Sridhar Babu: ఎవరి అంతు ఎవరు తేలుస్తారో చూద్దాం.. బీఆర్ఎస్ నేతలపై శ్రీధర్ బాబు ఫైర్

by Prasad Jukanti |
Sridhar Babu: ఎవరి అంతు ఎవరు తేలుస్తారో చూద్దాం.. బీఆర్ఎస్ నేతలపై శ్రీధర్ బాబు ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పీఏసీ చైర్మన్ పదవి విషయంలో బీఆర్ఎస్ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు సెటైర్ వేశారు. ప్రభుత్వాన్ని నడపాలని ప్రజలు మాకు తీర్పు ఇస్తే ఫలితాల తర్వాత కూడా ఏదో జరుగుతుందని బీఆర్ఎస్ నేతల మాట్లాడారని దాంతో లోక్ సభ ఎన్నికల్లో వారిని ప్రజలు జీరో సీట్లకు పరిమితం చేసినా అధికారం కోల్పోయామన్న బాధతో బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీధర్ బాబు పదేళ్ల రాష్ట్రంలో పదేళ్లుగా ప్రజాస్వామ్య వ్యవస్థలను ఖూనీ చేసిందెవరని ప్రశ్నించారు. గతంలో వ్యవస్థలన్నింటినీ కాలరాస్తూ మా పార్టీ ఎమ్మెల్యేలను రహస్యంగా బీఆర్ఎస్ లో చేర్చుకుని భట్టి విక్రమార్కకు దక్కాల్సిన ఎల్పీ పదవిని దక్కకుండా బీఆర్ఎస్ ఏ విధంగా వ్యవహరించిందో యావత్ తెలంగాణ సమాజం చూసిందన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన వాళ్లే ఇప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. స్పీకర్ రాజ్యాంగ స్ఫూర్తితో పీఏసీ చైర్మన్ పదవిని శాసనసభ రూల్స్ ప్రకారమే ఓ ప్రతిపక్షానికి చెందిన శాసనసభ్యుడిని నియమించారని నమ్ముతున్నామన్నారు. స్పీకర్ ను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. స్పీకర్ చట్టప్రకారమే ముందుకు వెళ్తున్నారని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ పని చేస్తోందన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు.

ఎవరి అంతు ఎవరు తేలుస్తారో చూద్దాం..

పీఏసీ చైర్మన్ విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను తాను ఖండిస్తున్నానన్నారు. బీఆర్ఎస్ లో వాళ్లకు వాళ్లకు కొట్లాటలు ఉంటే మాకు సంబంధం లేదన్నారు. పీఏసీ చైర్మన్ అరికెపుడి గాంధీ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అని స్వయంగా చెప్పారని, పీఏసీ చైర్మన్ అయిన వారికి, కేసీఆర్ కు పడకపోతే మాకేం సంబంధం అన్నారు. మీ పార్టీ వ్యవహారాల్లో మీరే సక్రమంగా లేకుండా మాపై విమర్శలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో రాహుల్ గాంధీని ప్రశ్నించే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రభుత్వంపై రాజకీయంగా విమర్శలు చేయాలనే ఉద్దేశంతో పొద్దస్తమానం ఓ వైపు కేటీఆర్, మరో వైపు హరీశ్ రావు ట్వీట్లు చేస్తున్నారని విమర్శించారు. గడిచిన ఎనిమిదేళ్లుగా బీఆర్ఎస్ లో కేవలం కేటీఆర్, హరీశ్ రావు మాత్రమే మాట్లాడుతున్నారని పార్టీలో ఈ ఇద్దరు, ముగ్గురు మాట్లాడితే ప్రజాస్వామ్యమా అని నిలదీశారు. ఇకనైనా బీఆర్ఎస్ నేతలు తమ వైఖరిని మార్చుకోవాలని వ్యవస్థలను గౌరవించే విధంగా భగవంతుడు వారికి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. ఎవరి అంతు ఎవరు చూడాలో ప్రజలే నిర్ణయిస్తారని ఇప్పటికే రెండు సార్లు వారి అంతు ప్రజలు చూశారని మూడోసారి కూడా ప్రజలే తీర్పు ఇస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజా బలం ఉందని స్పష్టం చేశారు. దానం నాగేందర్ వ్యవహారం కోర్టులో ఉందని కోర్టులో ఉన్న అంశంపై తాను స్పందించనన్నారు. మా పరిపాలన చూసి ఎవరైనా మా పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed