వివరించాలని సూచించారు.

ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు కలుగుతున్న మేలును కూడా విస్తృతంగా ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో బలంగా ఉన్న ఆయా సామాజిక వర్గాలను ఆకట్టుకునేలా కాంగ్రెస్ పార్టీ కార్యచరణ ఉండబోతుందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన వర్గాలను కాంగ్రెస్ పార్టీ కలుపుకొని ముందుకు పోతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించే అవకాశం ఉంటుందన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కొందరు హేళన చేస్తున్నారని, కానీ కార్లు లేనటువంటి ప్రతి ఒక్కరూ బస్సులను వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో హామీ భాగంగా ఇప్పటికే ప్రీ బస్సు ప్రయాణం, రూ.500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లకు ఉచిత కరెంటు, ఇప్పటికే 80 శాతం మంది రైతులకు రైతుబంధు అందించామన్నారు. ఐదు ఎకరాల లోపు అందరికీ ఇచ్చామన్నారు. నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పుతో ఖజానా ఖాళీ చేసినప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం నెల మొదటి రోజునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామమన్నారు.

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను సోషల్ మీడియాతో పాటు హోర్డింగ్‌లను వినియోగించుకుని ప్రచారం చేయాలని సూచించారు. అనంతరం కేసీఆర్, మోడీ పదేళ్ల దుర్మార్గ పాలన, కాంగ్రెస్ 100 రోజుల ప్రజా పాలన వివరిస్తూ రూపొందించిన ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి పవన్, ప్రచార కమిటీ కో కన్వీనర్ తీన్మార్ మల్లన్న, రమ్యారావు, ఆనంద్ వజీర్ ప్రకాష్ గౌడ్, దయాకర్, రవి, రవీందర్, నాగన్న, స్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story