Sridhar Babu: పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్ పై దాడి.. బీఆర్ఎస్ పై శ్రీధర్ బాబు సెన్సేషనల్ కామెంట్స్

by Prasad Jukanti |   ( Updated:2024-11-12 13:38:47.0  )
Sridhar Babu: పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్ పై దాడి.. బీఆర్ఎస్ పై  శ్రీధర్ బాబు  సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వికారాబాద్ జిల్లా లగచర్లలో (Lagacherla Attack) పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్‌పై దాడి జరిగిందని, ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) హెచ్చరించారు. బీఆర్ఎస్ (BRS) నేతలు అధికారం పోయిందనే భాధ, ఆక్రోశంలో కావాలనే ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా అడ్డుకోవడం, ఇబ్బందులు పెట్టడం, న్యాయపరమైన చిక్కులు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై మంత్రి శ్రీధర్‌బాబుతో వికారాబాద్ జిల్లా ఉన్నతాధికారులు ఇవాళ భేటీ అయ్యారు. ఐజీ సత్యనారాయణ, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి నిన్నటి ఘటనను వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారులపై దాడులు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని, అభివృద్ధిని అడ్డుకునే వారిపై చర్యలు తప్పవన్నారు. మొన్నటి గ్రూప్-1 పరీక్షలపై కూడా కుట్రలు చేశారని, కేసీఆర్ (KCR) తమ ఈర్ష్య, ద్వేషాన్ని ప్రజల పేరు చెప్పి వెల్లగక్కుతున్నారని మండిపడ్డారు.

కుట్రదారులను ప్రజల ముందుంచుతాం

జిల్లా కలెక్టర్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఈ దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. విచారణ అనంతరం దీని వెనుక ఉన్న కుట్రదారులెవరో రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఈ ఘటనను పసిగట్టడంలో ఇంటెలిజెన్స్, పోలీస్, ఇతర ఉన్నతాధికారుల వైఫల్యం ఉంటే దానికి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులు సభాస్థలికి రాకుండా అడ్డగించారని, దాంతో రైతుల వద్దకే వెళ్లి సమస్యలు తెసుకుందామని కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రయత్నిస్తే అధికారులపై దాడికి పాల్పడ్డారన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక దాడులు చేస్తే సహించబోమన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్పొచ్చని, ఆ దిశగానే తాము ముందుకు వెళ్తున్నామన్నారు. 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇస్తే బీఆర్ఎస్ ఓర్వలేకపోతున్నదని, పరిశ్రమలు ఏర్పాటు చేస్తుంటే వాటిని అడ్డుకునే కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో ముఖ్యమని, అందుకే గత బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమల విషయంలో కాంగ్రెస్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. బీఆర్ఎస్ విధానాలు నచ్చకపోతే న్యాయపోరాటం చేశామే తప్ప ఏనాడు ఇలాంటి ఘటనలకు పాల్పడలేదన్నారు.

కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో ఆయనకే తెలియాలి

మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఢిల్లీ పర్యటనపై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో మాకేం తెలుసని అన్నారు. వారి ఇబ్బందులను అధిగమించేందుకే ఢిల్లీకి వెళ్లి ఉంటారన్నారు. బట్టకాల్చి మీద వేయడమే బీఆర్ఎస్ విధానం అని, ఆ పార్టీ కింది స్థాయి నాయకత్వం నుంచి అగ్రస్థాయి వరకు అందరూ అదే పని చేస్తుంటారని విమర్శించారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. వారికున్న అనుభవాల్నీ ప్రభుత్వానికి సలహాలు చెప్పాలని మేము ఎన్నోసార్లు ఆహ్వానించినా బీఆర్ఎస్ మాత్రం అభివృద్ధికి అవరోధులుగా నిలుస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed