సీఎం రేవంత్ రేసు గుర్రం కాదు.. గుడ్డి గుర్రం: MLC కవిత ఫైర్

by Satheesh |   ( Updated:2024-03-08 15:16:59.0  )
సీఎం రేవంత్ రేసు గుర్రం కాదు.. గుడ్డి గుర్రం: MLC కవిత ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముచ్చట్లు చెప్పే సీఎంగా రేవంత్ రెడ్డి మిగిలిపోతారని, ముచ్చటగా మూడునెలలే ఉండేటట్లు ఉన్నారని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. జీవో3ను రద్దు చేయాలని కోరుతూ భారత జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టారు. జీవో 3 రద్దు చేయాలని, జీవో 41 అమలు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. వద్దురా నాయాన కాంగ్రెస్ పాలన.. మహిళ వ్యతిరేకి కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రావాల్సిన వాటా వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి మాయమాటలు నమ్మి నిరుద్యోగులు బస్సు యాత్రలు చేశారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డల హక్కులను కాలరాస్తుందని దుయ్యబట్టారు. నియామకాల్లో మహిళల రిజర్వేషన్లను హరించే జీవో 3ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు పేరు చెప్పి ఆడ బిడ్డల గొంతు కోయవద్దని కోరారు.

సీఎం రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు మీద ఉన్న శ్రద్ధ ఆడపిల్లల ఉద్యోగాలపై లేదని మండిపడ్డారు. ఇప్పటివరకు జరిపిన నియామకాల్లో ఎంత మంది మహిళలకు ఉద్యోగాలు లభించాయన్న దానిపై వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో 3తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు తీవ్ర నష్టం జరుగుతుందని, త్వరలో గవర్నర్‌ను కలవబోతున్నట్లు ప్రకటించారు. జీవో రద్దు చేసేవరకు లీగల్‌గా ఫైట్ చేస్తానని స్పష్టం చేశారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని పూటకో మాట మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి రేసు గుర్రం కాదు.. గుడ్డిగుర్రం అని మండిపడ్డారు.

కేసీఆర్‌ను ఆడిపోసుకోవడం మానేసి ఆడబిడ్డలకు అన్యాయం చేసే జీవో3ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా చౌక్ అనుమతి కోసం మూడు రోజులుగా నాన్చి ఆలస్యంగా పర్మిషన్ ఇచ్చారు.. ఇదేనా ప్రజా పాలన అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల వాటా మహిళకు దక్కాల్సిందేనని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు కన్ఫ్యుజ్‌లో ఉన్నారని, నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం బేషరత్తుగా క్షమాపణ చెప్పాలన్నారు. పాత ప్రభుత్వంలో తప్పులు దొర్లితే సరిచేయాలన్నారు.

ఆడపిల్లల శవాల మీద పేలాలు ఏరుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వ్యక్తిగత కారణాలతో మరణించిన ఆడపిల్లల ఉదంతాన్ని కూడా కాంగ్రెస్ ప్రచారానికి వాడుకుందన్నారు. విద్యార్థులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఇప్పుడు అన్యాయం చేస్తున్నదన్నారు. గురుకులాల నియామకాల్లో జీవో 3ను అమలు చేయడం వల్ల మహిళలకు కేవలం 12 శాతం మాత్రమే రిజర్వేషన్లు లభించాయని స్పష్టం చేశారు. జీవోను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని, ముఖ్యమంత్రిని నిద్రపోనివ్వబోమని తేల్చిచెప్పారు. గురుకుల నియామకాల్లో వికలాంగులకు ఇవ్వాల్సిన 4 శాతం రిజర్వేషన్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రగతి నిరోధక మహిళా వ్యతిరేకిగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

ప్రభుత్వంలో పారదర్శకం లేదని, ముఖ్యమంత్రి ప్రజలను కలవడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రికి ప్రజా వాణి వినిపించదని, కేవలం ఢిల్లీ వాణి మాత్రమే వినిపిస్తుందని చెప్పారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రం పార్లమెంటుకు వెళ్లాలి, కానీ తెలంగాణ మహిళలు మాత్రం వంటింటికి పరిమితం కావాలా అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో నిండుకుండలా నీళ్లు ఉన్నా కూడా ఆ నీళ్లను పొలాలకు మలిపే తెలివిలేని ప్రభుత్వం ఉండడం మన దౌర్భాగ్యమని అన్నారు. రైతు బంధును ఖాతాలో వేయలేదని, 100 రోజుల తర్వాత ప్రతీ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్, జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు దేవి ప్రసాద్, రాజీవ్ సాగర్, గజ్జెల నగేష్, తాడూరి శ్రీనివాస్, అనిల్ కుర్మాచలం, గెల్లు శ్రీనివాస్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్ర తనోబా, నాయకులు ముఠా జై సింహా, గట్టు రామచంద్రరావు, రాజారాం యాదవ్, కోలా శ్రీనివాస్, భారత్ జాగృతి జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి మంచాల, స్టేట్ సెక్రెటరీ అనంతుల ప్రశాంత్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నరేందర్ యాదవ్, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Next Story