యాదగిరిగుట్ట కొండపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రీల్స్ !

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-20 11:11:37.0  )
యాదగిరిగుట్ట కొండపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రీల్స్ !
X

దిశ, వెబ్ డెస్క్ : హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట కొండపై శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయం ప్రాంగణం..పరిసరాల్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, తన సతీమణి, కూతురుతో కలిసి రీల్స్ చేశారు. సంబంధిత రీల్స్ వీడియోలు కౌశిక్ రెడ్డి ఫేస్ బుక్ లో పెట్టగా అవి వైరల్ గా మారడంతో ఈ విషయం వెలుగు చూసింది. పవిత్ర ఆలయ ప్రాంగణంలో ఆలయ సంప్రదాయాలు, నియమ, నిబంధనలకు విరుద్దంగా ఎమ్మెల్యే హోదాలో ఉన్న కౌశిక్ రెడ్డి రీల్స్ చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కౌశిక్ రెడ్డి రీల్స్ వ్యవహారంపై యాదగిరిగుట్ట దేవస్థానం ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

పక్క రాష్ట్రం ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలు రీల్స్ చేయడం వివాదస్పదమైంది. కొద్దిరోజుల క్రితం దివ్వెల మాధురితో పాటు దువ్వాడ శ్రీనివాస్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం కొండపై తిరుమల మాఢ వీధుల్లో రీల్స్ చేయడం వివాదానికి దారితీసింది. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి వారు పబ్లి్క్ న్యూసెన్స్ చేశారని టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బీఎన్ఎస్ 292, 296, 300 సెక్షన్స్ కింద దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలపై కేసు నమోదు చేసి, విచారణ నోటీస్ లు సైతం జారీ చేశారు. ఈ నేపథ్యంలో యాదగిరి కొండపై రీల్స్ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దేవస్థానం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story