తండ్రి వెన్నంటే.. జాతీయ రాజకీయాల్లోకి ఎమ్మెల్సీ కవిత?

by Sathputhe Rajesh |
తండ్రి వెన్నంటే.. జాతీయ రాజకీయాల్లోకి ఎమ్మెల్సీ కవిత?
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత కీలకపాత్ర పోషించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి బీజేపీ, కాంగ్రేసేతర సీఎంలతో భేటీలు నిర్వహిస్తున్నారు. తండ్రి వెంట తనయ కూడా వెన్నంటే ఉంటుంది. గతంలో పార్లమెంట్ సభ్యురాలిగా పనిచేసిన సమయంలో రాజకీయ చతురతను చాటింది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లోనూ అనర్గళంగా మాట్లాడటం ఆమె సొంతం. ఇప్పుడు ఇతర రాష్ట్రాలతో కేసీఆర్ జరిపే చర్చల్లోనూ పాల్గొంటుండటం రాజకీయ వర్గాల్లోనూ... ఇటు పార్టీలోనూ చర్చనీయాశమైంది.

తెలంగాణ జాగృతిని స్థాపించిన కవిత తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది. జాగృతి ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు చేపట్టి గుర్తింపు పొందింది. 2014లో నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించి పార్లమెంట్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన కవిత, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2020లో విజయం సాధించారు. 2021లోనూ జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజకీయాలపై అవగాహన ఉంది. ప్రత్యర్థుల ఎత్తులను పసిగట్టి చిత్తుచేసే చరుత ఆమెది. అయితే గతకొంతకాలంగా నైరాశ్యంలో ఉందని, అందుకే కొన్ని పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉందనే ప్రచారం జరిగింది. అయితే వాటన్నింటికి కేసీఆర్ చెక్ పెట్టే నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై దృష్టిసారించిన కేసీఆర్... ఇతర రాష్ట్రాల సీఎంలతో భేటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మహారాష్ట్రకు కవితతో కలిసి కేసీఆర్ సీఎం ఉద్దవ్ ఠాక్రేను కలిశారు. అదే విధంగా ఎన్సీపీ అధినేత శరద్ పవర్ ను కలిశారు. పవర్ కుమార్తె సుప్రియతో కవితకు స్నేహం ఉంది. దీంతో ఆమెతో భేటీ అయ్యి పలు రాజకీయ అంశాలను సైతం చర్చించారు. ఆ తర్వాత ఢిల్లీ పర్యటనకు సైతం కవితను కేసీఆర్ వెంట తీసుకొని వెళ్లారు. అక్కడ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామితో పాటు రైతాంగ నాయకుడు రాకేష్ టీకాయత్ తో గురువారం భేటీ నిర్వహించారు. వారికి కవిత స్వాగతం పలికి భేటీలోనూ పాల్గొని పలు అంశలు చర్చించినట్లు సమాచారం. శుక్రవారం జార్ఖండ్ కు తనయ కవితతో కలిసి కేసీఆర్ వెళ్లారు. సీఎం హేమంత్ సోరెన్, ఎంపీ శిబుసోరెన్ తో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. ఈ భేటీలో సైతం కవిత పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్సీ కవితను కేసీఆర్ పలురాష్ట్రాల పర్యటనకు తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దూకుడు పెంచిన నేపథ్యంలో కవితను వెంట తీసుకెళ్తున్నారు. అక్కడి రాజకీయ పరిస్థితులతో పాటు ఆయా రాష్ట్రాల పరిస్థితులను తెలుసుకుంటూనే భవిష్యత్ లో చేపట్టబోయే కార్యాచరణకు రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. అందులో కవిత కీలక భూమిక పోషించనుందని పలువురు రాజకీయనాయకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎమ్మెల్సీ కంటే లోక్ సభనే బాగుందని కవిత వెల్లడించిన అభిప్రాయం ఇప్పుడు బలపడుతోంది. ఇప్పడు పలు రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ నిర్వహించిన భేటీలో కవిత కూడా పాల్గొంటుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed