Sunkishala project : 'సుంకిశాల ప్రాజెక్టు పాపం బీఆర్ఎస్‌దే..'

by Sumithra |
Sunkishala project : సుంకిశాల ప్రాజెక్టు పాపం బీఆర్ఎస్‌దే..
X

దిశ, నాగార్జునసాగర్ : హైదరాబాద్ మహానగర ప్రజల దాహార్తి తీర్చేందుకు నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో సుంకిశాల వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టులో సైడ్‌వాల్ కూలిన ఘటన పై నల్గొండ జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా.. సుంకిశాల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సందర్శించారు. కూలిన రిటైనింగ్ సైడ్వాల్ను పరిశీలించారు. నీట మునిగిన ఇన్టెక్ వెల్, పంపింగ్ స్టేషన్ను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దక్షిణ తెలంగాణను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటన చిన్నదే నష్టం కూడా తక్కువేనని తెలిపారు.

నష్టం కాంట్రాక్టర్ భరిస్తారు..

ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు టార్గెట్‌గా సంచలన ఆరోపణలు చేశారు.

జరిగిన సంఘటన చిన్నది.. నష్టం కూడా తక్కువే.. ఆ నష్టాన్ని కాంట్రాక్టర్ భరిస్తారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. ప్రాజెక్టు పూర్తి కాలేదు.. నిర్మాణంలో లేదు. నిర్మాణం పూర్తి కావడానికి ఒకటి, రెండు నెలలు పట్టేది. ప్రస్తుతం నిర్మాణం ఆలస్యం కానుంది. గత ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయలేదు. SLBC ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తాం. డిండి ఎత్తిపోతల పథకం కూడా పూర్తి చేస్తాం. బీఆర్ఎస్ నాయకులు ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. సుంకిశాల అన్ని పనులు బీఆర్ఎస్ హయంలోనే జరిగాయి.’ అని అన్నారు.

మంత్రి తుమ్మల ఫైర్...

సుంకిశాల ప్రాంతాన్ని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గత ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించిందన్నారు. ప్రాజెక్టు కూలిన ఘటన పై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. జరిగిన నష్టాన్ని నిర్మాణ సంస్థే భరిస్తుందన్నారు. ఘటన పై విచారం వ్యక్తం చేస్తున్నామని.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పనులు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాట్ కామెంట్స్...

ఉమ్మడి నల్లగొండ జిల్లా సాగుతాగునీటి అవసరాలకు ఎస్‌ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు పూర్తవ్వడం ఒక్కటే శాశ్వత పరిష్కారమన్నారు. బీఆర్ఎస్ చేపట్టిన సుంకిశాల అవసరం లేని సాగునీటి పథకమన్నారు. సుంకిశాల పథకాన్ని నేను ఆనాడే వ్యతిరేకించానన్నారు. సుంకిశాల కోసం పెట్టిన ఖర్చు ఎస్‌ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టుకు పెట్టి ఉంటే నల్గొండ జిల్లా రైతులకు, ప్రజలకు మేలు జరిగేదన్నారు. ఏఎమ్మార్పీ పథకం అంచనాలకు మించి గొప్పగా పనిచేస్తుందన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు మంచి పరిణామమన్నారు.

గోదావరి నది పై ప్రాజెక్టుల నిర్మాణం జరిగినంత వేగంగా.. కృష్ణా నది పై ప్రాజెక్టు పనులు జరగలేదని బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. ఈ ప్రాజెక్టు ఎందుకు ప్రారంభించారో కేసీఆర్, కేటీఆర్ కే తెలియాలని ఆరోపించారు. జంట నగరాలకు తాగునీరు అందించేందుకు సుంకిశాల అవసరం లేదని అన్నారు. ఇది కేసీఆర్ మానస పుత్రికనో లేక కేటీఆర్ మానస పుత్రికనో అర్థం కావడం లేదని విమర్శించారు. కేటీఆర్ రాజకీయ విమర్శలు చేయడం సరికాదని.. కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేయడం సరికాదని గుత్తా పేర్కొన్నారు

