- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Ponnam: గీత కార్మికులకు భారీ గుడ్ న్యూస్.. మంత్రి పొన్నం కీలక ప్రకటన!
దిశ, వెబ్‌డెస్క్/హుస్నాబాద్: గీత కార్మికుల రక్షణగా కాటమయ్య రక్షక కవచం తయారు చేయబడిందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్‌లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ కాటమయ్య రక్షక కవచాలను పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికులు చనిపోకుండా ఐఐటీ ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేసిన కాటమయ్య రక్షక కవచం ప్రాణాలు రక్షించుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఈ కిట్‌ను సీఎం దృష్టికి తీసుకువెళ్లి స్వయంగా అబ్దుల్లాపూర్ మెట్‌లో ఎలా పనిచేస్తుందో సీఎం స్వయంగా చూసి నిర్ణయం తీసుకుని ప్రతి గీత కార్మికునికి అందజేయాలని సూచించారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో శిక్షణ ఇచ్చే విషయంలో ఎక్కడా జాప్యం జరగకూడదని అధికారులను ఆయన ఆదేశించారు. అవసరమైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతో పాటు ఎమ్మెల్యే నిధులు, పార్లమెంటు సభ్యుని నిధులను కూడా వెచ్చించి పంపిణీ చేస్తామన్నారు. గీత కార్మికులు వృత్తిలో ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ భవిష్యత్తులో పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఆకాంక్షించారు. తాటి చెట్లు ఎత్తుగా ఉండటం వల్ల అసౌకర్యంగా ఉండడం మాట వాస్తవమేనని.. అందుకోసం చెట్లు ఎత్తు తక్కువగా ఉండేలా పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు.
అయితే, రోడ్ల వెంట ఇతర ప్రాంతాలలో నాటే చెట్లల్లో 50 శాతం తాటి, ఈత చెట్లనే కాలువలు, రోడ్ల పక్కన, చెరువుల గట్ల పైన నాటడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ కనీసం 10 మొక్కలు జన్మదిన సందర్భాలు, శుభకార్యాల సందర్భాలలో నాటి బాధ్యతను చాటుకోవాలన్నారు. తాటి, ఈత చెట్ల పెంపకానికి గాను స్థలం ఉంటే బోర్లు వేయించే బాధ్యత కూడా తీసుకుంటానని అందుకు ప్రతిపాదనలు కూడా పంపిస్తామన్నారు. అదేవిధంగా గీత కార్మికులకు సంబంధించి పాత బకాయిలు ఉన్నట్లయితే విడుదల అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.
వనాలకు పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుందని ఒక గీత కార్మికుడు అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు ఇస్తూ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్న కారణంగా ఇప్పుడు ఇవ్వడం సాధ్యం కాదని 2025 మార్చి తర్వాత గీత కార్మికులకు మోపెడు వాహనాలు అందిస్తామన్నారు. ప్రతి గీత కార్మికుడు వీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకొని ప్రాణాలు రక్షించుకోవాలని తెలియజేశారు. అంతకు ముందు ట్రైనర్ తాటి చెట్టు ఎలా ఎక్కాలో కాటమయ్య రక్షక కవచం ద్వారా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, సిద్దిపేట గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, ఆర్డీవో రామ్మూర్తి, ఎమ్మార్వో రవీందర్ రెడ్డి, డీపీవో, బీసీ సంక్షేమ శాఖ అధికారి, ఎక్సైజ్ సీఐ పవన్, ఎస్ఐ దామోదర్, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.