కాళేశ్వరంపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్

by Mahesh |   ( Updated:2024-01-02 14:02:15.0  )
కాళేశ్వరంపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నది. జనవరి 6తో ఈ అప్లికేషన్‌ల స్వీకరణ ముగియనున్నది. దీంతో ప్రభుత్వం గడువును పెంచుతుందా లేదా అనే చర్చ జరుగుతున్న వేళ దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. జనవరి 6వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని ఆ తర్వాత గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. మంగళవారం సెక్రటేరియట్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. అర్హులైన వారికి కుటుంబానికి ఒక్కటి చొప్పున ప్రభుత్వమే అప్లికేషన్ ఫారమ్ లు అందజేస్తుందని వాటి ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

కిషన్ రెడ్డికి కౌంటర్

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయని, సీబీఐ దర్యాప్తు చేయించకుండా గత బీఆర్ఎస్ పాలకులను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ప్రతిపాదిత బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అనేక చిలకపలుకులు పలుకుతున్నారని, కేసీఆర్ స్క్రిప్ట్ నే కిషన్ రెడ్డి చదివి వినిపించారని ఎద్దేవా చేశారు. దీని ద్వారా రాబోయే ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందనే ఇలా మాట్లాడుతున్నారని కానీ అటువంటిదేమీ జరగదన్నారు. కిషన్ రెడ్డి కోరుతున్నట్లుగా సీబీఐ దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీబీఐ అనేది కేంద్ర సంస్థ ఆధ్వర్యంలో పని చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా రాయకపోయినా కేంద్ర మంత్రి హోదాలో కేంద్ర పెద్దలకు లేఖ రాసి సీబీఐ దర్యాప్తును చేయించవచ్చన్నారు.

కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉన్నప్పటికీ ఎంక్వయిరీకి మేమే అడ్డుపడుతున్నట్లుగా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కానీ కేసీఆర్‌ను రక్షించేందుకే కిషన్ రెడ్డి సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్నారని ధ్వజమెత్తారు. సీబీఐ దర్యాప్తులో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని సీబీఐ దర్యాప్తు చేస్తున్న లిక్కర్ స్కాం, సహారా స్కామ్ కేసులతో పాటు ఇతర అనేక స్కామ్‌లలో ఎంత మందికి శిక్ష పడిందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియరీ ఎంక్వయిరీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కిషన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తన కేంద్ర మంత్రి పరపతిని ఉపయోగించి సిట్టింగ్ జడ్జితో కేటాయించే ప్రయత్నం చేయాలన్నారు. కిషన్ రెడ్డి కేసీఆర్ కు బినామీ అని, బండి సంజయ్ ని తప్పించి కేసీఆర్ కు కిషన్ రెడ్డి నీడలా వ్యవహరిస్తారని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. అనవసర రాజకీయం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చేందుకు కిషన్ రెడ్డి ఎలాంటి సహకారం ఇస్తారో చెప్పాలన్నారు.

డ్రైవర్ల ధర్నాపై కేంద్రం స్పందించాలి..

కేంద్రం తీసుకున్న న్యాయ సంహిత 2023 చట్టం పై దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేస్తుంటే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి దీనిపై స్పందించడం లేదన్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసి డ్రైవర్లతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాన్నారు. నేరస్తులకు శిక్ష పడకూడదని తాను అనడం లేదని డ్రైవర్ల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. డ్రైవర్ల ధర్నా చాలా సెన్సిటివ్ ఇష్యూ అని దీని వల్ల సామాన్య జన జీవనం పై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ ఎంపీలు, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కిషన్ రెడ్డి వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలన్నారు.

Advertisement

Next Story