హైదరాబాద్‌ తాగునీటి సరఫరాకు ఆటంకం లేదు - సుంకిశాల ప్రాజెక్ట్ ఘటనపై జలమండలి

హైదరాబాద్ మహానగర ప్రజల దాహార్తి తీర్చేందుకు నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో సుంకిశాల వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టులో సైడ్‌వాల్ కూలిన ఘటన పై జలమండలి వివరణ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుని మేఘా ఇంజినీరింగ్ సంస్థ టెండర్ దక్కించుకొని, ఇన్‌టెక్ వెల్‌లో సంపు, పంపు హౌజ్, 3 టన్నెళ్లు, పంప్ హౌజ్ సూపర్ స్ట్రక్చర్‌ను నిర్మిస్తుంది. సుంకిశాల ప్రాజెక్టు ఇన్ టెక్‌వెల్ పనులు 60 శాతం పంపింగ్ మెయిన్ పనులు 70, ఎలక్ట్రో మెకానికల్ పనులు, 40 శాతం పూర్తైనట్లు జలమండలి తెలిపింది. ఆ ప్రాజెక్టును వర్షాభావ పరిస్థితులు వేసవి కాలంలో నిరంతరాయంగా హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా చేయడానికి నిర్మిస్తున్నట్లు జలమండలి వెల్లడించింది. 2021 జులైలో పనులు ప్రారంభం కాగా, రిజర్వాయర్ టన్నెల్ వైపున్న సైడ్‌వాల్స్ 2023 జులైలోనే పూర్తిచేశారని తెలిపింది. 2023 డిసెంబరు నాటికి మొత్తం 4 సైడ్ వాల్ బ్లాకుల్లో, 3 సైడ్ వాల్ బ్లాకులు రిజర్వాయర్ ఫుల్ లెవల్ ఎత్తు వరకు పూర్తయ్యాయని, సంపు ఫ్లోర్ లెవల్ 137 ఉండగా, 43 మీటర్ల నిర్మాణం పూర్తి చేశారని వివరించింది.

వరద పెరగడంతో సుంకిశాల ప్రాజెక్టు టన్నెల్ లో నీళ్లు..

ఈ ఏడాది జనవరి నాటికి నాలుగో సైడ్ వాల్ బ్లాక్‌రూఫ్ స్లాబ్ లెవల్ వరకు పనులు పురోగతిలో ఉన్నట్లు జలమండలి తెలిపింది. వచ్చే వేసవిలోగా నీరు అందించాలనే ఉద్దేశంతో మిడిల్ టన్నెల్ పూర్తి చేయడానికి ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం సంపువైపు టన్నెల్‌ పై గేటును ఏర్పాటు చేశారు. రిజర్వాయర్ వైపున్న మట్టిని తొలగించారు. రిజర్వాయర్‌కు వరద ఆలస్యంగా వస్తుందని ఏజెన్సీ భావించింది. మిడిల్ టన్నెల్ కోసం గేట్ ఫిక్సింగ్ పనులు చేపట్టింది. జులై 29, 30, 31న గేటు బిగింపు పనులు జరిగాయి. ఆ సమయంలో నాగార్జునసాగర్‌కు ఒక్కసారిగా 3.5లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో నీళ్లు టన్నెల్ లోకి చేరాయి. టన్నెల్ గేట్‌ ధ్వంసమై అనుసంధానంగా ఉన్న సైడ్ వాల్ కూలిపోయింది. ఇదంతా 5 నిమిషాల స్వల్ప వ్యవధిలోనే జరిగిందని జలమండలి వివరించింది.

రిజర్వాయర్ సంపు పూర్తి స్థాయి నీటి మట్టంతో నిండింది. ప్రస్తుత నీటిమట్టం తగ్గిన తర్వాత దెబ్బతిన్న సైడ్ వాల్ భాగాన్ని నిర్మాణ సంస్థ సొంత ఖర్చుతో పునర్మిస్తుందని జలమండలి వివరించింది. ఈ పునర్నిర్మాణ పనులకు సుమారు రూ.20 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. మార్చిలో పూర్తి చేయాలనున్న పనులు మరో 2 నెలలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని జలమండలి అభిప్రాయపడింది. ఈ ఘటన వల్ల హైదరాబాద్ తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగదని ప్రస్తుత సరఫరా వచ్చే ఏడాది వరకు యథావిధిగా కొనసాగుతుందని జలమండలి వెల్లడించింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి , ఎస్పీగా శరత్‌ చంద్ర పవార్‌, జిల్లా అధికారులు, జలమండలి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story