Minister Seethakka: హారీష్ ​రావే కారణం

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-04 16:01:19.0  )
Minister Seethakka: హారీష్ ​రావే కారణం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ సర్పంచ్‌లను బీఆర్ఎస్ నేతలు కావాలని రెచ్చకొడుతున్నారని మంత్రి సీతక్క(Minister Seethakka) పేర్కొన్నారు. సర్పంచ్ బిల్లుల పెండింగ్‌కు బీఆర్ఎస్సే కారణమని ఆమె సోమవారం ఓ వీడియోలో తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్‌ల ఆత్మహత్యలు, పెండింగ్ బిల్లులలపై కుప్పలు కుప్పులుగా వార్త కథనాలు వచ్చాయని ఆమె గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకపోవడమే కాకుండా బలవంతంగానూ పనులు చేయించిందన్నారు. సంవత్సరాల తరబడి బిల్లులు చెల్లించకుండా వారి ఆత్మహత్యలకు బీఆర్ఎస్ కారణమైందన్నారు. చంపినోడే తద్దినం పెట్టినట్లు బీఆర్ఎస్ వ్యవహరిస్తుందన్నారు. హరీష్ రావు(Harish Rao) ఇప్పుడు మాజీ సర్పంచ్ల మీద, ఏదో ప్రేమ ఉన్నట్టుగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బిల్లులు చెల్లించకుండా వారి ఆత్మహత్యలకు కారణమైన బీఆర్ఎస్, ఇప్పుడు నీతులు చెప్పడం విచిత్రంగా ఉన్నదన్నారు. ఆర్ధిక శాఖను అడ్డంపెట్టుకొని హరీష్​రావు సర్పంచ్‌ల ఆత్మహత్యలకు కారణమయ్యాడని వివరించారు. తాము పవర్‌లోకి వచ్చిన పది నెలల్లోనే బీఆర్ఎస్ పెండింగ్‌లో పెట్టిన రూ.580 కోట్ల రూపాయలను ఇప్పటికే చెల్లించామన్నారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. సర్పంచ్‌ల బకాయిల పై బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. అధికారం పోయాక సర్పంచ్‌లపైన బీఆర్ఎస్ నేతలు ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. పదుల సంఖ్యలో సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తర్వాత హరీష్​రావు ఏనాడూ పరామర్శించలేదన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల పేరుతో సర్పంచ్‌లతో లక్షలు ఖర్చు పెట్టించింది కేసీఆర్ సర్కారే అని గుర్తుచేశారు. సర్పంచ్‌ల గొంతు పైన కత్తి పెట్టి రైతు వేదికలు, స్మశాన వాటికలు కట్టించారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం వివిధ శాఖల్లో దాదాపు రూ.40 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed