మీ ఊరి స్కూళ్లో క్లాస్‌రూమ్‌కి మీ పేరు పెట్టుకోవాలనుందా?

by Web Desk |
మీ ఊరి స్కూళ్లో క్లాస్‌రూమ్‌కి మీ పేరు పెట్టుకోవాలనుందా?
X

దిశ, కోదాడ: ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులు, అధికారులతో నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, పాఠశాలలను బలోపేతం చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దూర దృష్టితో "మనఊరు-మనబడి, మనబస్తీ-మనబడి" కార్యక్రమాన్ని తీసుకొచ్చారని అన్నారు. మొదటి విడతగా నియోజకవర్గంలోని 83 పాఠశాలలను అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ రాష్ట్రం దేశంలోనే ముందంజలో దూసుకెళ్తోందని, విద్యారంగంలో కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్లు ఆయన గుర్తుచేశారు.

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి రూ.7,289 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా పాఠశాలల్లో గుర్తించిన సమస్యలు గుర్తించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులు ప్రారంభిస్తామని అన్నారు. ప్రతి పాఠశాల నిర్వహణ కమిటీ రెండు బ్యాంకు ఖాతాలను తెరవాల్సి ఉంటుందని, ఒక ఖాతాలో ప్రభుత్వం ఇచ్చే డబ్బులు, మరో ఖాతాలో ప్రజలు, పూర్వవిద్యార్థులు, దాతలు ఇచ్చే విరాళాలను జమ చేయాలన్నారు. ఈ ఖాతాల వివరాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచి మరిన్ని విరాళాలను సేకరంచాలన్నారు.

ఎవరైనా దాత రూ.2 లక్షలు ఇస్తే పాఠశాల కమిటీలో సభ్యుడిగా చేర్చుకోవచ్చని, రూ.10 లక్షలు అంతకు మించిన విరాళం ఇస్తే ఒక తరగతి గదికి దాతపేరు లేదా దాత సూచించిన పేరు పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, ఎన్‌ఆర్‌ఐలు, పూర్వవిద్యార్థులను భాగస్వాములను చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు చింతా కవితారెడ్డి, చుండూరి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీలు మందల కృష్ణకుమారి శేషు, పుల్లారావు, కొనతం ఉమ శ్రీనివాస్ రెడ్డి, బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబు, వైస్ ఎంపీపీ మల్లెల రాణి పుల్లయ్య, ప్రజా ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు సలీం షరీఫ్, గోపాల్ రావు, ఇంజినీరింగ్ అధికారులు, డీఈ రమేష్ బాబు, ఏఈలు రాము, ఓబులేష్, మధుకర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed