ఆసక్తికరంగా భూపాలపల్లి రాజకీయం.. అదునుచూసి దూకుడు పెంచిన MLC?

by GSrikanth |   ( Updated:2023-01-23 05:37:00.0  )
ఆసక్తికరంగా భూపాలపల్లి రాజకీయం.. అదునుచూసి దూకుడు పెంచిన MLC?
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయం రంజుగా మారుతోంది. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆ త‌ర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ గూటికి చేరిన గండ్రకు, గ‌త ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓట‌మి పాలైన తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి మ‌ధ్య టికెట్ వార్ జ‌రుగుతోంది. ఎమ్మెల్యే గండ్రకు ఎదురుగాలి వీస్తోంద‌న్న వాద‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో బ‌లంగా చ‌ర్చ జ‌రుగుతోంది. కేసీఆర్‌తో త‌న‌కున్న అత్యంత సాన్నిహిత్యంతో మ‌ధుసూద‌నాచారి ఎమ్మెల్సీని ద‌క్కించుకుని మ‌ళ్లీ భూపాల‌ప‌ల్లి రాజ‌కీయాల్లో యాక్టీవ్ అయ్యారు. దీంతో గ‌త కొంత‌కాలంగా ఆయ‌న అనుచ‌రులు క్రియాశీల‌కంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. నిత్యం నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌ల్లెల‌ను చుట్టూముడుతున్న స్పీక‌ర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ త‌న‌కే వ‌స్తుంద‌ని కూడా అనుచ‌రుల‌తో వ్యాఖ్యనిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఇప్పటి వ‌ర‌కు ఎమ్మెల్సీ బ‌హిరంగ‌గా దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయ‌కున్నా గ్రౌండ్‌లో మాత్రం త‌న ప‌ని తాను చ‌క్కగా చేసుకుంటూ పోతున్నట్లుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది. అయితే ఎమ్మెల్సీ చారి రాజ‌కీయ అడుగు జాడ‌ల‌ను జాగ్రత్తగా గ‌మ‌నిస్తున్న ఎమ్మెల్యే గండ్ర ఆయ‌న ప్రభావాన్ని త‌గ్గించేందుకు కూడా రాజ‌కీయ చ‌ర్యలు తీసుకుంటున్నట్లుగా స్పష్టమ‌వుతోంది. అందులో భాగంగానే ఆదివారం భూపాల‌ప‌ల్లి జిల్లా కేంద్రంలో టీబీజీకేఎస్ కార్యాల‌యంలో శిలాఫ‌ల‌కంలో ఎమ్మెల్సీ చారి లేక‌పోవ‌డాన్ని కొంత‌మంది గుర్తు చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ద్వితీయ శ్రేణి నేత‌లు త‌న వ‌ర్గం నుంచి జారిపోకుండా, చారి వ‌ర్గంలోని వారిని త‌న వైపు తిప్పుకునేందుకు శ‌త‌విధాలా ప్రయ‌త్నాలు చేస్తున్నట్లుగా చేస్తున్నట్లు స‌మాచారం. ఇదంతా రాజ‌కీయ కోణంలో కామ‌న్‌గానే క‌నిపిస్తుంది. అయితే ఎన్నిక‌ల‌కు చాలా నెల‌ల ముందే టికెట్ వార్ ఇద్దరి నేత‌ల మ‌ధ్య మొద‌లైన సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి.

ఎమ్మెల్యే అనుచ‌రుల‌తో ఎఫెక్ట్‌..!

భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ బ‌ల‌ప‌డ‌టానికి ప్రధాన కార‌ణం ఎమ్మెల్యే గండ్ర, ఆయ‌న అనుచ‌రులేన‌న్న అభిప్రాయం స‌ర్వత్రా వినిపిస్తోంది. ఎమ్మెల్యే గండ్ర అండ‌దండ‌లు చేసుకుని మండ‌ల స్థాయిలోని కొంత‌మంది ప్రజాప్రతినిధులు, పార్టీ నేత‌ల ఆగ‌డాలు శ్రుతి మించిపోవ‌డ‌మే జ‌నంలో ఆయ‌న‌పై వ్యతిరేక‌త రావ‌డానికి ప్రధాన కార‌ణంగా పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే గండ్ర, ఆయ‌న స‌తీమ‌ణి భూపాల‌ప‌ల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా జ‌డ్పీ చైర్‌ప‌ర్సన్ గండ్ర జ్యోతి, వివిధ సామాజిక కార్యక్రమాల పేరుతో త‌న‌యుడు గౌత‌మ్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితుల‌ను చ‌క్కబెట్టేందుకు విప‌రీతంగా ప్రయ‌త్నాలు చేస్తున్నా, ఫ‌లితం మాత్రం ఆశించిన స్థాయిలో రావ‌డం లేద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఎమ్మెల్యే అనుచ‌రుల ఆగ‌డాల‌తో ముఖ్యంగా మొగుళ్లప‌ల్లి, చిట్యాల‌, రేగొండ మండ‌లాల్లో గండ్రపై తీవ్ర వ్యతిరేక‌త ఉన్నట్లుగా కూడా విశ్లేషిస్తున్నారు.

డివైడెడ్ టాక్‌తో చారిలో ఆశ‌లు..!

అదే స‌మ‌యంలో ఎమ్మెల్సీ మ‌ధు సూద‌నాచారికి టికెట్ వ‌స్తే నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయ ప‌రిస్థితిలో చాలా మార్పు ఉంటుంద‌ని కూడా కుండ‌బ‌ద్దలు కొడుతుండ‌టం గ‌మ‌నార్హం. ఈ డివైడెడ్ టాక్‌తోనే ఎమ్మెల్సీ మ‌ధు సూద‌నాచారి టికెట్ ద‌క్కించుకునేందుకు ఇప్పటినుంచి ప్రయ‌త్నాల‌ను ముమ్మరం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఎన్నిక‌ల‌కు కొద్దిరోజుల ముందు ఎమ్మెల్యేలు, ఆశావ‌హుల‌పై పొలిటిక‌ల్ స‌ర్వే నిర్వహిస్తార‌ని, ఆ స‌ర్వే రిపోర్ట్‌ త‌న‌కు అనుకూలంగా వ‌స్తుంద‌ని ఎమ్మెల్సీ చారి ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో టికెట్ ఖ‌చ్చితంగా త‌న‌కే వ‌స్తుంద‌ని అనుచ‌రుల వ‌ద్ద ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేప‌థ్యంలోనే చారి అనుచ‌రులు చాలా యాక్టీవ్ రోల్‌లోకి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఎమ్మెల్సీ క‌విత ప‌ర్యట‌న‌లో భాగంగా పెద్ద మొత్తంలోనే అనుచ‌రుల‌ను స‌మీక‌రించు బీఆర్ఎస్‌లోనే చారి వ‌ర్గానికి అనుకూలంగా ప‌రిస్థితుల‌ను మార్చేందుకు రెడీ చేస్తున్నట్లు స‌మాచారం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మ‌ధ్య మొద‌లైన టికెట్ వార్ స‌మీప భ‌విష్యత్‌లో నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల్లో ఎలాంటి మార్పును తీసుకు వ‌స్తుందో వేచి చూడాలి.

Also Read...

ఆలయ వేడుకలో తీవ్ర విషాదం.. నలుగురు దుర్మరణం

Advertisement

Next Story