నదిని కబ్జా చేసిన మంత్రి.. 80 ఎకరాల రిజిస్ట్రేషన్: BJP MLA Raghunandan Rao

by Mahesh |   ( Updated:2023-04-18 12:01:39.0  )
నదిని కబ్జా చేసిన మంత్రి.. 80 ఎకరాల రిజిస్ట్రేషన్: BJP MLA Raghunandan Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో : వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణా నదిని కబ్జా చేసి ఫామ్ హౌజ్ కట్టుకున్నారని, దాని చుట్టూ ప్రహరీగోడే 165 ఎకరాల మేర ఉన్నదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. కబ్జా చేసిన భూమిలోనే ఫామ్ హౌజ్ నిర్మించుకున్నారని, ఆయన పేరు మీద అధికారికంగా 80 ఎకరాలు రిజిస్టర్ అయిందన్నారు. కృష్ణా నదిలో మట్టి పోసి మరీ చదును చేసుకున్నారని, అఫీషియల్‌గానే కబ్జా చేశారని ఆరోపించారు. బినామీల పేరు మీద సబ్సిడీలు పొంది ఆ తర్వాత ఆ భూములను తన కుటుంబ సభ్యుల పేరు మీదకు మార్చుకున్నారని ఆరోపించారు. నదితో పాటు ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) ప్రాజెక్టు అసైన్డ్ భూములను కబ్జా చేశారని రఘునందన్ రావు పేర్కొన్నారు.

చివరకు రిజిస్ట్రేషన్ వివరాలు బైటకు పొక్కకూడదన్న ఉద్దేశంతో తాసీల్దారు కార్యాలయాన్నే తగులబెట్టి ఆధారాలు లేకుండా చేశారని, ఆ ఫైర్ యాక్సిడెంట్ పాపం వ్యవసాయ మంత్రిదేనని ఆరోపించారు. ఈ అగ్ని ప్రమాదం వెనుక అధికారుల హస్తం లేదని నిరూపించగలరా అని సవాల్ విసిరారు. ప్రభుత్వ నిధుల గురించి వివరిస్తూ, దుబ్బాక నియోజకవర్గంలోని తండాలకు ట్రైబల్ ఫండ్ రిలీజ్ చేయాలని ఆ శాఖ మంత్రి మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని, కానీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫామ్‌హౌస్ విషయంలో మాత్రం ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి మరీ చొరవ తీసుకున్నారని ఆరోపించారు. మంత్రి ఫామ్ హౌజ్ ప్రాంతంలో గిరిజనులు నివసించే తండాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఆమె కనుసన్నల్లో రిలీజ్ అయిన ఫండ్స్ నిజంగా తండాలకు వెళ్ళాయో, మంత్రి ఫామ్ హౌజ్‌కు వెళ్ళాయో సత్యవతి రాథోడ్ వివరించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed