Etela Rajender: టార్గెట్ ఈటల.. అసెంబ్లీలో నోరు తెరవకుండా విరుచుకుపడ్డ మంత్రులు!

by Satheesh |   ( Updated:2023-02-08 15:35:33.0  )
Etela Rajender:  టార్గెట్ ఈటల.. అసెంబ్లీలో నోరు తెరవకుండా విరుచుకుపడ్డ మంత్రులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను బీఆర్ఎస్ మంత్రులు కార్నర్ చేసుకున్నారు. అసెంబ్లీలో ఆయన నోరు తెరవకుండా ఉండేలా మంత్రులు ప్లాన్ చేశారు. ఈటల మాట్లాడినప్పుడల్లా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కనీసం తమకు తినడానికి, కూర్చోవడానికి, టాయిలెట్‌కు వెళ్లాలన్నా గది లేదని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. ఒక్కసారిగా మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి ఆయన్ను మాట్లాడనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. సభ పక్కదారి పట్టిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత సౌకర్యాల కోసం నేరుగా స్పీకర్ వద్దకు వెళ్లి మాట్లాడుకోవాలని సూచించారు. ఆపై ఈటల ప్రభుత్వ వైఫల్యాలు, బడ్జెట్ కేటాయింపులపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ సమయంలోనూ మంత్రులు ఈటలను మాట్లాడనివ్వకుండా ఎవరో ఒకరు కౌంటర్ ఇస్తూ వచ్చారు. ఇదిలా ఉండగా వాస్తవానికి ఈటల రాజేందర్ మాట్లాడిన సమయం కన్నా మంత్రుల కౌంటర్‌లకే ఎక్కువ సమయం తీసుకోవడం గమనార్హం. దీన్నిబట్టి ప్రతిపక్ష పార్టీల నేతలకు అసెంబ్లీలో మాట్లాడేందుకు ఎంత సమయం కేటాయిస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు.

అసెంబ్లీ అనంతరం ఈటల రాజేందర్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంపై మంత్రి కేటీఆర్, బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీష్ రావు వాళ్ల పార్టీ మీటింగ్‌లా భావించి స్వైరవిహారం చేశారన్నారు. హరీష్ మాటలు అబద్ధాల పుట్ట అని ఆయన విమర్శలు చేశారు. దేశంలో అత్యంత వేగంగా అప్పులపాలవుతున్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలను సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కంటే అధ్వానంగా మార్చారని ధ్వజమెత్తారు. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ బూటకమని, అది నిజమైతే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకొచ్చిందో సమాధానం చెప్పాలని ఈటల ప్రశ్నించారు.

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల భర్తీలో జరిగిన తప్పిదాలను సవరించాలని ఉద్యమం చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. మానేరులో కేసీఆర్ సొంత బంధువులు ఇసుక మాఫియా చేస్తున్నారని రాజేందర్ ఆరోపణలు చేశారు. ప్రభుత్వాన్ని ఎప్పుడు రద్దు చేస్తారనేది కేసీఆర్‌కే తెలియాలన్నారు. దేశాన్ని నడిపిస్తున్న పార్టీ బీజేపీ అని, అలాంటిది ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్క గది కూడా కేటాయించకూడదని కక్ష కట్టారని పేర్కొన్నారు. తమ హక్కులు కాపాడాల్సిన స్పీకర్ ముఖం చాటేస్తున్నారన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు అభివృద్ది ఫండ్ ఇవ్వని నీచమైన ప్రభుత్వం కేసీఆర్‌ది అని నిప్పులు చెరిగారు.

Also Read..

పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకే 'విజిట్ ఇండియా 2023': Kishan Reddy

Advertisement

Next Story

Most Viewed