‘మీది మాటల ప్రభుత్వం.. మాది చేతల ప్రభుత్వం : బీఆర్ఎస్ ధర్నాపై మంత్రి తుమ్మల ఫైర్

by M.Rajitha |
‘మీది మాటల ప్రభుత్వం.. మాది చేతల ప్రభుత్వం : బీఆర్ఎస్ ధర్నాపై మంత్రి తుమ్మల ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : గత పదేళ్లలో అనేక ప్రభుత్వ పథకాలకు తిలోదకాలు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడం కంటే సిగ్గుమాలిన చర్య ఉంటుందా? అని మంత్రి తుమ్మలనాగేశ్వర్ రావు ప్రశ్నించారు. ‘మీది మాటల ప్రభుత్వం అయితే, మాది చేతల ప్రభుత్వం అన్నారు. చెప్పింది చేస్తాం. చేసిందే చెప్తాం. మీలా తిమ్మిని బమ్మి చేయడం, కల్లబొల్లి కబుర్లు చెప్పడం మాకు రాదు... అదీ యావత్ తెలంగాణ సమాజానికి తెలిసిన విషయమే’ అన్నారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. వాళ్ళ పదవి కాలంలో ఎగ్గొట్టిన రైతుబంధును, ఈ ప్రభుత్వం వచ్చాక , రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించి అప్పుల కుప్ప చేసినప్పటికి, రైతుబంధు డబ్బులు 7600 కోట్లు చెల్లించిన మమ్మల్నా మీరు విమర్శించేది? అని నిలదీశారు. పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ కూడా చెల్లించక చేతులెత్తేస్తే, మా ప్రభుత్వం గత బకాయిలు అన్ని చెల్లించి, వాటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తే మీరు నీతులా చెప్పేది? అన్నారు. పంట నష్టంజరిగితే నష్ట పరిహారం సంగతి అటుంచి, కనీసం రైతులను పరామర్శించని ఆ అర్భకులు అని మండిపడ్డారు. నాడు ఎమ్మెల్యేలను, అధికారులను కూడా అటువైపు వెళ్లొద్దని ఆదేశించింది మార్చిపోయారా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన పది నెలలలోనే రెండు విడతలు, నెల రోజుల్లోనే పంట నష్ట పరిహారం వడగళ్ళ వానకి మార్చిలో 15 కోట్లు, ఆగస్టు వరదలకు 79 కోట్లు రైతులకు చెల్లించిన మా ప్రభుత్వాన్నా వేలెత్తి చూపెట్టేది? అని ధ్వజమెత్తారు.

రైతుబంధు పేరు చెప్పి వ్యవసాయ యాంత్రికరణ, పంటల భీమా, డ్రిప్ ఇరిగేషన్ వంటి మరెన్నో పథకాలను అటకేక్కించి, రాష్ట్ర వాటా విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా దాదాపు 2500 కోట్లు రాకుండా చేసి తెలంగాణ రైతుల సంక్షోబానికి కారణం మీరు కాదా అని ప్రశ్నించారు. రుణమాఫీ 2014 లో నాలుగు వాయిదాలు పెట్టి, 2018 లో చివరి సంవత్సరం సగం మందికే చెల్లించిన ప్రభుత్వం మీది అయితే, ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాలలో బాకీపడ్డ రైతులు అందరికీ, వారు వదిలేసిన రైతులందరితో సహా, ఇంకొక లక్ష కలిపి మొదటి పంట కాలం లోపే రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. వరి వేస్తె ఉరి అని, మొక్కజొన్న వద్దు అని, సన్నాలు సాగు చేయమని, పత్తి వద్దని మీకు ఏది తోస్తే అది చెప్పి, ఏ ఒక్క సందర్భంలో కూడా మద్దతు ధర కల్పించి రైతులని ఆదుకున్న పాపాన పోనీ వైనం మీదైతే, పది నెలల కాలంలోనే దాదాపు రూ.383 కోట్లు వెచ్చించి, ప్రతి రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తూ, ఎకరానికి మీరు పెట్టిన పరిమితులను కూడా, దిగుబడుల ఆధారంగా పెంచుతూ, కొనుగోలు చేస్తున్న పద్దతి మా ప్రభుత్వానిదన్నారు.

సన్నాలకు 500 రూపాయలు బోనస్ ప్రకటించి, సన్నాలు సాగు చేస్తున్న రైతుకు ఎకరాకి అదనంగా రూ. 8వేల నుండి రూ. 10వేలు పొందేట్లు చేసి, రైతు అనేవారు సాయం కోసం చూడకుండా వాళ్ళ కాళ్లపైన వారు గర్వంగా నిలబడేట్టు చేస్తున్నామన్నారు. అనుకోని విపత్తులు సంభవించి పంట నష్టపోతే, రైతులు మళ్ళీ నైరాశ్యం లోకి పోకుండా, రైతులు కట్టాల్సిన ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించి అన్ని పంటలకి భీమా సౌకర్యం కల్పిస్తున్న మా ప్రభుత్వం ఎక్కడ? పంట భీమా ఎత్తేసి రైతులను అధోగతి పాలు చేసిన మీరెక్కడ? అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సాగు చేయని భూములకి కూడా రైతు బంధు ఇచ్చి, 5 ఏళ్లలో 25,000కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగం చేసారని అభిప్రాయం వ్యక్తం కాగా, రైతుల, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను స్వీకరించి, సబ్ కమిటీ వేసి, దాని నివేదిక ప్రకారం పెంచిన రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని మేమంటుంటే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక పంట కాలంలోనే 27,000 కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన విషయం తెలియదా? లేక రాజకీయంగా పుట్ట గతులు వుండవని తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు ఈ విధంగా నటిస్తున్నారా? అన్నారు. తెలంగాణ రైతులు మిమ్మల్ని ఇప్పటికే తిరస్కరించారని, ఇకనైనా వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక సలహాలు, సూచనలు చేస్తే తెలంగాణ రైతాంగం హర్షిస్తుందని లేదంటే చరిత్రలో మిమ్మల్ని ఇక క్షమించదన్నారు. రైతు బంధు పేరు చెప్పి మీరు ఎగ్గొట్టిన ప్రతి పథకాన్ని ఒక్కొక్కటిగా తిరిగి ప్రారంభిస్తామన్నారు. వ్యవసాయ యాంత్రికరణ, రైతులందరికి డ్రిప్ పరికరాలు, విత్తన సబ్సిడీ, అన్ని పంటలకు మద్దతు ధర, పంటల భీమా, శిక్షణ కార్యక్రమాలు, మట్టి నమూనా పరీక్షలు, ఇలా అన్నింటిని ఆరంభిస్తామని, 'ఆత్మ ' ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని బదలాయించడానికి కార్యక్రమాలు చేపడ్తామన్నారు. పథకాలు ఎగగొట్టడం అని బీఆర్ఎస్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందన్నారు.

Advertisement

Next Story